You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్‌కు 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఎందుకు వస్తోంది? రవాణా, నిల్వ ఎంత వరకు సేఫ్?
- రచయిత, దీప్తీ బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు తరలుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మోనియం నైట్రేట్ గోదాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ అమ్మోనియా నైట్రైట్ తరలింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని, ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు ట్వీట్ చేశారు.
ఈ భయమంతా లెబనాన్ రాజధాని బేరూత్‌లోని పోర్టులో ఇటీవల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు పేలి, పెను ప్రమాదం సంభవించినందుకే.
బేరూత్ ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై అనుమానాలు, భయాలు పెరిగాయి. పెద్దపెద్ద నగరాలు, ముఖ్యంగా పోర్ట్ సిటీలలో అమ్మోనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారం ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆందోళనను నింపింది.
హైదరాబాద్‌కు కూడా పెద్ద ఎత్తున ఈ రసాయన పదార్థం వస్తోందన్న వార్త స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఈ విషయమై భయపడాల్సిందేమీ లేదని అధికారులు చెబుతున్నారు.
బేరూత్‌లో విధ్వంసం
ఆగస్టు 4న బేరూత్‌లో అమ్మోనియం నైట్రైట్ నిల్వల పేలుడు ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది.
ఆ ప్రమాదంలో రెండు వందలకుపైగా మంది మరణించగా, వేల మంది తీవ్రంగా గాయపడ్డారు.
2700 టన్నుల అమ్మోనియ నైట్రేట్ బేరూత్‌లో సృష్టించిన విధ్వంసం చూసి ప్రపంచమంతా వణికిపోయింది.
ఇదే తరహాలో నిల్వలు మన ప్రాంతంలో ఉంటే ఎంత ప్రమాదం అన్న ఆలోచన అందరిలోనూ మెదిలింది.
ఈ రసాయన నిల్వలున్న ప్రాంతాలలో అధికారులు హడావుడిగా తనిఖీలు నిర్వహించారు. భద్రతా చర్యలు సరిగ్గానే ఉన్నాయని, ప్రమాదమేమీ లేదని వారు చెబుతున్నా, ప్రజల్లో భయం మాత్రం అలాగే ఉంది.
ఎక్కడెక్కడ నిల్వలు?
భారతదేశంలోని సాగర తీర నగరాలైన చెన్నై, విశాఖపట్నంల్లోని రేవుల్లో భారీ ఎత్తున అమ్మోనియం నిల్వలున్నట్లు సమాచారం. విశాఖ రేవుకు ఏడాదికి సగటున 2.7 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతోందని, ఇది గత కొన్నేళ్లుగా సాగుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
విశాఖ రేవుకు 2017-18లో 2,75,822 టన్నులు, 2018-19లో 2,60,505 టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతైంది. ఇక్కడి నుంచి దీనిని చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, బిహార్‌లాంటి రాష్ట్రాలకు పంపుతారు.
మొదట పోర్టు నుంచి గోడౌన్లకు తరలించి అక్కడ నిల్వ చేస్తారు. విశాఖలో అమ్మోనియం నిల్వ కోసం మొత్తం 7 గోడౌన్లున్నాయి. వాటిలో ఒక్కోదానికి 30వేల టన్నుల సామర్థ్యం ఉంది.
బేరూత్ ఘటన తరువాత అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై తమిళ నాడు కాలుష్య నియంత్రణ బోర్డు నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం చెన్నైసమీపంలోని మనలి ఇండస్ట్రియల్ ఏరియా గోడౌన్లో 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్ గత ఐదు సంవత్సరాలుగా పోగుపడి ఉందని పేర్కొంది.
2015 సెప్టెంబర్ నుంచి 37 కంటైనర్లలో 25 కేజీల బ్యాగుల లెక్కన అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉన్నట్టు కస్టమ్స్ విభాగం తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డుకు తెలిపింది.
తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన అమ్మన్ కెమికల్స్ అనే సంస్థ ఈ అమ్మోనియం నైట్రేట్‌ను 2015లో దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంది. కానీ చెన్నై కస్టమ్స్ విభాగం దీనిని స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్‌కు ఎందుకు?
ఈ ఏడాది ఫిబ్రవరి 27న హైదరాబాద్‌కు చెందిన సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ వేలం ద్వారా ఈ అమ్మోనియం నైట్రేట్‌ను కొనుగోలు చేసింది.
తాజాగా బేరూత్ ఘటనతో ఇక్కడున్న నిల్వలను వెంటనే తరలించాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు కస్టమ్స్ విభాగాన్ని ఆదేశించింది.
“అమ్మోనియం నైట్రేట్‌ను కొనడం, తరలించడం మాకు కొత్త విషయం కాదు” అని సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
“గనులు, భవన నిర్మాణాలను కూల్చడానికి వాడే పేలుడు పదార్ధాలను మా సంస్థ తయారు చేస్తుంది. ప్రధానంగా బొగ్గు గనుల కోసం పేలుడు పదార్ధాలను తయారు చేసి సరఫరా చేస్తాం. ప్రతి నెలా దాదాపు 1,600 టన్నుల అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌లోని మా గోడౌన్లకు చేరుతుంది’’ అని శ్యామ్‌సుందర్ రెడ్డి వెల్లడించారు.
“ చెన్నైలో కొనుగోలు చేసిన 37 కంటైనర్ల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా హైదరాబాద్‌కు రాదు’’ అని ఆయన తెలిపారు.
ఎంత వరకూ క్షేమం?
హైదరాబాద్ నగరం పేలుడు పదార్ధాల తయారీకి కేంద్రంగా ఉందంటున్నారు తెలంగాణ పేలుడు పదార్ధాల సంస్థ అధికారులు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 25 అమ్మోనియం నైట్రేట్ గోడౌన్లు ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి బీబీసీతో అన్నారు.
“చెన్నై నుంచి వస్తున్న సరుకును అక్కడి కస్టమ్స్ విభాగం వారు పరీశీలించి తరలింపుకు అనుమతించారు. సాల్వో సంస్థకు ఈ తరలింపు, నిల్వ అనుమతులు ఉన్నాయి’’ అని ఆయన వెల్లడించారు.
అధికారులు, పేలుడు పదార్ధాల సంస్థ, తయారీదారులు భయపడాల్సిన పని లేదని చెబుతున్నా, బేరూత్ ఘటతో స్థానికుల్లో ఆందోళన మాత్రం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- తన కుమార్తెకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్న పుతిన్... ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తారు?
- 12 నెలలు, 12 మంది జీవితాలు: ఒక ఏడాదిలో కశ్మీరీల పరిస్థితి ఎలా మారిందంటే...
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- చైనా నుంచి దిగుమతులు తగ్గితే.. చైనాకు భారత ఎగుమతులు పెరిగాయి.. ఎందుకు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)