You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైఎస్ జగన్: 'అమరావతికి లక్ష కోట్లు పెట్టలేం... అందులో 10 శాతంతో విశాఖను అత్యుత్తమంగా చేయొచ్చు' - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, మౌలిక వసతులతో సిద్ధంగా ఉన్న విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేసుకోవడమే ఉత్తమమని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు 'వెలుగు' దినపత్రిక ఓ వార్త రాసింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అమరావతి లాంటి ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంలా నిర్మించేందుకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు.
గత ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని నిర్మించాలంటే రూ. 1.09 లక్షల కోట్లు కావాల్సి ఉందని, అందులో 10 శాతం ఖర్చుచేస్తే విశాఖను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పోటీ పడేలే చేయొచ్చని జగన్ చెప్పారు.
భవిష్యత్తులో రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే అవసరం లేకుండా విశాఖను అభివృద్ధి చేస్తామని అన్నారు.
అభివృద్ధి ఒక్కచోటే ఉంటే మిగిలిన ప్రాంతాలు ఉమ్మడి ఏపీ తరహాలో దారుణంగా నష్టపోవాల్సి ఉంటుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకునే మూడు రాజధానుల ప్రకటన చేశామని చెప్పారు.
దక్షిణమధ్య రైల్వేకు పెరిగిన కేటాయింపులు
తాజా బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకు రూ.6,846 కోట్లను కేటాయించారని, గత ఏడాది కన్నా ఇది రూ.922 కోట్లు ఎక్కువని 'సాక్షి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
కొత్త రైళ్ల బాధ్యతను ప్రైవేటుకు అప్పగించి మౌలిక వసతుల కల్పనపై రైల్వే శాఖ దృష్టి సారించింది. వీలైనన్ని ప్రైవేటు రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన రైల్వేశాఖ దక్షిణమధ్య రైల్వేకు సంబంధించి 11 మార్గాలను గుర్తించింది.
సొంతంగా నిర్వహించే ఒక్క కొత్త రైలు ప్రస్తావన కూడా లేకుండానే తాజా బడ్జెట్‌ను రూపొందించారు. అయితే ఇప్పటికే మొదలైన కొత్త లైన్లు, డబ్లింగ్, మూడో లైన్ల నిర్మాణాలకు భారీగానే నిధులు కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులతో సరిపెట్టారు.
హైదరాబాద్‌తో కరీంనగర్ పట్టణాన్ని రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు మనోహరాబాద్-కొత్తపల్లికి రూ.235 కోట్లు.. మునీరాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్టుకు రూ.240 కోట్లు కేటాయించారు.
కొత్త బొగ్గు గనులతో రైల్వేను అనుసంధానించే క్రమంలో భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైను నిర్మాణం చివరి దశకు వచ్చింది. గత బడ్జెట్‌లో రూ.405 కోట్లు కేటాయించగా, ఈసారి అంతకన్నా రూ.115 కోట్లు ఎక్కువగా కేటాయించింది. ఎంఎంటీఎస్ రెండో దశకు మరో రూ.40 కోట్లను.. కాజీపేట-బల్లార్షా మూడోలైన్‌కు ఏకంగా రూ.483 కోట్లు కేటాయించారు.
'ప్రధాని కోసం సొరంగ మార్గం'
ప్రధాని తన నివాసం నుంచి తన కార్యాలయానికి, పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రత్యేక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాలని 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ ప్రతిపాదించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
పార్లమెంటు, రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ భవనాలను ఒకే సముదాయంలో నిర్మించేందుకు 'సెంట్రల్ విస్టా' సరికొత్త ప్లాన్ రూపొందిస్తోంది.
ఇందులో భాగంగానే పీఎంవోకు, పార్లమెంటుకు ప్రధాని, ఇతర వీవీఐపీలు వెళ్లేందుకు సొరంగ మార్గాన్ని ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ బుధవారం నాటి సమావేశంలో ప్రతిపాదించారు.
ప్రధాని కాన్వాయ్, ఇతర వీవీఐపీలు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించడమో, నిలిపివేయడమో జరుగుతోంది. అత్యంత భద్రత కల్పించాల్సిన ప్రధాని వంటి ముఖ్యులను సాధారణ ట్రాఫిక్ నుంచి వేరు చేయాలని భావిస్తున్నట్లు పటేల్ చెప్పారు.
సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తే వీవీఐపీలకు భద్రత కల్పించడం కూడా సులువవుతుందన్నారు. ప్రస్తుత రక్షణ సిబ్బంది కార్యాలయాలను తొలగించి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రజలు కోరితే మండలానికో తెలుగు మీడియం పాఠశాల
తెలుగు మాధ్యమం కావాలని ప్రజలు కోరితే మండలానికి ఒక పాఠశాలను నడుపుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.
అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
విద్యా హక్కు చట్ట నిబంధనల మేరకు ఆ పాఠశాల దూరంగా ఉంటే విద్యార్థులకు ఉచిత రవాణా కల్పిస్తామని తెలిపింది. ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా మాధ్యమ (లింగ్విస్టిక్ మైనార్టీ) పాఠశాలలను కొనసాగిస్తామని పేర్కొంది.
ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ చేశామని స్పష్టం చేసింది.
ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఈ మేరకు హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు.
ఉర్దూ మాధ్యమంలో 701 ప్రాథమిక, 48 ఉన్నత పాఠశాలలు... కన్నడ, తమిళం, ఒడియా మాధ్యమాల్లో 111 ప్రాథమిక, 22 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా పాఠశాలలు అవే మాధ్యమాల్లో కొనసాగుతాయని తెలిపారు.
''ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారిలో బలహీనవర్గాల పిల్లలే ఎక్కువ. వాళ్లు ఆంగ్ల మాధ్యమానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే.. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించాం'' అని తెలిపింది.
ఇవి కూడా చదవండి.
- ఏపీ రాజధాని: కేంద్ర హోంశాఖ ఏం చెప్పింది? మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది?
- సాయిబాబా ఎక్కడ జన్మించారు... షిర్డీలోనా... పత్రిలోనా?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్.. ఇది ఎలా పనిచేస్తుంది
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)