వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడి ‘అనుమానాస్పద మృతి’: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి(57) ఆత్మహత్య చేసుకున్నట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం రాసింది. ఆ కథనం ప్రకారం..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలను సంబోధిస్తూ శ్రీనివాసులరెడ్డి రాసినట్టు చెబుతున్న రెండు లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాను ఏ తప్పూ చేయలేదని, ఓ పోలీసు అధికారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖల్లో శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. అయితే లేఖల్లో దస్తూరి వేర్వేరుగా ఉండటంతో వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.

ఏళ్లుగా తాము వైఎస్‌ కుటుంబానికి సేవ చేస్తున్నామని, చేయని తప్పుకు పోలీసులు విచారించడంతో శ్రీనివాసులరెడ్డి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన బావమరిది పరమేశ్వర్‌రెడ్డి మీడియాతో చెప్పారు.

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కడప పోలీసులు సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

'పదవులు రాగానే పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు'

పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

పార్టీ వల్లే పదవులు వచ్చాయని నేతలు గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రజలే బాసులనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి ఓనర్లం తామేనని చెబుతూ తనకు వచ్చిన పదవి ఎవరి భిక్షా కాదన్నారు.

అయితే, ఈటల పేరును ప్రస్తావించకుండా కేటీఆర్ తాజా వ్యాఖ్యలుచేశారు.

'రాజకీయాల్లోకి వెళ్లను'

గవర్నర్‌ పదవి వీడాక ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వెళ్లబోనని ఈఎ్‌సఎల్‌ నరసింహన్‌ స్పష్టంచేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనం వెల్లడించింది.

గవర్నర్‌గా తాను ఏ రాజకీయ పార్టీకి, ఏ వర్గానికి అనుకూలంగా వ్యవహరించలేదని ఆయన వివరించారు. ఇకపై వ్యక్తిగత జీవితం గడపడానికే ఇష్టపడుతున్నట్లు చెప్పారు.

''జీవితంలో చాలా కెమెరాలను ఎదుర్కొన్నా... ఈ వయసులో తట్టుకోవడం కష్టం'' అని చలోక్తి కూడా విసిరారు.

వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పదవీ కాలం తనకు ఎంతో సంతృప్తిని అందించిందన్నారు.

'మహిళల వల్లే మద్యం వినియోగం పెరిగింది'

ఎక్కువ మంది మహిళలు.. అది కూడా ఎక్కువగా తాగుతుండటం వల్లే దిల్లీలో మద్యం వినియోగం బాగా పెరిగిందని ఓ సర్వేలో తెలినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

పెరిగిన సంపాదన, ఆకాంక్షలు, జీవనశైలి, సామాజిక ఒత్తిడులు మహిళల్లో మద్యం అలవాటును ప్రేరేపిస్తున్నాయి.

18-30 ఏళ్ల మహిళల్లో 43.7%మంది ఆల్కహాల్‌ను సాధారణంగా తీసుకుంటుండగా, 31-45 ఏళ్ల వారిలో 41.7% మంది సామాజిక, వృత్తి పరమైన అవసరం రీత్యా తాగుతున్నారు.

60 ఏళ్లకు పైబడిన వారిలో 53 % మంది, 46-60 ఏళ్ల వారిలో 39.1% మంది భావోద్వేగం కారణంగా తాగుతున్నారు.

దిల్లీలోని 18-70 మధ్య వయస్సున్న 5 వేల మంది మహిళల నుంచి కమ్యూనిటీ ఎగెనెస్ట్‌ డ్రంకెన్‌ డ్రైవింగ్‌(సీఏడీడీ) సంస్థ ఈ సర్వే చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)