తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపుతో నేడు రాష్ట్రవ్యాప్త బంద్ -ప్రెస్ రివ్యూ

ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే చర్యల్లో భాగంగా శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పూర్తిస్థాయిలో సిద్ధమైందని సాక్షి తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేయనుంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమని ప్రకటిస్తూనే సమ్మెను మాత్రం ఆపేది లేదని ప్రకటించింది. బంద్ లో భాగంగా శుక్రవారం 14వ రోజున సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలతో ఆర్టీసీ జేఏసీ హోరెత్తించింది.
అన్ని డిపోల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్‌లు నిర్వహించింది. వ్యాపారులు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఆర్టీసీ పరిరక్షణ కోసం చేస్తున్న బంద్ అయినందున ప్రజలు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది.
బంద్‌కు టీఆర్‌ఎస్, మజ్లిస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, ప్రజాసంఘాలు, ఆటో, క్యాబ్ సంఘాలు మద్దతు ఇప్పటికే పలికాయి. బంద్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ శనివారం మధ్యాహ్నం లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి తెలిపారు
ఆర్టీసీ జేఏసీ శనివారం తెలంగాణ బంద్ చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంద్ ప్రభావం పడకుండా వీలైనన్ని ఎక్కువ బస్సు లు తిప్పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశంతో శుక్రవారం చాలా బస్సు ల్లో కండక్టర్లకు టికెట్ల జారీ యంత్రాల వాడకంపై శిక్షణ ఇచ్చి అందించినా చాలా మంది కండక్టర్లు వాటిని ఆపరేట్ చేయలేక సంప్రదాయ టికెట్ ట్రేలు అడిగి తీసుకెళ్లారు.
కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి డిమాండ్ చేశారని సాక్షి వెల్లడించింది.

ఫొటో సోర్స్, janasena/fb
ఏపీ రాజధానిని పిల్లి కాపురంగా చేస్తున్నారు...
ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వత రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టి ప్రజలకు పాలనాపరమైన సౌలభ్యం లేకుండా చేయడమే ప్రస్తుత ప్రభుత్వ విధానంలా ఉందంటూ జనసేన పొలిట్‌బ్యూరో సమావేశం అభిప్రాయపడిందని ఈనాడు పేర్కొంది.
పిల్లి తన కూనలను ఆరుచోట్లకు మారుస్తుందన్నట్లుగా రాజధాని అక్కడ, ఇక్కడంటూ... చివరకు ఎక్కడా లేకుండా చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేసింది. అనువైన ప్రదేశానికి అన్వేషణ, నిపుణుల కమిటీ పరిశీలన పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, మంత్రి బొత్స తన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని తప్పుపట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన కొత్త ఇసుక విధానంతో నిర్మాణ, దాని అనుబంధ రంగాలను తిరోగమన దిశలోకి వెళ్లాయని ఆరోపించింది. ఏకంగా 35 లక్షల మంది వరకు ఉపాధి కోల్పోయారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని ఆందోళన వ్యక్తంచేసింది.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమైంది. సమావేశంలో నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్‌రావు, అర్హంఖాన్‌లు పాల్గొన్నారు. రాజు రవితేజ యూరప్‌లో ఉన్నందున ఆయన రాలేదు.
రాజ్యాంగ స్ఫూర్తిని, అది ప్రసాదించిన హక్కులను యువతకు తెలియజేసేందుకు మేధోమథనం చేపట్టాలని నిర్ణయించారు. ఆర్టికల్ 370 రద్దు జమ్మూ-కశ్మీర్ ప్రగతికి దోహదపడుతుందని అభిప్రాయపడుతూ తీర్మానం ఆమోదించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిష్కరించాలని జనసేన నేతలు సూచించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలతో కలిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘సీఎం అయినా రావాల్సిందే’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతి శుక్రవారం ప్రత్యేక కోర్టుకు రావలసిందేనని సీబీఐ స్పష్టం చేసిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
అక్రమాస్తుల కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న జగన్.. ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రిగా విధుల్లో బిజీగా ఉన్న కారణంగా తనకు బదులుగా న్యాయవాది (స్పెషల్ వకాలత్) కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 205 కింద దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు శుక్రవారం మరోసారి విచారించారు.
సీఎంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడాన్ని చట్టం అనుమతించదని, గతంలో కోర్టులు ఇవే అభ్యర్థనలను తోసిపుచ్చాయని సీబీఐ స్పెషల్ పీపీ కె.సురేందర్‌రావు ఈ సందర్భంగా నివేదించారు. ఎంపీగా, ప్రతిపక్ష నేత హోదా ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్లను ఇదే కోర్టు రెండుసార్లు కొట్టివేసిందని గుర్తుచేశారు.
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించినా సీబీఐ కోర్టు తీర్పునే సమర్థించిందని తెలిపారు. హోదాను కారణంగా చూపించి వ్యక్తిగత హాజరు కోరడానికి చట్టం అనుమతించదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు.
ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావలసిందేనని.. మిగతా రోజుల్లో రాజకీయాలు చేసుకోవాలని తేల్చిచెప్పిందని తెలిపారు. గత కొంత కాలంగా నిందితులపై అభియోగాలు నమోదు చేసే దశలో కేసు విచారణ కొనసాగుతోందని స్పెషల్ పీపీ తెలిపారు. జగన్ హోదా మారి ఉండవచ్చని, కానీ, కేసు విచారణలో పురోగతి అక్కడే ఉందని, విచారణకు ఆయన హాజరు తప్పనిసరని పేర్కొన్నారు.
సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఒకరోజు సీబీఐ కోర్టుకు విచారణకు హాజరైతే సెక్యూరిటీ, ప్రొటోకాల్ ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.60 లక్షల దాకా అవుతుందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కోర్టుకు హాజరుకావడం వల్ల రాష్ట్రప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు. కోర్టుకు హాజరయ్యేందుకు అసౌకర్యంగా ఉందని మినహాయింపు కోరడం లేదని, సీఎంగా పరిపాలనను పర్యవేక్షించాల్సిన రాజ్యాంగబద్దమైన బాధ్యత ఉన్నందున హాజరు మినహాయింపు కోరుతున్నామని తెలిపారు.
సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొన్న అంశాలు, ఉపయోగించిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. ఊహాజనితమైన అంశాలను, చార్జిషీట్‌లో పేర్కొనని విషయాలను కూడా కౌంటర్‌లో ప్రస్తావించారని అభ్యంతరం వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
పాల నాణ్యతకు తిలోదకాలు... తెలంగాణలోనే ఎక్కువ
దేశంలో పాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, శుద్ధిచేసిన పాలలోనూ (ప్రాసెస్డ్ మిల్క్) నాణ్యత ప్రమాణాలు కొరవడినట్లు భారత ఆహార భద్రత ప్రమాణాల అధీకృత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధ్యయనంలో వెల్లడైందని నమస్తే తెలంగాణ తెలిపింది.
పరీక్షించిన మొత్తం పాల శాంపిళ్లలో 37.7 శాతం ప్రాసెస్డ్ మిల్క్ శాంపిళ్లు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనట్లు సర్వేలో తేలింది. ఇందులో దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల బ్రాండ్లు సైతం ఉండడం గమనార్హం.
భద్రతా ప్రమాణాల విషయంలోనూ 10.4 శాతం ప్రాసెస్డ్ మిల్క్ శాంపిళ్లు విఫలమైనట్లు వెల్లడైంది. మరోవైపు 12 శాతం నమూనాలలో కల్తీ ఉన్నట్లు గుర్తించారు. ఈ కల్లీ శాంపిళ్లు తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళలో ఎక్కువగా నమోదయ్యాయి.
2018 మే నుంచి అక్టోబర్ మధ్య దేశవ్యాప్తంగా 1,103 నగరాలు, పట్టణాల నుంచి మొత్తం 6,432 పాల నమూనాలను (శాంపిళ్లను) సేకరించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ అధ్యయనం నిర్వహించింది.
ఇందులో 40.5 శాతం శుద్ధిచేసిన పాల శాంపిళ్లు కాగా, మిగిలినవి శుద్ధిచేయని ముడి పాలకు సంబంధించినవి. వ్యవస్థీకృత డెయిరీ రంగం నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిందేనని, 2020 జనవరి 1నాటికి అన్ని డెయిరీ యూనిట్లలోనూ పరీక్ష, తనిఖీ వ్యవస్థను ఏర్పాటుచేయాల్సి ఉంటుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసిందని నమస్తే తెలంగాణ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్
- బీబీసీ 100 వుమన్: ఈ జాబితాలో భారతీయులు ఎంత మంది?
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- మహిళ అంగీకారంతో సెక్స్ చేసినా మగాడి మీద 'రేప్' కేసు పెట్టవచ్చా...
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- సిరియాలో టర్కీ సైనిక చర్యతో ఇస్లామిక్ స్టేట్ తిరిగి పుంజుకుంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






















