బాబ్రీ మసీదు కూల్చివేత: నాడు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న జర్నలిస్టులు ఏం చెప్తున్నారు?
"దోచుకోవడం అంటే నేను ఆరోజే చూశాను. ఎవరికైనా దొరికితే నన్ను కొడతారేమోనని, కాపాడేవాళ్లు కూడా ఎవరూ ఉండరేమోనని మనసులో చాలా భయం కలిగింది."
"కూల్చివేత జరుగుతున్నప్పుడు ఎస్ఎస్‌పీ డీఎం కూర్చుని టీ తాగుతుండడం మేం చూశాం."
"నేను ఈ కేసులో 19వ సాక్షిని. నన్ను క్రాస్-ఎగ్జామినేషన్ చేసి, స్టేట్మెంట్ తీసుకుని 8-9 ఏళ్లవుతోంది."
"అశోక్ సింఘాల్ ఆ సమయంలో అందరికంటే పెద్ద నాయకుడు. ఆయన్నే చుట్టుముట్టేసిన కరసేవకులు, ఆయనతో చాలా దురుసుగా ప్రవర్తించారు. మీరు నేతాగిరీ చేస్తున్నారని, దీనితో రాజకీయం చేయాలనుకుంటున్నారని నానా తిట్లూ తిట్టారు. మేం మసీదును కూల్చేస్తామని అన్నారు."
"కరసేవకుల పేరుతో వచ్చిన వారిని నేను చూస్తున్నా.. వారు చేతులతో కొడుతున్నారు. కొందరి చేతులనుంచి రక్తం వస్తోంది. ఎవరికో చెయ్యి విరిగింది. అదంతా చూస్తుంటే... అలా చేస్తే మనం నేరుగా స్వర్గానికి చేరుకుంటామని వారు అనుకుంటున్నట్లు అనిపించింది."
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతను తమ కళ్ళతో చూసిన పాత్రికేయుల మాటలివి.
1992 డిసెంబర్ 6.. కరసేవ కోసం ఈ రోజును లాంఛనప్రాయంగా నిర్ణయించారు. అయితే, సుప్రీంకోర్టు శాంతిపూర్వక కరసేవకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఆ రోజున దాదాపు లక్షకు పైగా కరసేవకులు అయోధ్య చేరుకున్నారు.
అంతకుముందు రోజు అటల్ బిహారీ వాజ్‌పేయి లఖ్‌నవూ ర్యాలీలో మాట్లాడుతూ... "అక్కడ మొనదేలిన రాళ్లున్నాయి. వాటిపై ఎవరూ కూర్చోలేరు. అందుకే, కూర్చునేందుకు అనువుగా భూమిని చదును చేయాల్సుంటుంది" అని అన్నారు.
ఘటానాస్థలంలో ఉన్న విలేకరులు ఆ రోజు ఏం చూశారు?
రామ్‌దత్ త్రిపాఠి, 'బీబీసీ హిందీ' కోసం పనిచేసిన జర్నలిస్ట్ చెప్పిన కథనం ప్రకారం…
"నవంబర్ 30 నుంచే అక్కడ వాతావరణం వేడెక్కడం మొదలైంది. వచ్చిన కరసేవకులు, అక్కడ సమాధుల్లాంటివి ధ్వంసం చేశారు. వివాదాస్పద బాబ్రీ మసీదు ఎక్కడుందో ఆ ప్రాంతం వెనకే ముస్లిం జనాభా కూడా నివసిస్తోంది. బయటి నుంచి వచ్చిన కరసేవకులు చాలా దూకుడుగా ఉన్నారు.
చాలామంది కరసేవకులు పూజ మాత్రమే కాకుండా, ఈసారి ఏదైనా భారీగా చేయాలనుకున్నారు.
బాబ్రీ మసీదుకు దాదాపు 200 మీటర్ల దూరంలోని రామ్ కథా కుంజ్‌లో ఒక పెద్ద స్టేజ్ వేశారు. 9 గంటలకు మీటింగ్ మొదలైంది. స్టేజి మీద బీజేపీ, వీహెచ్‌పీ నేతలు, సాధువులు, గురువులు ఉన్నారు.
అక్కడనుంచి హఠాత్తుగా జై శ్రీరాం నినాదాలు మొదలయ్యాయి. కాసేపట్లోనే వాళ్లంతా పరిగెడుతూ వచ్చారు. కొంతమంది తాళ్ల సాయంతో, కొంతమంది వేపచెట్ల పైనుంచి మసీదు భవనంపైకి ఎక్కడం మాకు కనిపించింది. పైకి ఎక్కగానే బిగ్గరగా నినాదాలు చేశారు. మొత్తం పరిసరాలు నినాదాలతో మారుమోగాయి."
శరద్ ప్రదాన్ చెప్పిన వివరాలు…
"కరసేవకులు భారతదేశం నలుమూలల నుంచి వస్తున్నారు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ కరసేవకుల బ్యాచ్ వచ్చిందని ప్రకటించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి కరసేవకులు వస్తున్నారని అన్నారు. ఒడిశా నుంచి వస్తున్నారు. ఆంధ్ర, మహారాష్ట్ర నుంచి చాలామంది వచ్చారు. చాలామంది శివసైనికులు కూడా ఉన్నారు.
సమీపంలోని సీతా రసోయీ భవనం నుంచి అంతా పర్యవేక్షిస్తున్నారు.
మొదట్లో వాళ్లు ప్రోత్సహించారు. మిగతా సీఆర్పీఎఫ్ బలగాలు లోపలున్నాయి. కరసేవకులు వారిపై రాళ్ల వర్షం కురిపించడంతో అక్కడి సీఆర్పీఎఫ్ కూడా తమ ప్రాణాలు కాపాడుకోడానికి పారిపోయింది. దాంతో, పరిస్థితి పూర్తిగా అక్కడ మసీదును పడగొడుతున్న వారి నియంత్రణలోకి వెళ్లిపోయింది."
రాజేంద్ర కుమార్, 'రాష్ట్రీయ సహారా' ఫొటోగ్రాఫర్
"ఉమాభారతి, అడ్వాణీ, కల్‌రాజ్ మిశ్రా, మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్ లాంటి వారు వివాదాస్పద స్థలం పరిసరాల్లో ఏర్పాట్లు చూడ్డానికి వచ్చినపుడు నేను వారందరినీ ఫొటోలు తీశాను.
సమయం గడిచేకొద్దీ అక్కడ ఒక భారీ గుంపు గుమిగూడింది.
నన్ను పట్టుకుని కొట్టడం మొదలెట్టారు. మా మిగతా సహచరులను కూడా తీవ్రంగా కొడుతున్నారు. నన్నైతే చాలా దారుణంగా కొట్టారు. నా దవడ విరిగింది. కెమెరా లాంటివి కూడా లాక్కున్నారు.
నేను 6వ తేదీ ఉదయం అక్కడికి వెళ్లినప్పుడు, ఐజీ, సీనియర్ అధికారులంతా ఉన్నారు. క్లోజ్ సర్క్యూట్ కెమేరాలు కూడా ఉన్నాయి. కరసేవకులు పైకి ఎక్కడం మొదలెట్టినపుడు వారిని అడ్డుకోడానికి వివాదాస్పద స్థలం పరిసరాల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది కేవలం రెండు మూడు నిమిషాల పాటే చర్యలు తీసుకుంటూ కనిపించారు."
ఖుర్బాన్ అలీ, 'బీబీసీ ఉర్దూ' కోసం పనిచేసిన జర్నలిస్ట్...
"మొదట్లో ఖాకీ నిక్కర్, నల్ల టోపీ పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ కమాండోలు మసీదును కూల్చాలనుకుంటున్న కరసేవకులను అడ్డుకోడానికి ప్రయత్నించడం మేం చూశాం. స్వయంగా లాల్ కృష్ణ అడ్వాణీ కూడా మొదట అలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది. కానీ ఆ గుంపు ఆగేలా లేదు. దాంతో, అక్కడున్న బీజేపీ నేతలు, ముఖ్యంగా ఉమాభారతి, సాధ్వీ రితంభరా లాంటి వారు చాలా వేడుకలు చేసుకున్నారు.
పెద్ద పెద్ద తాళ్లతో గుమ్మటాలను లాగేస్తున్నారు. కొంతమంది కరసేవకులు పునాదులను తవ్వుతున్నారు.
మమ్మల్ని చూడగానే, ముఖ్యంగా బీబీసీ ప్రతినిధి మార్క్ టలీని చూడగానే అక్కడ ఉన్న జనం తీవ్రంగా రెచ్చిపోయారు. మమ్మల్ని కొట్టడం మొదలెట్టారు. దాంతో మేం మార్క్ టలీని కాపాడే ప్రయత్నం చేశాం. మార్క్ టలీని ఎందుకు తీసుకొచ్చారంటూ, దానికి వారు మాకు శిక్ష వేస్తున్నారు.
కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు, పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నారు?
ఈసారి కూల్చేయాలని వాళ్లు గట్టిగా నిర్ణయించుకున్నారు. దానికి వాళ్లు ఏమాత్రం భయపడ్డం లేదు. ఎందుకంటే వ్యతిరేక ప్రభుత్వం లేదు. ఉన్న ప్రభుత్వంపై వారికి పూర్తి నమ్మకం ఉంది. దాంతో అక్కడ 'యే అందర్‌కీ బాత్ హై, పోలీస్ హమారా సాత్ హై'... అంటే ఇది అంతర్గత అంశం, పోలీసులు మన వెంటే ఉన్నారు... అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి."
'జర్దాద్ మర్కజ్' పత్రిక జర్నలిస్ట్ హిసామ్ సిద్ధిఖీ…
"ఓవైపు వాళ్లు మసీదు ధ్వంసం చేయడం మొదలుపెడితే, మరోవైపు భారీ సంఖ్యలో ఉన్న కరసేవకులు విలేకరులను వెతకడం మొదలుపెట్టారు. ఏ జర్నలిస్టులు కెమెరాతో ఉన్నారో, వారు ఫొటోలు తీయకుండా, అది రికార్డుల్లోకి ఎక్కకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు."
కానీ కేంద్ర భద్రతా బలగాలు ఎందుకు చేరుకోలేదు?
"కేంద్ర భద్రతా బలగాలకు దిల్లీ నుంచి వైర్‌లెస్‌లో సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాలనుకున్నారు. మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. ఎందుకంటే, ఏ ఫోర్స్ అయినా తమంతట తాముగా వెళ్లలేదు. లాఠీఛార్జ్, ఫైరింగ్ ఆదేశాలు కూడా మెజిస్ట్రేట్ ఇస్తారు. డీఎం వారికి పర్మిషన్ ఇవ్వలేదు. మేం ముఖ్యమంత్రిని అడుగుతాం అన్నారు. అక్కడ లాఠీఛార్జ్, కాల్పులు జరగకూడదు, అవి లేకుండా ఆపగలిగితే ఆపండని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్ఏఎఫ్ కమాండర్ వీఎం సారస్వత్ కూడా మాకు అదే విషయం చెప్పారని" రామ్‌దత్ త్రిపాఠీ తెలిపారు.
"నాలుగైదు గంటల సమయానికి గుమ్మటాన్ని పడగొట్టారు. ఆ తర్వాత అక్కడ ఒక్క నేత కూడా కనిపించలేదు.
కొంతమంది చుట్టుపక్కల ముస్లిం బస్తీలను కూడా తగలబెట్టారు. కొందరిని కొట్టారు. అయితే స్థానిక ముస్లింలు మాత్రం, అక్కడ జరిగిన హింస మొత్తం బయటి వారు చేశారని, స్థానికులతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. మందిరం కోసం ఉద్యమాలు చేసినవారు కూడా అక్కడి వారిని కాపాడారు.
దీంతో కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ ప్రాంతంలో తాత్కాలిక ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ ప్రాంతం సీఆర్పీఎఫ్ నియంత్రణలో ఉంది" అని రామ్‌దత్ త్రిపాఠీ వివరించారు.
రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ..."సాయంత్రం రామచంద్ర పరమహంస్ పర్యవేక్షణలో ఆ మొత్తం పరిసరాలను చదును చేయాలని, దాని చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు.
మమ్మల్ని వాళ్లు కొడుతున్నప్పుడు ఒక వృద్ధుడు మమ్మల్ని కాపాడాడు కూడా. ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన నన్ను కాపాడి గుంపులో నుంచి బయటకు తీసుకొచ్చారు" అని చెప్పారు.
"చాలా మందిని చూశాం. వారిలో అయోధ్య సాధువులు కూడా ఉన్నారు. వారిలో ఒకరిద్దరు ఏడుస్తున్నారు. మేం ఇక ప్రపంచానికి మా ముఖం చూపించలేం అని ఒక సాధువు అన్నారు. అలా కూడా జరిగింది. అంతా ఏకపక్షంగానే జరిగిందని కూడా మేం చెప్పడం లేదు." అని హిసామ్ సిద్ధిఖీ తెలిపారు.
ఖుర్బాన్ అలీ మాట్లాడుతూ…."నాలో ఓ ఆశ కూడా ఉంది. అది తర్వాత సరైనదేనని రుజువైంది. మనది ఇంత పెద్ద దేశం. ఇక్కడ ఎన్నో నాగరికతలు, సంస్కృతులు, భాషలు ఉన్నాయి. వారంతా ఈ ఘటనను తట్టుకోగలరా అనుకున్నా. మూడు రోజుల తర్వాత ఇండియా గేట్ దగ్గర జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. వారిలో ముస్లింల కంటే ఎక్కువగా ముస్లిమేతరులే ఉన్నారు. క్రిస్టియన్లు, జైనులు, హిందువులు ఉన్నారు. వారంతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు, అప్పుడే అంతా ముగిసి పోలేదని నాకు అనిపించింది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం ఉద్యమంతో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది
- అయోధ్య రామమందిరం: మోదీ ముఖ్య అతిథిగా శంకుస్థాపన...ఇది భారత్ స్వరూపాన్నే మార్చేస్తుందా?
- అయోధ్య రామ మందిరం: స్థలం చదును చేస్తున్నప్పుడు దొరికిన అవశేషాలతో కొత్త వివాదం
- అయోధ్య: బాబ్రీ మసీదు తాళాలను రాజీవ్‌గాంధీ తెరిపించారా? ఏం జరిగింది?
- రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్
- కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- అయోధ్య తీర్పు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)