ఆర్తి అరుణ్: ఇద్దరు పిల్లల తల్లివి పవర్‌లిఫ్టింగ్‌ ఎందుకన్నారు, నేను 5 బంగారు పతకాలు సాధించా

ప్రచురణ

భారత్‌లో ఒకప్పుడు పవర్‌లిఫ్టింగ్‌ అంటే అది పురుషుల క్రీడగానే చాలామంది భావించేవారు. అందులో పొట్టి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, మహిళలకు ఆ గేమ్ సూటవ్వదన్న అభిప్రాయాలు ఉండేవి. కానీ, ఆ పవర్‌లిఫ్టింగ్‌లోనే అంతర్జాతీయ స్థాయిలో 5 బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు చెన్నైకి చెందిన ఆర్తీ అరుణ్.

ఆమె గెలుపు ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

"భారత్‌లో అతి తక్కువ జనాదరణ ఉన్న క్రీడల్లో పవర్‌లిఫ్టింగ్ ఒకటి. అలాంటి క్రీడలో నేను కామన్‌వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి 5 బంగారు పతకాలు సాధించిపెట్టాను. మేము ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాం.

నాకు రెండో బిడ్డ పుట్టిన తర్వాత చాలా బరువు పెరగడంతో జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టాను. ఆ సమయంలో నా శరీరంపై చాలామంది కామెంట్లు చేసి, నా అహాన్ని తీవ్రంగా దెబ్బతీశారు.

అంతకుముందు పవర్‌లిఫ్టింగ్ అనే క్రీడ గురించి నేనెప్పుడూ వినలేదు. అది పురుషుల క్రీడ అని అందరూ అనేవారు. అది నీకెందుకు, అందులోనూ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత.. అంటుండేవారు. కానీ, ఆ క్రీడలో రాణించాలని అనుకున్నాను. దాని గురించి తెలుసుకోవడం, శిక్షణ తీసుకోవడం, పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాను.

పవర్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానని మా కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు, రెండు వారాలు లేదా నెల గడిచేలోపే దానిని పక్కన పెట్టేస్తానని వాళ్లు అనుకున్నారు. నేను ఈ క్రీడను ఇంత సీరియస్‌గా తీసుకుంటానని వాళ్లు ఎప్పుడూ ఊహించలేదు.

ఈ గేమ్‌కు ప్రత్యేకమైన దుస్తులు అవసరమవుతాయి. పొట్టిగా, భిన్నంగా ఉంటాయి. మొదట్లో వాటిని వేసుకునేందుకు చాలా సిగ్గు పడేదాన్ని. తర్వాత కాస్త అలవాటైంది.

మా అబ్బాయి కూడా చాలా ప్రోత్సహించేవాడు. అతడు కూడా క్రీడాకారుడే. నా కూతురికి మాత్రం వాళ్ల స్కూల్లో ఎదురవుతున్న అవహేళనల వల్ల కొంత విరుద్ధమైన అభిప్రాయం ఉంది.

క్రీడల్లో మహిళలను మన సమాజం ప్రోత్సహించదు. మహిళలను డాక్టర్లుగా, ఇంజినీర్లుగా మాత్రం అంగీకరిస్తారు, కానీ మహిళా క్రీడాకారులను మాత్రం ప్రోత్సహించరు. క్రీడల్లో దుస్తులు ఎన్నడూ అవరోధం కాకూడదు.

మాది తమిళనాడులో వేలూరు సమీపంలోని ఆర్కాట్. కానీ, నా పాఠశాల విద్య హైదరాబాదులో జరిగింది. స్కూల్లో బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. జిమ్నాస్టిక్స్‌లో చాలా ఆసక్తి ఉండేది. అప్పట్లో నేను రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని. జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పొట్టి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, మా సంప్రదాయ కుటుంబ నేపథ్యం అందుకు అనుమతించలేదు.

పొడవాటి ప్యాంట్లు వేసుకుని ఆడలేను కాబట్టి, నేను వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

నేను దేనికీ పనికిరానని అనుకునేదాన్ని. కానీ తర్వాత నా సామర్థ్యాన్ని నేను పూర్తిగా వినియోగించుకోలేదని అనిపించింది. వృత్తిరీత్యా దంత వైద్యురాలిని, గృహిణిని, పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌ను కూడా. పలు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు బంగారు పతకాలు సాధించిపెట్టాలన్నది నా అతిపెద్ద ఆశయం."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)