కరోనావైరస్‌పై పోరాటం తెలంగాణలో ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తోంది? - వీక్లీ షో విత్ జీఎస్
జీఎస్ రామ్మోహన్, ఎడిటర్, బీబీసీ తెలుగు
హమారా హైదరాబాద్ అభీ సేఫ్ నహీహై.. ఇదీ వేగంగా వ్యాపిస్తున్న సమాచారం.
ఈ నగరానికేమైంది అని భయంభయంగా చర్చించుకునే వాతావరణం అయితే ఉంది. మరీ మసాలా యాడ్ చేసేసి అంతా వెళ్లిపోతున్నారు సార్ నగరం ఎడారిలాగా కనిపిస్తోంది అనే ప్రచారం దాకా పోనక్కర్లేదు, అన్ని లక్షల మంది వెళ్లిపోయారు ఇన్ని లక్షల మంది వెళ్లిపోయారు అనేది మరీ విపరీత ప్రచారం.
అది జనాన్ని అనవసరంగా భయపెట్టే అతిశయోక్తుల ప్రాపగాండా. అది సంపూర్ణ వాస్తవం కాకపోవచ్చు. కానీ ఏదో సవ్యంగా లేని మాట అయితే వాస్తవం. రోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం.
ఓ వైపున గాంధీలో వెయ్యికి పైగా బెడ్లు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం చెపుతున్నా ఈ భయమూ, పానిక్ వాతావరణమూ హైదరాబాద్లో ఎందుకు వ్యాపిస్తోంది అనేది చూడాలి. అలాగే తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ ఈ కోవిడ్ క్రైసిస్‌ను ఎలా జాగ్రత్తగా నెట్టుకొస్తోంది? అక్కడేం జరుగుతోంది? తేడా ఎక్కడుంది? అనేది కూడా చూడాలి.
మిగిలిన నగరాలతో కేసుల సంఖ్యలో వ్యాప్తిలో హైదరాబాద్ మరీ అంత అధ్వానంగా అయతే లేదు. దిల్లీ కేసులు లక్ష దాటాయి. ముంబై 80వేలు దాటాయి. చెన్నై 70 వేలు దాటాయి. హైదరాబాద్ కంటే చిన్న నగరం అహ్మదాబాద్లో కూడా కేసులు 25 వేలకు చేరువలో ఉన్నాయి. హైదరాబాద్లో కేసులు 20 వేలు దాటాయి. పెద్ద నగరాల్లో అంటే మెట్రో నగరాల్లో ఒక్క కోల్ కతా, బెంగళూరు మాత్రమే హైదరాబాద్ కంటే బెటర్‌గా ఉన్నాయి.. కేసుల సంఖ్యలో.
ఐసిఎం ఆర్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సగటు మరణాల శాతం 2.78 ఉంటే తెలంగాణలో 1.13 శాతం, ఆంధ్రాలో 1.19 శాతం ఉంది. నంబర్లు లెక్కలూ అవీచూస్తే మరీ అంత ప్రమాదకరంగా ఏమీ లేదు.
మరి ఎక్కడ కొడుతోంది దెబ్బ.. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్లో పానిక్ ఎందుకు వస్తోంది అంటే దానికి కారణం పర్సెప్షన్, ఇమేజ్, కొన్ని ప్రాక్టికల్ మేనేజ్ మెంట్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు.
నెంబర్లు మాత్రమే భరోసా ఇవ్వలేవు. నీకూ నాకు ఆ పరిస్థితి వస్తే చుట్టుపక్కల యంత్రాగాలు ఎట్లా స్పందిస్తున్నాయి అనేది అనుభవంలోకి వచ్చినపుడు లేదా మన చుట్టూతా మనకు తెలిసిన వారికి అలాంటి పరిస్థితి ఎదురైనపుడు ఎట్లాంటి భరోసా లభించింది అనేదాన్ని బట్టి చాలా విషయాలు ఉంటాయి. అక్కడుంది అసలు సమస్య.
ఆస్పత్రులకు వ్యతిరేకంగా మీడియాలో తరచుగా సాగే ప్రచారం ప్రజలమీద ప్రభావం చూపిస్తుంది. డాక్టర్లు సిబ్బంది అందరూ నిర్లక్ష్యంగా ఉంటారని చెప్పడానికేమీ లేదు. అక్కడా ప్రాణాలకు తెగించి పనిచేసే డాక్టర్లు, సిబ్బంది ఉంటారు. మనకేంటి అనుకునే వాళ్లూ ఉంటారు. మనం సందర్భాన్ని బట్టి వాళ్లు దేవుళ్లని పొగుడుతాం. ఏదైనా ఇబ్మంది వస్తే దూషిస్తాం. కానీ మిగిలిన ప్రొఫెషన్స్‌లో ఉన్నట్టే అక్కడా అన్ని రకాల వాళ్లూ ఉంటారు. తిండి తినడానికి మూత్రం పోసుకోవడానికి కూడా టైం లేకుండా పనిచేసే వాళ్లుకూడా ఉంటారు.
కానీ ప్రభుత్వ ఆస్పత్రులనగానే మన మదిలో మెదిలే ఇమేజ్ బలమైనది. కానీ ఇపుడేమో వేరే దిక్కులేదు. అలవాటు కొద్దీ ప్రైవేట్ ఆస్పత్రుల తలుపు తడతారు. అక్కడేమో మనిషి దిట్టంగా మట్టంగ కనీసం రెండు మూడు లక్షలైనా పిండుకోవచ్చు అనిపిస్తే తప్ప చేర్చుకోరు. బెడ్స్ లేవనో ఇంకోటనో చెప్పేస్తారు. పైగా ట్రీట్ మెంట్ రిస్క్ అనుకునే డాక్టర్లు కూడా ఉంటారు. అందరూ అట్లా ఉంటారని కాదు గానీ వ్యాపారం కాబట్టి అదే ప్రధాన ధోరణిగా ఉంటుంది. వాళ్లేమీ ప్రభుత్వ వైద్యులు కాదు కదా, వాళ్లిష్టం. కీలకమైన ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యవస్థను దిగజార్చుకున్న ఫలితం ఇది.
ఏమైనా ప్రాణాపాయం ఉన్న వ్యాధి కాబట్టి కాస్త మంచి ఆస్పత్రిలో చేరదాం అనుకున్నవాళ్లు వరుసబెట్టి ప్రైవేట్ ఆస్పత్రుల తలుపు తడతారు. అవి అడ్మిట్ చేసుకోవు. అదొక క్రైసిస్. నిబంధనల ప్రకారం అయితే తిరస్కరించకూడదు కానీ పట్టించుకునేదెవ్వరు, ఏదో టెక్నికల్ సాకు చూపిస్తారు. అసలే ప్రాణభయంతో అల్లాడుతున్న మనిషి వరుసగా ఒక్కో ఆస్పత్రి తలుపు తడుతూ వాళ్లెవరూ చేర్చుకోక పోతే అతను లేదా ఆమె పరిస్థితి, వాళ్ల బంధువుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి.
భయం అన్నింటికన్నా పెద్ద రోగం. సైకలాజికల్‌గా, వీక్‌గా ఉన్న టైంలో ఇలాంటి అనుభవం ఎదురైతే భరోసా ఎక్కడి నుంచి వస్తుంది.
ఆంధ్రాలో కొన్ని ప్రైవేట్ ఫెసిలిటీస్‌ని కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించడం వల్ల జనానికి ఆప్షన్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి.
పోనీ గాంధీకే వెడతాం అనుకుంటే దూరంగా ఉన్నవాళ్లో ఏదైనా ఊపిరి ఆడకపోవడం లాంటి తీవ్రమైన సింప్టమ్స్ తో బాధపడే వారో ఫోన్ చేస్తే అంబులెన్స్ సత్వరం అందుబాటులో ఉండదు. దగ్గరున్న ప్రైవేట్ ఆస్పత్రికి పోతే చేర్చుకోరు. వాళ్లేమి చేయాలి.
నిస్సహాయత భయానకమైనది. మరొక ఆప్షన్ కూడా అందుబాటులో లేకుండా పోవడం అనేది అన్యాయమైన పరిస్థితి.
అస్సలు ఇంత ఖర్చుపెడుతున్నా ఇంతమంది వైద్య సిబ్బంది కృషి చేస్తున్నా జనంలో మనమెందుకు భరోసా కల్పించలేకపోతున్నాం అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుకోవాలేమో!
ప్రభుత్వం మరొక ఆప్షన్ అన్నా ఇచ్చి ఉంటే పరిస్తితి వేరే. ఇంత పెద్ద మహానగరానికి ఒకే ఆస్పత్రిని కేటాయించి అందరూ అక్కడికే వెళ్లాలనడం ఇబ్బందికరమైన పరిస్థితి.
ఆంధ్రాలో అట్లా లేదు. అక్కడ ప్రైవేట్ మెడికల్ ఆస్పత్రులను, అంటే టీచింగ్ హాస్పటల్స్‌ను ప్రభుత్వం హాండోవర్ చేసుకుని నిర్వహిస్తున్నది. రోగులకు ఛాయిస్ ఉందక్కడ. ఇంత పెద్ద హైదరాబాద్‌కు ఒక్క గాంధీనే దిక్కు అయితే విజయవాడ లాంటి చిన్న నగరంలో 8 చోట్ల రోగులు అడ్మిట్ కావడానికి ఆస్కారం ఉంది. అందులో ఐదు ప్రభుత్వ ఆస్పత్రులు, మూడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు. అక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతున్నా హైదరాబాద్ లాంటి పరిస్థితి అయితే లేదు. రెండు చోట్లా పోల్చి చూస్తే ఆంధ్రాలోనే మేనేజ్మెంట్ బెటర్‌గా ఉంది.
తెలంగాణలో కూడా ప్రైవేట్ టీచింగ్ ఆస్పత్రులను హాండోవర్ చేసుకోవడం ప్రస్తావన వచ్చింది కానీ అలాంటిదేమీ జరగలేదు. కాకపోతే గచ్చిబౌలిలో ఖాళీగా పడి ఉన్న భవనాన్ని టిమ్స్ పేరుతో ఆస్పత్రిగా మార్చారు. ఇది మంచి ప్రయత్నం. అది అందుబాటులోకి వచ్చి ఉంటే సమస్య తీవ్రత తగ్గేది. అది ఏప్రిల్ 20 నుంచి అందుబాటులోకి వస్తుంది అని స్వయంగా సిఎం కెసిఆర్ అప్పట్లో ప్రకటించారు. ఇవాళ జూలై 10. మధ్యలో డెడ్ లైన్లు మారుతూ వచ్చాయి. మధ్యలో మే 18 నుంచి ఆరంభిస్తున్నాం అని అధికారులు చెప్పారు. తర్వాత జూన్ 20 నుంచి అని చెప్పారు. ఈ నెల ఆరున మంత్రి రాజేందర్ ట్వీట్ చేశారు. అంతారెడీ అని. ఇవ్వాల్టిదాకా ఆపరేషన్లోకి రాలే. సిఎం స్వయంగా హామీ ఇచ్చిన 80 రోజులకు కూడా అది ఆపరేషన్లోకి రాలే. ఇదీ తెలంగాణ మేనేజ్మెంట్లో ఉన్న ప్రాక్టికల్ సమస్య. గాంధీలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయనే లాజిక్ ఒక్కటే పనిచేయదు. సిటీకి ఇంకో మూల ఇంకో ఫెసిలిటీ వస్తే భరోసా పెరుగుతుంది కదా, పైగా అన్ని సార్లు డేట్ ఎక్స్ టెండ్ చేస్తూ పోవడం అమెచ్యురిష్‌గా ఉంటుంది. ఈ కీలకమైన టైంలో.
తెలంగాణలో ఎక్స్పెక్టేషన్‌కి, వాస్తవానికి మధ్యలో అగాధం చాలా ఉంది. అదీ సమస్య.
ఆంధ్రాలో ఏం చేస్తున్నారు.. టెస్టులకు బ్రౌన్, గ్రీన్, ఆరంజ్, రెడ్ అని కేటగిరీలు పెట్టి స్టిపులేడెట్ టైంలో త్వరగా రిజల్ట్ ఇస్తున్నారు. టెస్టులు, వాటి ఫలితాలతో సంబంధం లేకుండా ఎవరైనా సింప్టమ్స్‌తో వస్తే వారిని ప్రభుత్వ నిర్వహణలోని క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతున్నారు. కమ్యూనిటీ సెంటర్లను విస్తృతంగా వాడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన వలంటీర్ల వ్యవస్థ దీనికి ఉపయోగపడుతోంది. మొత్తం మీద మీకు ఇబ్బంది అనిపిస్తే ఇదిగో ఇక్కడకు పోవచ్చు, ఇక్కడ పలికే మనిషి ఉంటారు.. స్పందిస్తారు, చూస్తారు అనే భరోసా ఇవ్వడంలో తెలంగాణ కంటే ఆంధ్రా ముందుంది.
తొలి దశలో కేసిఆర్ స్పందించిన తీరుకు ఇవాళ తెలంగాణ ఆరోగ్య రంగం స్పందిస్తున్న తీరుకు పొంతన లేదు. తొలిదశలో కెసిఆర్ విజనరీలాగా మాట్లాడారు. అంతులేని భరోసా ఇచ్చారు. అప్పుడు జాగ్రత్తల్లో, ఏర్పాట్లలో దేశంలోనే తెలంగాణ ముందుంటుందేమో అన్నట్టు ఇమేజ్ వచ్చింది. అది కాస్తా ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారి పోయింది.
ఇపుడు మరో కీలకమైన అంశానికి వద్దాం. అది టెస్టులు. టెస్టుల్లో తెలంగాణకు అంత మంచి పేరేమీ లేదు. అతి తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఇదొకటి. పొరుగురాష్ర్టం ఆంధ్రప్రదేశ్ అగ్రెసివ్‌గా టెస్టులు చేస్తుంటే.. తెలంగాణ చేద్దామా వద్దా అన్నట్టు అన్యమనస్కంగా చేస్తున్నది. దానిమీద రోజుకో లాజిక్ చెబుతోంది.
టెస్టుల సంఖ్య ఇంత తక్కువగా ఉండడానికి కారణం లాజిస్టిక్ కారణాలా .. అంటే యంత్రాలు, తగిన కిట్లు సరైనవి లేకపోవడం వల్లనా, లేక టెస్టులు ముఖ్యం కాదు అని అనుకుంటున్నారా ఏది ప్రధానమైనది అనే స్పష్టత లేదు. ఏమైనా ఇప్పటికే ఈ విషయంలో బోలెడంత చర్చ జరిగింది. జాతీయమీడియాలో చర్చ అయ్యింది, కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇటీవల కాస్త మోతాదు పెంచారు కానీ ఇప్పటికీ టెస్టింగ్ తక్కువే.
నిర్దుష్టంగా చూస్తే దేశవ్యాప్త సగటు చూసినపుడు మిలియన్ జనాభాకు అంటే ప్రతి పదిలక్షల మందికి 7551 మందికి టెస్టులు చేస్తుంటే తెలంగాణ కేవలం 3268 మందికే చేస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ర్టం ఆంధ్రా ప్రతి మిలియన్‌కు 20 వేల 182 టెస్టులు చేస్తోంది. ఇప్పటివరకూ ఆంధ్ర 10 లక్షల 77 వేల పైచిలుకు టెస్టులు చేస్తే తెలంగాణ కేవలం లక్షా 28 వేల టెస్టులు చేసింది. టెస్టులు, ట్రేసింగ్ చాలా ఇంపార్టెంట్ అని నిపుణులు మొత్తుకుంటున్నా ఈ విషయంలో తెలంగాణ వెనుకబడే ఉంది.
అసిమ్టమాటిక్ అయినా టెస్టులు చేయాలని ఐసిఎంఆర్ చెపుతుంటే అది కూడా తెలంగాణ తోసిరాజంటున్నది. టెస్టుల సంఖ్య వేగంగా పెంచాల్సిన అవసరం ఉంది. దానివల్ల కేసుల సంఖ్య పెరగొచ్చు కానీ వేగంగా స్పష్టత వస్తుంది. జనంలో కొంత భరోసా కూడా వస్తుంది. అలాగే సమాచారం ఎప్పటికిప్పుడు వెల్లడించడంలో కూడా పారదర్శకత లేదు. అది టెస్టుల విషయంలో కావచ్చు, లేదా టిమ్స్ ఆస్పత్రిని ప్రారంబించే విషయంలో కావచ్చు. సమాచారం ఎప్పటికప్పుడు వెల్లడించడంలో కావచ్చు, ఎందులోనూ స్థిరత్వం, సరైన స్ట్రాటజీ లేవని అర్థమవుతోంది.
స్థూలంగా తెలంగాణ కోవిడ్ క్రైసిస్‌ను ఎదుర్కోవడంలో పాటిస్తున్న వ్యూహాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. టిమ్స్ ను వెంటనే ఆపరేషన్లోకి తేవడంతో పాటు క్వారంటైన్ లోనూ, టెస్టుల్లోనూ పాటిస్తున్న పద్థతులను రివ్యూ చేసుకుని జనానికి మరింత భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.
సంక్షేమంలో టాప్ గేర్లో ఉన్న తెలంగాణ, దేశానికి రైతు బంధు లాంటి పథకాన్ని మోడల్‌గా అప్పగించిన తెలంగాణ, ఖర్చుకు వెనుకాడని తెలంగాణ, కల్నల్ కుటుంబానికి ఐదుకోట్లు ప్రకటించగల ఉదారత్వం ఉన్న తెలంగాణ, సంపన్న రాష్టం తెలంగాణ.. కోవిడ్ విషయంలో ఇంకాస్త ఉదారంగా ఆలోచించొచ్చు.
అలాగే జనం కూడా మీడియాలోని కొన్ని సెక్షన్లలో జరుగుతున్న ప్రచారం చూసి హైదరాబాద్ ఏమో అయిపోతుంది అనే భావనలోకి పోనక్కర్లేదు. ఎక్కడికీ పోదు. ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించి కొన్ని దారుణమైన ఉదాహరణలు ఉన్నమాట వాస్తవమే కానీ అక్కడంతా అలాగే ఉంటుందనుకోకూడదు. ఇంటిని పిల్లల్ని వదిలి పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా అక్కడున్నారు. ఎందరో కోలుకుని బయటకొస్తున్నారు. మరణాల రేటు తక్కువే ఉంది. మాక్రో పిక్చర్ దారుణంగా ఏమీ లేదు. భయం వదిలి ప్రభుత్వంపై భరోసా పెట్టాల్సిన సమయమిది. ప్రభుత్వం కూడా ప్రజలు భరోసా పెట్టుకోదగిన విధంగా యంత్రాంగాన్ని మార్చుకోవాల్సిన సమయమిది.
మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- కాన్పూర్ పోలీసుల హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దుబే ‘ఎన్కౌంటర్’
- బోటు షికారుకు వెళ్లి, సరస్సులో మునిగి నటి నయా రివెరా మృతి
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- కరోనావైరస్ గాలి ద్వారా వ్యాపించొచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)