‘బాలికల పాఠశాలల్లో పురుష టీచర్లపై రాజస్థాన్ సర్కారు నిషేధం -ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులను వెనుకకు పిలవాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించిందని నమస్తే తెలంగాణ వెల్లడించింది. పాఠశాలల్లో ఈవ్ టీజింగ్ (వేధించడం) కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతస్రా విలేకరులతో మాట్లాడుతూ బాలిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులను వెనుకకు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. బాలికల పాఠశాలల్లో మహిళా టీచర్లనే నియమించడానికి ప్రాధాన్యం ఇస్తామని, ఒకవేళ వీరు సరిపోకపోతే 50 ఏళ్లకు పైనున్న పురుష ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు.
బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానని, అది వచ్చాక పరిస్థితిని బట్టి మహిళా టీచర్ల నియామకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.
మంత్రి నిర్ణయాన్ని పలువురు తప్పుపట్టారు. యూనిసెఫ్ మాజీ పాలసీ ప్లానర్ కేబీ కొటారి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,019 బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులను వెనుకకు పిలువడం చాలా సులభం. కానీ, ఈ చర్య వల్ల దాదాపు 95 శాతం ఉన్న మిగతా పాఠశాలల్లోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు భయానికి లోనవుతారు. తాము వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని బాలికలు భయపడుతారు అని తెలిపారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT
తెలంగాణ ఆర్టీసీ సమ్మె: 12 రోజులకు రూ. 32 కోట్ల నష్టం
డిమాండ్ల సాధనకు కార్మికుల పట్టు.. మెట్టు దిగేది లేదంటూ ప్రభుత్వం బెట్టుచేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీలో అదనపు నష్టాలు నమోదవుతున్నాయని ఈనాడు పేర్కొంది.
గతంలో నమోదైన నష్టాలకుతోడు కొత్తగా భారం పెరుగుతోంది. ఆర్టీసీకి ఉన్న అన్ని బస్సులు నడిపితే టికెట్ల రూపంలో రోజుకు సుమారు రూ.11 కోట్ల వరకు రాబడి రావాలి. ఇంత ఆదాయం వచ్చినా.. రోజుకు కాస్తంత అటుఇటుగా రూ. మూడు కోట్ల నష్టం వచ్చేది.
సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ, అద్దెకు తీసుకున్న బస్సుల్లో ప్రస్తుతం 55 శాతానికిపైగా బస్సులను యాజమాన్యం నడుపుతోంది. తిరిగిన బస్సుల మేరకు రోజువారీ సగటు రాబడి రూ.2.10 కోట్లు వస్తోండగా.. నష్టం రూ.2.66 కోట్లు నమోదవుతోంది.
ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు నడిపిన బస్సులు ఎన్ని? రాబడి ఎంత? ఖర్చు ఎంత? నష్టం ఎంత? అన్న గణాంకాలపై ఆర్టీసీ అధికారులు శనివారం లెక్కలు తీశారు.
గత 12 రోజుల్లో రూ.25.08 కోట్ల రాబడి రాగా.. నష్టం సుమారు రూ.32 కోట్లు నమోదైందని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY
రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు ఏపీ సర్కార్ మంగళం
'రిటైర్డ్ ఉద్యోగుల' సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్వాసన పలికిందని, పదవీ విరమణ చెందినప్పటికీ, ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందు నుంచి సేవలు అందిస్తున్న వారందరినీ తక్షణం తప్పించాలని ఆదేశించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
అలాగే... మార్చి 31వ తేదీకి ముందు పేపర్ నోటిఫికేషన్, సంబంధిత నియామక ప్రక్రియ ద్వారా కాకుండా నియమితులైన రూ.40 వేల పైబడి వేతనం తీసుకుంటున్న కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ సిబ్బందినీ ఉద్యోగాల నుంచి తొలగించింది.
దీనిపై సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం రాత్రి పొద్దుపోయాక జీవో విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు రాష్ట్రస్థాయితో మొదలుకొని జిల్లా, డివిజన్, మండల, గ్రామ కార్యాలయాలతోపాటు కార్పొరేషన్లు, అటానమస్ సంస్థలకు వర్తిస్తుందని జీవోలో స్పష్టం చేశారు.
దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, సెక్రటరీలు ఈ నెల 31 లోపు తగు చర్యలు తీసుకుని సంబంధిత నివేదికను సాధారణ పరిపాలనశాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
స్పందించకుంటే సమ్మె ఉధృతం
హైకోర్టు ఆదేశం ప్రకారం ప్రభుత్వం ఇప్పటికైనా తమతో చర్చల ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ డిమాండ్ చేసిందని సాక్షి తెలిపింది.
కోర్టు చెప్పినా స్పందించకపోవడం సరికాదని పేర్కొంది. ప్రజలంతా ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని, శనివారం రాష్ట్ర బంద్‌ను వారు విజయవంతం చేసిన తీరును ప్రభుత్వం గుర్తించాలని సూచించింది.
శనివారం సాయంత్రం జేఏసీ ప్రతినిధులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ తదితరులు, కార్మిక ప్రతినిధులు సమావేశమై సమ్మె తదుపరి కార్యాచరణపై చర్చించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైన బంద్ ఇదేనన్నారు. దీనికి అన్ని విపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు, ఆటో, క్యాబ్ యూనియన్లు స్వచ్ఛందంగా మద్దతు పలికి విజయవంతం చేశాయన్నారు.
ఆర్టీసీని పరిరక్షించుకోవాలన్న తపన అందరిలో ఎంతగా ఉందో ఈ బంద్ ఫలితమే చెబుతోందన్నారు. బంద్‌తో సమ్మె ముగిసినట్టు కాదని, ప్రభుత్వంలో మార్పు రాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పరిస్థితి ఇలాగే ఉంటే రాజకీయ సంక్షోభం వస్తుందని హైకోర్టు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించాలని సూచించారని సాక్షి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్
- బీబీసీ 100 వుమన్: ఈ జాబితాలో భారతీయులు ఎంత మంది?
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- మహిళ అంగీకారంతో సెక్స్ చేసినా మగాడి మీద 'రేప్' కేసు పెట్టవచ్చా...
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- సిరియాలో టర్కీ సైనిక చర్యతో ఇస్లామిక్ స్టేట్ తిరిగి పుంజుకుంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























