జగన్‌కు కేసీఆర్‌ మద్దతు.. మూడు రాజధానుల 'నిర్ణయంపై కఠినంగానే ఉండండి' - ప్రెస్ రివ్యూ

జగన్, కేసీఆర్

ఫొటో సోర్స్, KCR/Facebook

ప్రచురణ

''మూడు రాజధానుల ఏర్పాటు మంచి నిర్ణయం. ఈ విషయంలో ముందుకు సాగండి'' అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు తెలిసిందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. ఇరువురు ముఖ్యమంత్రుల సోమవారం ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇద్దరు సీఎంలు దాదాపు ఆరు గంటల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ-స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మూడు గంటలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని అక్కడి సీఎంగా జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్‌ స్వాగతించారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో సత్ఫలితాలు వస్తాయని ఆయనకు చెప్పారు.

''ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం రాష్ట్ర విభజన ఆలస్యానికి ప్రధాన కారణమైంది. అప్పట్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు కూడా హైదరాబాద్‌ స్థాయిలో కొంతైనా అభివృద్ధి చెంది ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేది'' అని జగన్‌తో కేసీఆర్‌ అన్నారు.

ఏపీ విషయానికి వస్తే, రాజధాని పేరుతో అమరావతి కేంద్రంగా అభివృద్ధిని పరిమితం చేయకుండా, మూడు రాజధానులు (విశాఖపట్నం, అమరావతి, కర్నూలు) ఏర్పాటు ద్వారా వికేంద్రీకరణ చేయడం వివేకవంతమైన నిర్ణయంగా సీఎం కేసీఆర్‌ అభివర్ణించినట్లు తెలిసింది. దీనిపై ఆందోళనలు తాత్కాలికమేనని, ప్రజలు వాస్తవాలు గుర్తిస్తారని అన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మెను ప్రస్తావించినట్లు తెలిసింది.

రాష్ట్రాల అభివృద్ధి, నిధుల విడుదల విషయంలో కేంద్రం పూర్తిగా సహకరించటం లేదని ఇద్దరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విడివిడిగానే కాకుండా, పార్లమెంటు వేదికగా కలిసి పోరాడాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగనంతవరకు కేంద్రంతో తగవు పడాల్సిన అవసరంలేదని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జాతీయ స్థాయిలో బీజేపీ బలం క్రమక్రమంగా తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుండటాన్ని వారు గుర్తు చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు లేవని, ఏపీలో జనసేనతో కలిసి ప్రజల్లోకి వెళ్లటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది అంత ఫలవంతం కాకపోవచ్చని ఇరువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ

ఫొటో సోర్స్, TELANGANA.GOV.IN

హైదరాబాద్ శివార్లలో 'ఓటుకు రూ. 2,000 నోటు, 100 పైపర్స్‌ ఫుల్‌ బాటిల్‌'

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారుల్లోని నగరపాలక సంస్థల్లో పదవి కోసం కోట్లు కుమ్మరించాల్సిందేనని.. ఏడు కార్పొరేషన్‌లు, 20కి పైగా మునిసిపాలిటీల్లో కాసుల వర్షం కురుస్తోందని 'సాక్షి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. పార్టీ టికెట్లు తెచ్చుకునేందుకే ఆశావహులు లక్షలు వెచ్చించారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్‌పర్సన్లు కావాలనుకుంటున్న వారు కాసులు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

కనీసం డివిజన్‌కు రూ. కోటి, కౌన్సిలర్‌ గిరీకి రూ. 50 లక్షలు తగ్గకుండా ఖర్చు పెడతామంటూ చేస్తున్న హడావుడితో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంక్రాంతి పండుగ సందడి ఈ నెల 22 వరకు కనిపించనుంది.

నార్సింగి మున్సిపాలిటీలోని ఓ వార్డులో 1,414 ఓట్లున్నాయి. ఈ వార్డులో మాజీ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఇరువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఒక ఓటు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు పలుకుతోంది. ఈ వార్డులో గెలవాలంటే కనీసం 500 ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ఓట్ల కోసం సగటున ఓటుకు రూ. 7,000 అనుకున్నా 500 ఓట్లకు గాను రూ. 3.5 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే.

బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని 1, 5, 20, 23 వార్డులు జనరల్‌కు రిజర్వయ్యాయి. ఇక్కడ తీవ్ర పోటీ ఉండటంతో రూ. 1.25 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే వెనుకాడేది లేదని పదవులు ఆకాంక్షిస్తున్న వారి శిబిరాలు తేల్చి చెప్పేస్తున్నాయి.

నగర శివార్లలోని ఓ 'పట్టణ' సంస్థలో ఓ వార్డు ఏకగ్రీవమైంది. అక్కడ ఎన్నికైన అభ్యర్థి ఆనందంతో వార్డు పరిధిలోని ఓటర్లకు సంక్రాంతి పండుగ పిండివంటలకు సరుకులు పంపాడు. 5 లీటర్ల నూనె, 5 కిలోల గోధుమపిండి, వీటికి అదనంగా మందు బాటిల్‌ పంపిణీ చేశాడు.

ఇటు ఐటీ హబ్‌కు సమీపంలోని పురపాలికలోని ఓ వార్డును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల నేతలు ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. జూనియర్‌ ఆర్టిస్టులుండే చిత్రపురి కాలనీలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఇద్దరు సినీ పరిశ్రమకు సంబంధించిన వారే పోటీ చేస్తున్నారు.

ఓటు కోసం రూ. 2,000 నోటు, 100 పైపర్స్‌ ఫుల్‌ బాటిల్‌ కావాల్సిందే అనే డిమాండ్‌ అప్పుడే వినిపిస్తోంది. గత ఆదివారం నుంచే కాలనీ సంక్షేమ సంఘాలకు మంచి దావత్‌లు కూడా మొదలయ్యాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజధాని శివార్లలో ఐటీ, రియల్‌ రంగాలకు పట్టుగొమ్మల్లాంటి ఈ పురపాలికల్లో పెత్తనం కోసం డబ్బున్న నేతలు తహతహలాడుతున్నారు.

'ఎన్నికల ఖర్చుల' కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు అవసరం కావడంతో లిక్విడ్‌ క్యాష్‌ దొరకడం గగనమైపోయింది. మనీ డిజిటలైజేషన్‌ కావడం, రూ. 2,000 నోట్లు మార్కెట్లో తగ్గడం, ఖర్చు బ్యాంకు అకౌంట్‌ ద్వారానే చేయాల్సి ఉండటంతో హవాలా మార్గాలను వెతకడం కూడా ప్రారంభించేశారు.

బీజేపీ నాయకులతో పవన్ కల్యాణ్

ఒకే బాటలో జనసేన - బీజేపీ.. కలిసి పనిచేయాలని నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ఉద్యమం జరుగుతున్న తరుణంలో దిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుందని.. రాష్ట్రంలో కలిసి పనిచేయాలని బీజేపీ - జనసేనలు నిర్ణయించాయని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఇకపై రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని ఈ రెండు పార్టీలూ తీర్మానించాయి. దిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు జనసేన వర్గాలు ధ్రువీకరించాయి.

పార్టీల పరస్పర ప్రయోజనాలతో పాటు, రాష్ట్ర ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఇరు పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. రెండు పార్టీల జెండాలు వేరైనా ఇక మీదట అన్ని అజెండాలపై ఒకే వేదికగా కలిసి పనిచేయాలని అవగాహనకు వచ్చినట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి.

అమరావతి అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన పవన్‌కల్యాణ్ శనివారం రాత్రి దేశ రాజధాని చేరుకున్నారు. పవన్, నాదెండ్ల మనోహర్ మూడు రోజులుగా బీజేపీకి చెందిన పలువరు నాయకులతో సమాలోచనలు జరిపారు.

వీరు జేపీ నడ్డాతో జరిపిన సమావేశంలో బీజేపీలో కీలక వ్యక్తి, పార్టీ వ్యవస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ పాల్గొన్నారు. అనంతరం వారు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్, కేంద్ర సహాయమంత్రి వి.మరుళీధరన్‌, సునీల్ దేవ్‌ధర్‌లతో భేటీ అయ్యారు.

ఈ సమావేశాలన్నింటిలోనూ బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వీ సూర్య పాలుపంచుకున్నారు. పవన్‌కల్యాణ్‌తో సాన్నిహిత్యమున్న ఆయన గత కొన్ని రోజులుగా బీజేపీ, జనసేన చర్చల్లో కీలకపాత్ర పోషించినట్లు జనసేన వర్గాలు చెప్పాయి.

ఇరు పార్టీలు కలిసి పనిచేసే అంశంపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ఉనా దళితులు

వివక్షలేని దేశానికి మమ్మల్ని పంపించండి: రాష్ట్రపతికి గుజరాత్‌ ఉనా బాధితుల వినతి

గుజరాత్‌లోని 'ఉనా' బాధితులు.. తమను ఈ దేశ పౌరులుగా చూడటంలేదనీ, వివక్షలేని దేశానికి మమ్మల్ని పంపించాలని రాష్ట్రపతికి మొరపెట్టుకున్నట్లు ‘నవతెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. గిర్‌సోమ్‌నాథ్‌ జిల్లా ఉనాలో సర్వయ్యా కుటుంబానికి చెందిన దళిత యువకులను కారుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టిన ఘటనకు సంబంధించి బాధితులు ఏడుగురిలో ఒకరైన వాష్‌రాం ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 7న పిటిషన్‌ సమర్పించారు.

గోవధకు పాల్పడి.. దాని చర్మం వలిచారన్న ఆరోపణలతో ఏడుగురు దళితులను పెత్తందారీ కులానికి చెందిన దాదాపు 40 మంది 2016 జులై 11న ఇనరరాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. 'ఉనా ఘటన మమ్మల్ని ప్రాథమిక హక్కు, ఉపాధి నుంచి దూరం చేసింది' అని వాష్‌రాం అన్నారు. 'అధికారులు మమ్మల్ని ఈ దేశ పౌరులుగా చూడటంలేదు. మమ్మల్ని ఈ దేశ పౌరులుగా పరిగణించకపోతే.. మా పౌరసత్వం రద్దుచేయండి.. వివక్షలేని మరో దేశానికి మమ్మల్ని పంపించండి' అని కోరారు.

ఉనా దారుణంపై నిరసనలు వెల్లువెత్తటంతో వేగవంతమైన దర్యాప్తు కోసం ప్రత్యేక కోర్టును, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అప్పట్లో ఏర్పాటుచేశారు.

'ఘటన జరిగి నాలుగేండ్లు కావస్తున్నా... విచారణ కొనసాగుతూనే ఉన్నది. బాధితులకు వ్యవసాయ భూమి, ఇండ్ల కోసం స్థలం, ఉపాధి కల్పిస్తామని అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆమెకానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవ్వరూ మమ్మల్ని కనీసం కలవలేదు.. ఒక్క హామీ కూడా నెరవేరలేదు' అని వాష్‌రాం వాపోయారు.

‘మా హక్కులకు రాష్ట్రపతి హామీ ఇవ్వకపోతే.. కనీసం చనిపోయేందుకు అనుమతివ్వంి.. మా పిటిషన్‌ను పరిగణనలోనికి తీసుకోకపోతే.. రాష్ట్రపతి భవన్‌ ఎదుట సజీవదహనానికి పాల్పడతాం’ అని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)