రియా చక్రవర్తి ఎవరు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితంలోకి ఎలా వచ్చారు?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత నుంచీ నటి రియా చక్రవర్తి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సుశాంత్ మరణానికి ముందు చాలా కాలం పాటు, పార్టీ అయినా, జిమ్ లేక ఏదైనా రెస్టారెంట్ అయినా సుశాంత్, రియా ఇద్దరూ తరచూ జంటగా కనిపించేవారు. వాళ్లిద్దరూ తమ బంధం గురించి బాహాటంగా ఎప్పుడూ ఏదీ చెప్పలేదు. కానీ సుశాంత్ మరణించిన ఒక నెల తర్వాత రియా చక్రవర్తి మౌనం వీడారు. సోషల్ మీడియాలో తనను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌గా ఆమె చెప్పుకున్నారు. రియా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌గా చెప్పారు. ఇటీవల సుశాంత్ తండ్రి కేకే సింగ్, రియాకు వ్యతిరేకంగా బిహార్లోని పట్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రియా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. డబ్బులు పిండుకోవడం, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం లాంటి ఆరోపణలను రియాపై సుశాంత్ తండ్రి ఇందులో చేశారని పట్నా పోలీసులు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం రియా- సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేశారు.
రియా నేపథ్యం ఇదీ
రియా చక్రవర్తి 1992 జులై 1న బెంగళూరులో ఒక బెంగాలీ కుటుంబంలో పుట్టారు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హరియాణాలోని అంబాలాలో ఆర్మీ స్కూల్‌లో జరిగింది. 2009లో బుల్లితెరపై రియా కెరియర్ ప్రారంభమైంది. ఎంటీవీ రియాలిటీ షో 'టీన్ డీవా'లో ఆమె మొదట కనిపించారు. ఆ షోలో ఆమె విజేత కాలేకపోయినా, రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రియా ఎంటీవీలో 'ఎంటీవీ వాట్సప్', 'టిక్ టాక్ కాలేజ్ బీట్', 'ఎంటీవీ గాన్ ఇన్ 60' లాంటి షోలు హోస్ట్ చేస్తూ కనిపించారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు
బుల్లితెరపై పనిచేసిన తర్వాత రియా టాలీవుడ్‌కు వచ్చారు. 2012లో నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన 'తూనీగా తూనీగా'లో ఆమె హీరోయిన్‌గా చేశారు. ఇదే రియా తొలి చిత్రం. అది పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు దక్షిణాదిలో అవకాశాలు రాలేదు. 2013లో రియా తన మొదటి బాలీవుడ్ మూవీ 'మేరే డాడ్ కీ మారుతి'లో నటించారు. ఈ సినిమాలో సాకిబ్ సలీం, రియా ప్రధాన పాత్రలు పోషించారు. 2014లో సోనాలీ కేబుల్ అనే సినిమాలో రియా- అలీ ఫజల్‌కు జోడీగా నటించారు. 2017లో ఆమెకు యశ్‌రాజ్ బ్యానర్ సినిమా బ్యాంక్ చోర్‌లో అవకాశం వచ్చింది. అదే ఏడాది హాఫ్ గర్ల్ ఫ్రెండ్, దుబారా: సీ యువర్ ఈవిల్ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. 2018లో రియాకు జలేబీ సినిమాతో పెద్ద అవకాశం వచ్చింది. రియా నాలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఆమెకు అంతగా పాపులారిటీ కూడా రాలేదు. ప్రముఖ డైరెక్టర్ రూమీ జాఫ్రీ సినిమాలో రియా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జంటగా కనిపించాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా టైటిల్ ఇప్పటివరకూ బయటికి రాలేదు.
రియాకు సుశాంత్ ఎలా పరిచయమయ్యారు?
రియా ఒక పార్టీలో సుశాంత్ సింగ్‌ను కలిశారని, ఇద్దరూ ఒకే జిమ్‌కు వెళ్లేవారని సన్నిహితులు చెబుతున్నారు. జూన్ 14న సుశాంత్ ఆయన ఇంట్లో చనిపోయి కనిపించారు. పోలీసులు దానిని ఆత్మహత్యగా చెప్పారు. కారణం తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ముంబయి పోలీసులు ఈ కేసులో రియాను విచారించారు. ఇప్పుడు పట్నాలో ఎఫ్ఐఆర్ నమోదవడంతో పట్నా పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిణామాల తర్వాత రియా మరోసారి సోషల్ మీడియా వేదికగా 20 సెకెన్ల నిడివిగల వీడియోలో స్పందించారు. తనపై ఎలక్ట్రానిక్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. అయితే ఆయా అంశాలు, సబ్ జ్యుడిసీ - అంటే న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నాయని, అందువల్ల తన లాయర్ సలహా మేరకు వాటిపై ప్రస్తుతానికి స్పందించడం లేదని రియా చెప్పారు. దేవుడిపై, న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని, తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని, సత్యమే గెలుస్తుందని ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.
బాలీవుడ్‌లో బంధుప్రీతిపై చర్చ
సుశాంత్ మృతి తర్వాత, బాలీవుడ్‌లో బంధుప్రీతి లాంటి అంశాలపై మీడియాలో, సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు సుశాంత్ మృతి కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలంటూ అల్కా ప్రియ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు, అందుకు నిరాకరించింది. పోలీసుల పనిని పోలీసులను చెయ్యనివ్వండి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తాజాగా సుశాంత్ మృతి కేసును విచారిస్తున్న బిహార్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటీన్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ముంబయిలో ఉంటూ కేసు దర్యాప్తు చేస్తున్న ఆయన్ను గ్రేటర్ ముంబయి మున్సిపల్ అధికారులు బలవంతంగా క్వారంటీన్‌కు తరలించారని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్విటర్‌లో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)