జనసేన అధినేత పవన్ కల్యాణ్: కేసుల సీఎం న్యాయం చేయలేరు- ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, janasena/fb
''ముఖ్యమంత్రి జగన్ తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రాజెక్టుల గురించి గట్టిగా మాట్లాడలేకపోయారు. మాట్లాడితే సీబీఐ కేసులు బయటకు తీస్తారని ఆయనకు భయం. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులైతే రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది?'' అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
తనపై కేసులుంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ధైర్యం సీఎంకు ఉండదని.. మంగళవారం జగన్ ఢిల్లీ పర్యటనలో అదే జరిగిందని చెప్పారు. ఆయనకు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు దొరకలేదని తెలిపారు.
బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'విశాఖ లాంగ్ మార్చ్' పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.
''చేతిలో అధికారం లేనప్పుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. చిన్నాన్న హత్య కేసు, కోడికత్తి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలన్నారు. అధికారం వచ్చాక ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముఖ్యమంత్రి అయ్యాక ఆ కేసుల విషయం మర్చిపోయారా? శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం ఇలాంటి పాలిటిక్స్ చేయడం వల్లే నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జర్నలిస్టుపైన, మహిళా అధికారి మీద దాడికి తెగించారు. తూర్పుగోదావరిలో వైసీపీకి చెందిన వ్యక్తి రోడ్డుపై వెళ్లే వ్యక్తిని పొడిచేయగలడు! మీరు (జగన్) క్రైంను ప్రోత్సహిస్తుంటే మిమ్మల్ని అనుసరించేవారూ అదే చేస్తారు. మనం ఎన్నుకున్న వ్యక్తులు ఆర్థిక నేరగాళ్లయితే మనం భయంతో బతకాల్సి వస్తుంది'' అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, HIGH COURT
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
డెంగీ నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై బుధవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని, దోమల నివారణకు మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించిందని ఈనాడు తెలిపింది.
డెంగీ బారిన పడి ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం మొక్కుబడిగా స్పందిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఏం చర్యలు తీసుకుంటున్నారో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్లను ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విస్తరిస్తోందని, వెంటనే నివారణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ డాక్టర్ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు, ఇదే విషయంపై న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకున్న విషయం విదితమే.
ఈ పిటిషన్లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఓ బుక్‌లెట్‌ను కోర్టుకు సమర్పించినట్లు చెప్పగానే... ఇది బుక్‌లెట్‌లా లేదని, పెద్ద గ్రంథంలా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మూడు రోజుల కిందట మేం ఓ న్యాయమూర్తిని కోల్పోయాం. ఆ కుటుంబంలో అందరూ డాక్టర్లే అయినా ఆమెను కాపాడుకోలేకపోయారంది. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాపిస్తోందని పేర్కొంది. ఈ దశలో ఏజీ జోక్యం చేసుకుంటూ అక్టోబరులో 205 డెంగీ కేసులు నమోదయ్యాయనగా అక్టోబరులో 205...తరువాత 400...ఇలా పెరుగుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.డెంగీపై అవగాహన కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించామని, ఎక్కడా కనిపించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అఫ్జల్‌గంజ్‌లోనే చూస్తే వస్త్రాలకు చెందిన ఓ పెద్ద హోర్డింగ్ తప్ప మరేమీ కనిపించడం లేదంది. ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలను పరిశీలించిన హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఫ్రైడే డ్రైడేగా పాటిద్దాం... వాతావరణాన్ని పొడిగా ఉంచుదామని పేర్కొనడాన్ని ప్రశ్నించింది. అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు మద్యం వినియోగించరాదని డ్రైడే అన్నారని, ఇక్కడ అలా రాస్తే ప్రజలు తికమకపడటం తప్ప ప్రయోజనం ఉండదని కోర్టు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY
గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు
ఆంధ్రప్రదేశ్‌లో చిన్నచిన్న వాగులు, వంకలు, ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు కొరత తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించిందని సాక్షి తెలిపింది.
ఇందులో భాగంగా ఏరులు, వాగులు వంకలలో ఇసుక తవ్వకాలు, రవాణాను క్రమబద్ధీకరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్ట్రీమ్స్‌గా పరిగణించే వంకలు, వాగులు, ఏరులలో ఇసుకను స్థానిక అవసరాలకు విస్తృతంగా వాడుకునేలా చూడటం ద్వారా తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామ సచివాలయాల్లోనే ఇసుక రవాణా పర్మిట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది.
ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్ (ట్రాన్సిట్ పాస్) తీసుకోవాలి. సచివాలయ అధికారి ఒరిజినల్ పర్మిట్‌ను ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు.
ఇసుక రీచ్‌ల పర్యవేక్షణను గ్రామ సచివాలయ ఇన్‌చార్జి సంబంధిత వలంటీర్‌కు అప్పగిస్తారు. సచివాలయంలో డబ్బులు చెల్లించిన వారు రేవు వద్దకు వెళ్లి పర్మిట్‌ను వలంటీర్‌కు ఇచ్చి ట్రాక్టరు, ఎద్దుల బండిలో ఇసుక నింపుకొని తీసుకెళ్లవచ్చు. ఈ పర్మిట్ 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఇసుక రవాణా పర్మిట్ పాస్‌ల జారీ కోసం ముద్రించిన ఫారం-ఎస్ 3 పుస్తకాలను గ్రామ సచివాలయాలకు ఏపీఎండీసీ సరఫరా చేస్తుంది. ఇసుకను తరలించేందుకు పర్మిట్ తప్పనిసరి. పాస్ లేకుండా తరలిస్తే జరిమానా విధిస్తారు. ప్రతి పాస్‌కు ఒరిజనల్, డూప్లికేట్ అనే రెండు పేపర్లు ఉంటాయి.
దీంతో ఏయే గ్రామ సచివాలయం పరిధిలో ఎంత ఇసుక విక్రయించారనే గణాంకాలు పక్కాగా ఉంటాయి. వరదల వల్ల తాత్కాలికంగా ఏర్పడిన ఇసుక సమస్యను పరిష్కరించడం కోసమే భూగర్భ గనుల ఈ ఆదేశాలను జారీ చేసింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిందని సాక్షి వెల్లడించింది.

ఫొటో సోర్స్, KALVAKUNTLACHANDRASHEKARRAO/FB
‘మున్సిపోల్స్‌కు సిద్ధంకావాలి’
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.
పురపాలక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన బుధవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, అరవింద్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సంసిద్ధతను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామన్నారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారని నమస్తే తెలంగాణ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- భారత్-పాకిస్తాన్లలో గోదాములు నిండుగా ఉన్నా ఆకలికేకలు
- బీసీసీఐ ప్రెసిడెంట్: నాడు విజయనగరం రాజ కుమారుడు.. నేడు కోల్‌కతా ‘ప్రిన్స్’.. 65 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు కెప్టెన్‌కు పగ్గాలు
- Xiaomi: భారత మార్కెట్లో ఈ చైనా బ్రాండ్ ఆధిపత్యం ఎలా సాధ్యమైంది?
- 'పోర్న్‌ను పురుషులే కాదు, మహిళలూ ఎంజాయ్ చేసేలా చేయాలి'
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- 'పోర్న్‌ను పురుషులే కాదు, మహిళలూ ఎంజాయ్ చేసేలా చేయాలి'
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- భారత్-పాకిస్తాన్లలో గోదాములు నిండుగా ఉన్నా ఆకలికేకలు
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- రాయల్ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























