You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్, చైనాల మధ్య యుద్ధ భయాలు నిజమేనా? - వీక్లీ షో విత్ జీఎస్
జీఎస్ రామ్మోహన్, ఎడిటర్, బీబీసీ తెలుగు
యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు అనేది జనాల్లో ఉద్వేగం, సెంటిమెంట్ పెంచే విషయం.
జమ్మూ కశ్మీర్లో రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచుకోవాలనే ఆదేశాలు, స్కూళ్లు భవనాలు ఆర్మీ కోసం సిద్ధం చేయాలనే ఆదేశాలు.. ఇలాంటి వార్తలకు ఆజ్యం పోశాయి.
అయితే అదంతా కూడా రాబోయే అమర్ నాధ్ యాత్రకోసం ఏర్పాట్లు అని ప్రభుత్వ యంత్రాగాలు చెపుతున్నాయి.
ప్రస్తుతానికైతే దౌత్య స్థాయిలో, మిలిట్రీ స్థాయిలో చర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుంది అని స్పెక్యులేట్ చేయడం మంచిదికాదు కానీ ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాలు అయితే ఆసక్తికరంగాసాగుతున్నాయి.
ప్రపంచ రాజకీయాలపై పట్టుకోసం తపన పడే దేశాల మధ్య రీ గ్రూపింగ్ సాగుతోంది. అమెరికా, చైనాల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. కోల్డ్ వార్లో ఒకప్పటి రష్యా స్థానాన్ని ఇపుడు చైనా ఆక్రమించింది.
భారత్ ఇవాళ ఆ రాజకీయాల్లో చౌరస్తాలో నిలబడి ఉంది.
ప్రస్తుత సంక్షోభం వల్ల భారత్ కొత్త దిశను ఎంచుకుంటుందా, కొత్త సమీకరణాలు, కొత్త కూటమిలతో ప్రపంచం ఎలా ఉండబోతోంది అనేది ఇంటరెస్టింగ్‌గా ఉంది.
సున్నితమైన దౌత్యసంబంధాలు దెబ్బతినే వ్యవహారాల్లో భారత్ ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నది. సౌత్ చైనా సీలో జాయింట్ పెట్రోల్ కోసం అమెరికా ఆహ్వానిస్తున్నా భారత్ యాక్టివ్గా స్పందించలేదు.
ఒక రకంగా చైనాను ప్రత్యర్థిగా గుర్తిస్తూ రోజూ దాని గురించి మాట్లాడుతున్న అమెరికా.. ఆసియాలో తనకు అండగా భారత్‌ను ప్రేరేపిస్తూ వస్తోంది.
90ల నుంచి అమెరికాకు దగ్గరగా జరుగుతున్నప్పటికీ అమెరికా కూటమిలో భాగం అనదగినంత దూరం భారత్ ఇంతవరకూ వెళ్లలేదు.
ఇన్నాళ్లకు అమెరికాకు ఆ అవకాశం వచ్చింది. ఇపుడు చైనాను ఎదుర్కోవడం కోసం అమెరికాకు మరింత దగ్గరవ్వాలనే ఒత్తిడి పెరుగుతోంది.
ఇపుడు రష్యా ఏ పాత్ర తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. భారత్ మిత్రదేశమే అయినప్పటికీ చైనాతోనూ రష్యాకు బలమైన సంబంధాలే ఉన్నాయి. కాబట్టి అటూ ఇటూ ఎటైనా రష్యా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందని భావించలేము.
ఇక అంతర్జాతీయంగా ఎంత ప్రాధాన్యముంది అనేది పక్కనబెడితే మనకూ చైనాకు పొరుగుదేశాలుగా ఉన్న నేపాల్, మియన్మార్ గురించి కూడా మాట్లాడుకోవాలి.
నేపాల్ నిన్న మొన్నటి దాకా భారత్‌కు అత్యంత దగ్గరైన దేశం. రక్షణ మంత్రి రాజనాధ్ మాటల్లో చెప్పాలంటే రోటీ బేటీ సంబంధాలున్నదేశం.
కానీ నేపాల్ ఉన్నట్టుండి భారత్‌కు వ్యతిరేకంగా గొంతు పెంచింది. కానీ వెంటనే ఇండియా డామేజ్ కంట్రోల్ లోకి దిగింది.
ఇపుడు నేపాల్ మాజీ ప్రధానులు ప్రస్తుత ప్రధాని ఓలీ మీదపడ్డారు. భారత్ మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అని నిరూపించు లేదంటే రాజీనామా చేయ్ అని ఒత్తిడి తెస్తున్నారు. సో ఈ ఫ్రంట్లో భారత దౌత్యాధికారులు ఆ విధంగా ముందుకుపోయారని అర్థం అవుతుంది.
ఇంకో దేశం మియన్మార్. మనకు నేపాల్ ఎంతో చైనాకు మియన్మార్ అంత. వాళ్లకు బాగా సన్నిహితమైన దేశం.
అయినప్పటికీ మొన్న మియన్మార్ చైనాకు వ్యతిరేకంగా గొంతు విప్పింది. తమ దేశంలోని తిరుగుబాటు దారులకు చైనా ఆయుధాలు అందిస్తోందని మియన్మార్ ఆరోపించింది ఇటీవలే.
సో అక్కడేదో జరుగుతోంది.
అంతర్జాతీయ రాజకీయాల్లో దౌత్య వ్యవహారాల్లో ఎవరు ఎవరికి సాయం అందిస్తారు? ఎక్కడ వ్యతిరేకిస్తారు? అనేది సూటిగా ఉండదు. వ్యూహాత్మకమైన ఎత్తుగడలు ఉంటాయి.
ఇరుగు పొరుగును దాటి బయటకు చూస్తే చాలాదేశాలతో చైనా సంబంధాలు సఖ్యంగా లేవు.
సౌత్ చైనా సీలో ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తోందంటూ పసిఫిక్ తీరాల్లోని దేశాలు అనుమానంగా చూస్తున్నాయి.
హాంకాంగ్‌లో తెచ్చిన కొత్త చట్టం విషయంలో బ్రిటన్‌తో ఇప్పటికే వివాదం నడుస్తోంది.
బ్రిటీష్ నేషనల్ స్టేటస్ ఉన్న 30 లక్షల మంది హాంకాంగ్ పౌరులకు ఆశ్రయం ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది..చైనా అభ్యంతరాలను పట్టించుకోకుండా. ఆస్ట్రేలియా అంతకంటే ఘాటుగా చైనాపై విమర్శలు ఎక్కుపెడుతోంది.
కెనడా తదితర దేశాలతో కూడా చైనా సంబంధాలు దెబ్బతిని ఉన్నాయి.
ఆర్థిక రంగంలో బలపడిన చైనా అందరిపై ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించడం వల్లే ఇన్ని దేశాలతో ఘర్షణలు వస్తున్నాయని బయటి వారంటారు. ముఖ్యంగా జిన్ పింగ్‌లో ఆధిపత్యం ఛాయలు ఎక్కువ అంటారు.
అలా కాదు, మేం అగ్రరాజ్యంగా ఎదగడం నచ్చని దేశాలు అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి, మేం ఎదుర్కొంటున్నాం అని చైనా అంటుంది.
ఏమైనా తియాన్మిన్ స్వ్కేర్ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా ఇంత సెంటిమెంట్ బలపడడం ఇదే.
ప్రస్తుతం ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది భారత్. అంతర్జాతీయంగా చైనాపై ఒత్తిడి తెచ్చే పనిలో ఉంది.
భారత్ చైనా పరస్పరం ప్రత్యర్థులుగా చూసుకోకుండా అనవసరమైన కోల్డ్‌వార్ గేమ్‌లోకి దిగకుండా పరస్పరం సహకరించుకుంటే ప్రపంచానికే దిక్సూచీగా మారతాయని అనే ఆశావాదులు ఇంకా ఉండొచ్చు గానీ ఇపుడైతే దాన్నుంచి చాలా దూరం వచ్చేశాం.
ఇటు మిలిట్రీ పరంగా మేం సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఒకవైపు పంపిస్తూనే మరోవైపు దౌత్య పరమైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇరు దేశాల మధ్య సాగుతున్న ఘర్షణ ఏఏ రూపాల్లో ఎక్కడెక్కడ వ్యక్తమవుతోంది? ఏఏ దేశాల వైఖరి ఎలా ఉంది? విశ్లేషణ కోసం వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)