తిరుమలలో కరోనావైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి

ప్రచురణ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత, జూన్ 11 నుంచి తిరుమలలో దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. రోజుకు 9వేల ఆన్‌లైన్ టోకెన్స్ ఇస్తున్నా, కేవలం 6 నుంచి 7వేల మంది భక్తులు మాత్రమే వస్తున్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొండపై టీటీడీ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కళ్యాణకట్టలోని సిబ్బందికి పీపీఈ కిట్స్ ఇచ్చారు. కొండపై మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి. సరి-బేసి విధానంలో గదులను కేటాయిస్తున్నారు. అంటే 2 గదుల మధ్య ఒక గది ఖాళీగా ఉంటుంది. గదుల కాలపరిమితి కూడా 24 గంటలు మాత్రమే. గదుల కొనసాగింపు ఉండదు. కొన్ని మార్పులతో లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాద కేంద్రం నడుస్తున్నాయి. అలిపిరి నడక మార్గం తెరచి ఉంచినా, కాలినడక ప్రత్యేక దర్శనం రద్దుచేశారు.

జులై 15న టీటీడీలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఈ సంఖ్య 170 దాటింది. 15 మంది అర్చకులకూ కరోనా పాజిటివ్ అని తేలింది. జూలై 25న 14 మంది అర్చకులు డిశ్చార్జయ్యారు.

దర్శనాలతో, కేసులు పెరుగుతున్నాయన్నది కొందరి వాదన. దర్శనాలు రద్దు చేస్తే మంచిదని, లేనిపక్షంలో అర్చకుల సంక్షేమం కోసం కనీసం వీఐపీ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ గౌరవ అర్చకుడు రమణ దీక్షితులు బీబీసీతో అన్నారు.

దర్శనాలు ప్రారంభించక ముందు, అంటే జూన్ 10 నాటికి తిరుపతిలో కేసుల సంఖ్య 40. దర్శనాలు ప్రారంభమైన నెలరోజులకు ఈ సంఖ్య 853కు చేరింది. మరో 15 రోజుల్లో అంటే జులై 25 నాటికి మొత్తం కేసుల సంఖ్య 2237. వీరిలో యాక్టివ్ కేసులు 785 కాగా, 1425 మంది డిశ్చార్జ్ అయ్యారు. 27 మంది మరణించారు.

కానీ, తిరుపతి కేసులకు, తిరుమల దర్శనాలకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. ''టెస్టులతోపాటే పాజిటివ్ కేసులు కూడా పెరిగాయి. అందుకు తిరుమల కారణం కాదు'' అని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్త అన్నారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)