పవన్ కల్యాణ్ హీరోగా.. బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్ : బోనీ కపూర్ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Haarika & Hassine Creations/fb
సినీనటుడు పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారని, హిందీలో విజయవంతమైన 'పింక్' రీమేక్‌లో నటించబోతున్నారని ఈనాడు వెల్లడించింది. ఆ విషయాన్ని బాలీవుడ్ వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది.
బాలీవుడ్‌లో నిర్మితమైన 'పింక్'లో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించగా అనిరుద్ధరాయ్ చౌధురి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ కథానాయకుడిగా బోనీ కపూర్ పునర్నిర్మించారు.
ఇప్పుడు తెలుగులో దిల్‌రాజుతో కలిసి బోనీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని, యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తారని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్‌లో వెల్లడించారు.

ఫొటో సోర్స్, twitter/BoneyKapoor
ఆ ట్వీట్‌ని నిర్మాత బోనీ రీట్వీట్ చేయడంతో అది నిజమే అని ధ్రువీకరించినట్టైంది. హిందీ, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్ర కథ నచ్చి పవన్ అంగీకారం తెలిపారని సమాచారం.
కాగా దర్శకుడు శ్రీరామ్ వేణు ఇటీవల 'ఎమ్.సి.ఎ' చిత్రంతో విజయాన్ని అందుకొన్నారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో రక్తహీనత
తెలంగాణలో రక్తహీనత పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోందని, తాజాగా విడుదలైన 'నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019'నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారని సాక్షి పేర్కొంది.
ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 60.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇక 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయస్కుల్లో సాధారణ మహిళలు 56.9 శాతం మంది రక్తహీనతతో బాధపడుతుండగా, అదే వయసున్న గర్భిణుల్లో 49.8 శాతం మంది సైతం ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మొత్తంగా 15 నుంచి 49 ఏళ్ల మహిళలు 56.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది.
ఈ వయసు వారిలో అత్యంత తక్కువగా మిజోరం రాష్ట్రంలో 22.5 శాతం, నాగాలాండ్‌లో 23.9 శాతం, మణిపూర్‌లో 26.4 శాతం మహిళలు రక్తహీనతకు గురయ్యారు.
అలాగే, రాష్ట్రాన్ని శ్వాసకోశ వ్యాధులు హడలెత్తిస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో ఈ పరిస్థితి పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం నగరాల్లో ప్రతి 10 మందిలో ఒక రు కాలుష్యానికి గురవుతున్నారని అంచనా వేసింది.
నేషనల్ హెల్త్ ప్రొఫైల్ లెక్కల ప్రకారం 2017 కంటే 2018లో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. 2017లో దేశంలో 4.21 కోట్ల మంది శ్వాసకోశ వ్యాధులకు గురికాగా 3,254 మంది మరణించారు.
2018లో 4.19 కోట్ల మంది ఈ వ్యాధులబారిన పడగా మరణాల సంఖ్య 3,740కు చేరుకుంది. అదే తెలంగాణలో చూస్తే 2017లో శ్వాసకోశ వ్యాధులకు గురైనవారు 7.69 లక్షల మంది ఉండగా వారిలో 26 మంది చనిపోయారు. 2018లో 7.40 లక్షల మంది శ్వాసకోస వ్యాధులబారిన పడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. గతేడాది కేరళలో అత్యధికంగా 58.57 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులకు గురయ్యారని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలో మీడియాపై అప్రకటిత ఎమర్జెన్సీ
స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా పాత్రికేయులు, మీడియాను గుప్పిట్లో పెట్టుకునే ధోరణితో జీవోలు జారీ చేయడం మంచిది కాదని ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు జయశంకర్ గుప్తా స్పష్టం చేశారని, ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారని ఈనాడు తెలిపింది.
ఏపీ ప్రభుత్వ చర్య అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని, మీడియాను కట్టడి చేసేందుకు వీలు కల్పించే ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. ఒకవేళ మీడియా తప్పు చేసిందని భావిస్తే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వానికి, అధికారులకు ఎప్పుడూ అవకాశం ఉంటుందని, అలా కాకుండా ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగే తప్పులను ఎత్తిచూపడం మీడియా ప్రాథమిక హక్కని, దానిని హరించే ప్రయత్నం చేయడమంటే సమాజాన్ని చీకట్లోకి నెట్టడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలను ప్రజల కోసం రాజకీయ పార్టీలు నడపాలి తప్పితే స్వీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఒకవైపు సొంత మీడియా సంస్థలను నడుపుతూనే మరోవైపు మొత్తం మీడియాపై నియంత్రణ విధించాలనుకోవడం వింత పోకడగా అభివర్ణించారు. స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉండాలని, తమకు నచ్చినవారికే దానిని పరిమితం చేయడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన నేతలు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను కాపాడుకోవాలి తప్పితే కళ్లెం వేయకూడదని హితవు పలికారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సంబంధిత అధికారులకు తాఖీదులను జారీ చేసి వివరణ కోరడం శుభపరిణామమని తెలిపారని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Tmuashwathmareddy/fb
‘ఆర్టీసీ సమ్మెను విరమించం’
కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది. శనివారం నుంచి 9వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ఆయన ప్రకటించారు.
గన్‌పార్క్ అమరుల స్థూపం వద్ద అఖిలపక్ష, జేఏసీ నేతల మౌన దీక్ష అనంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో అశ్వత్థామ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ అప్రజాస్వామిక నిర్ణయాలు సుప్రీం కోర్టులోనూ చెల్లవని అన్నారు. కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ప్రజా రవాణాను బతికించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.
4, 5 తేదీల్లో రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యను పరిష్కరించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేసీఆర్ మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. కార్మికులు దిగులు చెందవద్దని, అంతిమ విజయం కార్మికులదేనని అన్నారు.
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను అశ్వత్థామరెడ్డి, కోదండరాం కోరారు. ఆర్టీసీలో కేంద్రానికీ వాటా ఉన్నందున తాజా పరిస్థితిలో తక్షణం జోక్యం చేసుకునే అవకాశాన్ని పరిశీలించాల్సిన అవశ్యకత ఉందని కోదండరాం అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీ జేఏసీ నాయకులకు అవసరమైతే కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ ఇప్పించాలని లక్ష్మణ్‌ను కోరారు. సీఎం వైఖరితో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అశ్వత్థామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యమంలో తమవంతుగా క్రియాశీలకంగా పాల్గొంటామని లక్ష్మణ్ వారికి భరోసా ఇచ్చారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు... గంగూలీ, ద్రావిడ్‌లకు వర్తించిన లాజిక్ అతనికి వర్తించదా...?
- రాయల్ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..
- హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది?
- ఏపీలో ఈ ఏడాదిలో మూడోసారి వరద.. ప్రకాశం బ్యారేజీ వద్ద గత 20 ఏళ్లలో కొత్త రికార్డు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






















