పవన్ కల్యాణ్: ‘‘తెలుగుదేశం పార్టీ పెద్ద తప్పు చేసింది.. రాజధానికి మూడు వేల ఎకరాలు చాలని నేనూ అనుకున్నా’’ - ప్రెస్‌ రివ్యూ

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, facebook/janasenaparty

ప్రచురణ

రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొడతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

"సుస్థిర ప్రభుత్వం అందిస్తారని 151 సీట్లు ఇచ్చి వైకాపాను గెలిపిస్తే,, ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొడతారా? అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు అని చెప్పింది.

"గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే స్వాగతిస్తున్నానని జగన్ రెడ్డి అన్నారు. కేంద్రమూ మద్దతుగా నిలిచింది. అందరూ నమ్మకం కల్పిస్తేనే రైతులు రాజధానికి భూములిచ్చారు. రాజులు మారితే రాజధానులు మారుస్తారా" అని పవన్ నిలదీశారు

14 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించారని పత్రిక రాసింది.

"రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టు అన్న ప్రతి ఒక్కరి చెంపమీద కొట్టినంత బలమైన సమాధానం చెప్పాలి. పుట్టిన ప్రాంతంలో గుర్తింపు కార్డులు పట్టుకుని తిరగాల్సిన దుస్థితి ఏంటి? ఇదేమైనా ఇజ్రాయెలా, పాకిస్తానా?"

"జగన్ ధర్మం తప్పారు. ధర్మం తప్పినవారిని ఈ నేల క్షమించదు...రైతులను కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు నిలబడవు అని పవన్ అన్నట్లు కథనంలో చెప్పారు.

"కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువమంది ఎమ్మెల్యేలను వైకాపాకు ఇచ్చారు. అయినా వారు ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు మద్దతుగా నిలవడం లేదు. భూమిని నమ్ముకున్న రైతుకు అన్యాయం జరిగితే సహించేది లేదు"

"నా పర్యటనకు ఆటంకం కల్పించారు. ముళ్లకంచెలు వేశారు. ఎలాంటి దుర్మార్గాలు, అన్యాయాలు చేయకపోతే అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుంది" అని పవన్ అన్నారు.

"పోరాటంలో జనసేన మీకు అండగా ఉంటుంది. ఇక నుంచి జై ఆంధ్ర.. జై జై ఆంధ్ర అనే నినాదంతో పోరాడండి.. అందులో చాలా శక్తి ఉంది. .. మనల్ని సంఘటితం చేస్తుంది" అని పవన్ రైతులకు సూచించారు.

‘‘మొదట్లో నేనూ రాజధానికి రెండు, మూడు వేల ఎకరాలు చాలనుకున్నా. అయితే అసెంబ్లీ, సచివాలయమే రాజధాని కాదు, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పాలనా కేంద్రంగా మహా నగరం అవసరమని అందరూ సూచించారు. ఇలాంటి ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేం. అంచలంచెలుగా నిర్మించాలి. అందుకు ఒకటి, రెండు దశాబ్దాలు పడుతుంది’’ అని పవన్ చెప్పారు.

‘‘అమరావతిలో ఏం చేశారో ప్రపంచానికి చూపించలేకపోవడం తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద తప్పు. పోలవరానికి బస్సులు పెట్టి తీసుకెళ్లి చూపించారు. రాజధానిలో నిర్మాణాల పరిస్థితి ఏమిటో, ఎంతమంది త్యాగాలు చేశారో, కట్టడాలు ఎంతెత్తున లేచాయో తెలియజేయలేదు’’ అని పవన్ అన్నారని ఈనాడు ఈ కథనంలో రాసింది.

వందశాతం అక్షరాస్యతే తెలంగాణ లక్ష్యం-కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/telangana cmo

వందశాతం అక్షరాస్యతే తెలంగాణ లక్ష్యం-కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం వందశాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర ప్రారంభవేళ ప్రతిన పూనాలని రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చినట్లు నమస్తే తెలంగాణ సహా ప్రధాన పత్రికలన్నీ కథనాలు ప్రచురించాయి.

'ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌' అనే నినాదాన్ని అందిపుచ్చుకొని.. ప్రతి ఒక్క చదువుకొన్న విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యుడిగా మార్చాలని సీఎం కోరినట్లు చెప్పింది.

తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యత సాధించే ఈ సవాల్‌ను స్వీకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

'అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అక్షరాస్యతలో వెనుకవరుసలో ఉండటం ఓ మచ్చగా మిగిలింది. గత పాలకులు అందరినీ అక్షరాస్యులను చేయడంలో విఫలం కావడంవల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితిని తెలంగాణ రాష్ట్రం అధిగమించి తీరాలి' అని కేసీఆర్ చెప్పారని కథనంలో రాశారు.

తెలంగాణను వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చడానికి మనమందరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువురాని మరొకరిని అక్షరాస్యులుగా మార్చడానికి ప్రయత్నంచేయాలి అని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్నభరితమైన పోరాటంచేసి లక్ష్యం సాధించారు. ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగాం.

అదేవిధమైన స్ఫూర్తితో తెలంగాణను వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కృషిచేయాలి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది.

ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అక్షరాస్యత విషయంలో అప్రతిష్ఠను రూపుమాపాలి. తద్వారా తెలంగాణ గొప్ప ప్రగతికాముక రాష్ట్రంగా భాసిల్లాలి' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారని పత్రిక వివరించింది.

కొత్త ఏడాది చరిత్రాత్మకం కావాలి-జగన్

ఫొటో సోర్స్, facebook/Andhra Pradesh CM

కొత్త ఏడాది చరిత్రాత్మకం కావాలి-జగన్

2020 సంవత్సరం చరిత్రాత్మకం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారని ఆంధ్రజ్యోతి సహా ప్రధాన పత్రికలన్నీ కథనాలు ప్రచురించాయి.

సచివాలయంలో మంగళవారం జగన్ 'స్పందన'పై సమీక్ష నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కార్యక్రమాలను చేపడుతున్నామని, వీటి విజయానికి అంకితభావంతో పనిచేయాలని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు.

కొత్త సంవత్సరం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో మొదలవుతోందని సీఎం జగన్ తెలిపారు. ఈ 'తొలి వేడుక'లో ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ డిపోల వద్ద పాల్గొనాలని సూచించారు.

జనవరి 3వ తేదీన లక్షన్నర ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని జగన్‌ వెల్లడించారు. అదే రోజున ఆరోగ్యశ్రీ కింద 2059 రోగాలకు చికిత్సను అందించే కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామన్నారని కథనంలో రాశారు.

ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ అమలవుతుందని జగన్ చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి కోటీ 42 లక్షల కార్డులు పంపిణీ చేస్తామన్నారు.

ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో 5000 హెల్త్‌ సబ్‌ సెంటర్లకు జనవరిలోగా టెండర్లను ఖరారు చేస్తామని తెలిపారు. తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు ప్రతినెలా రూ.10000 పింఛను అందజేస్తామన్నారు.

మంచానికే పరిమితమైనవారికి, బోదకాలు, కండరాల క్షీణతతో బాధపడుతున్నవారికి రూ.5000 పింఛను చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఆంధ్రజ్యోతిలో రాశారు.

తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి, కిడ్నీ, లివర్‌, గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి నెలకు రూ.5000 చొప్పున పెన్షన్‌ అందజేస్తామన్నారు.

వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలు అందించే 11,150 రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్‌ నాటికి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తొలి దశలో ఫిబ్రవరి 1న 3300 కేంద్రాలు ప్రారంభమవుతాయన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'రైతు భరోసా' తుదివిడత లబ్ధిదారుల జాబితాను జనవరి 2న విడుదల చేస్తామన్నారని కథనంలో వివరించారు..

ఇటు తెలంగాణ ఆర్టీసీకి ఉద్యోగులందరికీ ఇక్రిమెంట్ కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆర్టీసీ ఎండీ మంగళవారం సర్కులర్ జారీ చేశారు.

ఉద్యోగి మూలవేతనం ఆధారంగా రూ.350 నుంచి రూ.1000 వరకు వివిధ క్యాటగిరీల ఉద్యోగులకు ఇంక్రిమెంటు అందనున్నదని కథనాల్లో రాశారు.

రాయపాటిపై సీబీఐ కేసు

ఫొటో సోర్స్, facebook/Rayapati Sambasiva Rao

రాయపాటిపై సీబీఐ కేసులు నమోదు

జాతీయ బ్యాంకులకు వందల కోట్ల రూపాయల రుణాల ఎగవేతకు సంబంధించి టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులపై సీబీఐ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని సాక్షి కథనం రాసింది.

రాయపాటికి చెందిన పలు ప్రాంతాల్లోని నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారని చెప్పింది.

హైదరాబాద్, గుంటూరు తదితర చోట్ల ఈ సోదాలు జరిగాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్‌ కావూరి హిల్స్‌లోని ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌తోపాటు డైరెక్టర్, ప్రమోటర్‌ చైర్మన్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు, ఇండిపెండెంట్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు చెందిన కొందరు ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో జాబితాలో చేర్చిందని కథనంలో వివరించారు.

జాతీయ బ్యాంకులకు రుణాల ఎగవేతకు సంబంధించి 120 బి, రెడ్‌విత్‌ 420, చీటింగ్, 406, 468, 477ఏ తదితర సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది.

తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఇతర ఖాతాలకు మళ్లించారంటూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ ప్రాంతీయ విభాగాధిపతి ఎస్‌.కె భార్గవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)