'దిశ కేసులో నిందితులు మరో 9 మంది మహిళలను రేప్ చేసి చంపేశారు' :ప్రెస్ రివ్యూ

ప్రచురణ

దిశ అత్యాచారం, హత్య కేసులో భయంకరమైన కోణాలు వెలుగుచూస్తున్నట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

దిశపై కిరాతకంగా లైంగికదాడి చేసి, హత్య చేసిన నలుగురు నిందితులు... ఎదురుకాల్పుల్లో మరణించడానికి ముందు పోలీసుల ఎదుట వెల్లడించిన వివరాలు అధికారులను విస్మయానికి గురి చేశాయని ఈ కథనంలో తెలిపారు.

హంతకుల నేరాల చిట్టా భయం పుట్టిస్తున్నది. వారు చంపింది ఒక దిశను మాత్రమేకాదు.. దిశ మాదిరిగానే మరో తొమ్మిది మందిని హత్యచేసి, దహనంచేసినట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసిందని నమస్తే తెలంగాణ రాసింది.

దిశ కేసులో ఏ1 ఆరు హత్యలు, ఏ4 మూడు హత్యలు చేసినట్లు ఒప్పుకొన్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని పత్రిక తెలిపింది.

ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల వద్ద చేసినట్లు నిందితులు అంగీకరించారని చెప్పింది.

ప్రతి ఘటనలోనూ మహిళలపై లైంగికదాడి, ఆ తర్వాత హత్య, అనంతరం మృతదేహాన్ని కాల్చేయడమే వీరి నేర ప్రక్రియ అని కథనంలో రాశారు.

నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో అలాంటి ఘటనలు మొత్తం 15 జరిగినట్లు గుర్తించారు. నిందితులు పాల్పడిన తొమ్మిది హత్యలు ఏమిటన్నవి తేల్చడానికి.. అధికారులు మొత్తం 15 హత్యలకు సంబంధించిన డీఎన్‌ఏ పరీక్షల నివేదికలను పరిశీలిస్తున్నారు.

చాలా కేసుల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షల్లో పోలీసులకు దర్యాప్తులో సహకరించేవిధంగా ఫలితాలు రాలేదు.

దీంతో పోలీసు అధికారులు శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ధారించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంచేశారు. హైవేలకు అనుకొని ఉన్న ప్రాంతాల్లో జరిగిన 15 హత్య కేసుల వివరాలను సేకరిస్తున్నారు.

ఈ 15 కేసుల్లో మృతుల డీఎన్‌ఏలతో నలుగురు నిందితుల డీఎన్‌ఏలను లోతుగా విశ్లేషించనున్నారు.

వాటితో పోలితే సైబరాబాద్ పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా చార్జిషీట్‌లో నిందితులు పాల్పడిన హత్యలకు సంబంధించిన వివరాలను ఆధారాలతో పొందుపరిచే అవకాశం ఉన్నది.

పోలీసులు గుర్తించిన 15 మంది మహిళల హత్యకేసుల్లో ఎక్కువశాతం మిస్టరీ వీడలేదని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.

యాదాద్రి కలకాలం నిలవాలి -కేసీఆర్

యాదాద్రి ప్రధాన ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

యాదాద్రిలో నిర్మించే ప్రతి నిర్మాణాన్ని ఆలయ నియమాలను అనుసరించి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పారు.

ఇది సనాతన ఆలయం. ఈ క్షేత్రంలో పూజలు చేయడం వారసత్వంగా వస్తున్న సంప్రదాయం కనుక పూర్తిగా ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారని కథనంలో రాశారు.

మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి యాదాద్రి క్షేత్రానికి చేరుకున్న ఆయన తొలుత బాలాలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పండితులు, పూజారులతో వేదాశీర్వచనం పొందాక ఆరున్నర గంటలపాటు క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించారు.

ముఖ్యమంత్రి హోదాలో యాదాద్రిని కేసీఆర్ దర్శించడం ఇది 12వ సారి అని ఈనాడు రాసింది.

నాలుగు నెలల క్రితం తను సూచించిన పనులన్నీ పూర్తికావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

దేశవిదేశాలలో నారసింహుని భక్తులు ఉన్నందున.. రాబోయే కాలంలో ఇక్కడ లక్షల సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా వారికి వసతులు, సౌకర్యాల విషయంలో ఎలాంటి లోటూ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచాలని ఆదేశించారు. అనంతరం యాదాద్రి కొండ చుట్టూ నిర్మితమవుతున్న బాహ్య వలయ రహదారి పనులను పరిశీలించారు.

జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామబాట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు జనవరి నుంచి గ్రామాల బాట పట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఆదేశాల అమలులో గందరగోళపడవద్దని, సందేహాలుంటే సీఎంవోతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సీఎం వారికి సూచించారు.

మంగళవారం రాత్రి ఇక్కడి బెరమ్‌పార్క్‌లో జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి ప్రత్యేక విందు ఇచ్చారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడిన ఆయన ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలు, పాలనాపరమైన ఇబ్బందులు ఇతర అంశాలపై వివరాలు తీసుకున్నారని పత్రిక రాసింది..

జనవరి నుంచి నేతలతో కలిసి గ్రామాల బాటపట్టేందుకు కలెక్టర్లు రెడీగా ఉండాలని సీఎం చెప్పారు. గత ఆరు నెలల్లో పేదల సంక్షేమం తెచ్చిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు చెప్పింది.

'ఒక్క అవినీతిలో తప్ప.. మిగతా అన్ని అంశాల్లో మీరు కలిసి మెలిసి పనిచేయాలి. పాలు, నీళ్లలా కలిసిపోవాలి. మీ మధ్య చక్కటి సమన్వయం నెలకొనాలి

2-3 లక్షల మంది ఓట్లేస్తే ఎమ్మెల్యేలు గెలిచారు. వారికి ప్రాధాన్యం ఇవ్వండి. వారు ఫోన్లు చేస్తే ఎత్తండి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాత్రి 9 తర్వాత అధికారులకు ఫోన్లు చేయకపోవడమే మంచిది.

ఏ సమస్య, సందేహం తలెత్తినా సీఎంవో అధికారులు తోడుగా ఉంటారు' అని అధికారులకు చెప్పిన సీఎం, జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిగా పనిచేస్తాయని తెలిపారని ఆంధ్రజ్యోతి రాసింది.

బూమ్ బూమ్ బుమ్రా

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రధాన ఆకర్షణగా నిలిచాడని సాక్షి కథనం రాసింది.

అయితే అతను వన్డే జట్టులో సభ్యుడు కాదు, ఈ మ్యాచ్‌కు బరిలోకి దిగడం లేదు!

వెన్ను గాయంతో కొంత కాలంగా జట్టుకు దూరమైన బుమ్రా తొలిసారి టీమిండియా సాధనలో భాగమయ్యాడు.

గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో గత కొంత కాలంగా బుమ్రా సొంతంగా నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తూ వచ్చాడు.

కానీ మొదటిసారి అతడు ఒక సిరీస్‌ సందర్భంగా జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు అని సాక్షి రాసింది.

మంగళవారం బుమ్రా బౌలింగ్‌ను కోచ్‌ రవిశాస్త్రి, సెలక్టర్‌ దేవాంగ్‌ గాంధీ పర్యవేక్షించారు. రిషభ్‌ పంత్, పాండే, మయాంక్‌లకు బుమ్రా పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేశాడు.

బంతులు విసిరే సమయంలో బుమ్రా ఏ ఇబ్బంది పడినట్లు కనిపించలేదు.

బుమ్రా ఫిట్‌నెస్‌ స్థాయిని బట్టి చూస్తే త్వరలోనే అతను జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని పత్రిక రాసింది.

యువ ఆటగాడు పృథ్వీ షా కూడా ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరయ్యాడు. డోపింగ్‌ నిషేధం ముగిసిన తర్వాత దేశవాళీ క్రికెట్‌ బరిలో దిగిన షా త్వరలోనే పునరాగమానాన్ని ఆశిస్తున్నాడు అని సాక్షి చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)