నటి శ్రావణి ఆత్మహత్య కేసు: ‘ప్రేమ పేరుతో వాడుకున్నారు.. పెళ్లి అనేసరికి ఇతరులతో సంబంధాలు అంటగట్టారు’ - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

టీవీ నటి శ్రావణి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది.

‘‘ప్రేమ పేరుతో వాడుకొన్నారు. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెకు ఇతరులతో సంబంధాలు అంటగడుతూ మానసికంగా వేధించారు. ఇది భరించలేకే టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

ఈ కేసులో సోమవారం ఇద్దరు నిందితులను ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ కేసు వివరాలు వెల్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 22న శ్రావణి తన ఫ్రెండ్‌ సమీర్‌ బర్త్‌ డే పార్టీలో తాను దేవరాజ్‌రెడ్డిని పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించింది.

దీనిపై స్పందించిన దేవరాజ్‌రెడ్డి.. ‘నీకు అశోక్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో సంబంధాలు ఉన్నాయి’ అంటూ నిరాకరించాడు.

కాగా, శ్రావణి తనకు ఎవరితో సంబంధాలు లేవంటూ దేవరాజ్‌రెడ్డిని చాటింగ్‌ ద్వారా సముదాయిస్తూనే ఉంది. సెప్టెంబర్‌ 7న రాత్రి దేవరాజ్‌రెడ్డి శ్రావణిని ఓ హోటల్‌కు డిన్నర్‌కు తీసుకెళ్లాడు.

అక్కడికి సాయికృష్ణారెడ్డి వచ్చి దేవరాజ్‌తో గొడవ పడి, శ్రావణిని కొట్టి ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు.

తనను కుటుంబసభ్యులు, అశోక్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని శ్రావణి ఫోన్‌లో దేవరాజ్‌రెడ్డికి చెప్పింది.

సెప్టెంబర్‌ 8న రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి కారణమని విచారణలో పోలీసులు తేల్చార’’ని నమస్తే తెలంగాణ వివరించింది.

హీరో సూర్య వ్యాఖ్యలతో కలకలం

సినీ నటుడు సూర్య వ్యాఖ్యలపై తమిళనాట కలకలం రేగిందని సాక్షి కథనం ప్రచురించింది.

‘‘తమిళనాడులో నీట్‌ పరీక్షకు ముందు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తమిళ హీరో సూర్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్‌ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు.

అయితే, సూర్య తమిళంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆంగ్లంలో అన్వయించుకోవడంలో జరిగిన పొరపాటు వల్లనే జస్టిస్‌ సుబ్రమణ్యం తీవ్రంగా స్పందించారని కొందరు అభిప్రాయపడుతున్నారని సాక్షి రాసింది.

ఈ నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసిందని సూర్య ట్విట్టర్‌లో స్పందించారు.

కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలిస్తున్నారని, అయితే విద్యార్థులను మాత్రం నిర్భీతిగా వెళ్ళి పరీక్షలు రాయమని ఆదేశించడంలో నైతికత లేదని సూర్య ట్వీట్‌ చేసినట్లు జస్టిస్‌ సుబ్రమణ్యం తన లేఖలో పేర్కొన్నారు.

అయితే సూర్య చేసిన ట్వీట్‌లో ‘‘అలాంటప్పుడు, నైతికత లేదు’’ అనే పదాలు లేవని, జడ్జి అన్వయం చేసుకోవడంలో పొరపాటుపడి ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారని పత్రిక రాసింది.

మరోవైపు సూర్యపై ఎటువంటి చర్యలు చేపట్టొద్దని, ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు సాయపడ్డారని, ఒక దుర్ఘటనపై కళాకారుడి స్పందనను తీవ్రమైనదిగా పరిగణించరాదని ఆరుగురు మాజీ జడ్జీలు, కొందరు ప్రముఖ న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని సాక్షి వివరించింది.

మెరుగుపడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకున్నట్లు ఆయన తనయుడు చెప్పారని ఈనాడు కథనం ప్రచురించింది.

‘‘కరోనా వైరస్‌తో పోరాడుతున్న గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఎస్పీబీ ఆరోగ్యం మరింత మెరుగుపడినట్టు ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ వెల్లడించారు.

ఊపిరితిత్తుల పనితీరు మెరుగైనట్లు ఎక్స్‌-రేలో కనిపించిందన్నారు. 20 నిమిషాల పాటు కూర్చొని వ్యాయామాలు చేస్తున్నారని చెప్పారు.

ఫిజియోథెరఫిస్టులు ఆయనతో వ్యాయామాలు చేయిస్తున్నారని చరణ్‌ వివరించినట్లు ఈనాడు రాసింది.

కరోనా వైరస్‌ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

ఒకానొక దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందించారు.

ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

తప్పుడు సమాచారం ఇస్తే కూల్చేస్తాం: కేటీఆర్

టీఎస్-బీపాస్ ద్వారా భవన నిర్మాణాల్లో తప్పుడు సమాచారం ఇస్తే భవనాలు కూల్చివేస్తామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

‘‘తెలంగాణ సర్కార్ టీఎస్-బీపాస్ బిల్లు ద్వారా స్వీయ ధ్రువీకరణ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు ఇస్తామని, ఇందులో తప్పుడు సమాచారమిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేస్తామని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరిపితే కూల్చివేస్తారన్న భయం ఉండాల్సిందేనని అన్నారు. అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారులకు జరిమానాలు విధించే అంశాన్ని మార్గదర్శకాల్లో పొందుపరుస్తామని తెలిపారు.

అనుమతులకు జియో ట్యాగింగ్‌ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వంటి కేంద్ర సంస్థల అనుమతులను కూడా సమన్వయం చేసేలా త్వరలోనే కేంద్ర మంత్రితో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతి, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎ్‌స-బీపాస్‌) బిల్లును మంత్రి కేటీఆర్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స్వల్ప చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది.

ఈ సందర్భంగా ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను మంత్రి కేటీఆర్‌ వివరించారు. ప్రస్తుతం ఉన్న డీపీఎంఎస్‌ విధానానికి చట్టబద్ధత లేనందున... గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని మునిసిపాలిటీలన్నింటికీ వర్తించేలా టీఎస్‌ బీపా్‌సను తెచ్చామని చెప్పారు.

ఈ బిల్లుతో భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం తగ్గుతుందని, పారదర్శకత పెరుగుతుందని తెలిపార’’ని ఆంధ్రజ్యోతి రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)