పవన్ కల్యాణ్ : ‘టీడీపీని దెబ్బతీసేందుకు రాజధానిపై పొలిటికల్ గేమ్ ఆడొద్దు’ - ప్రెస్ రివ్యూ

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, twitter/JanaSenaParty

ప్రచురణ

ఏపీ రాజధాని వ్యవహారాన్ని తేదేపాను దెబ్బతీసే అంశంగా జగన్ ప్రభుత్వం చూడకూడదని జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త రాసింది.

ఒక మెజార్టీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంపై నిర్ణయం తీసుకుని ప్రధానితో శంకుస్థాపన చేయించాక, రాజధాని అది కాదంటూ మరో సర్కారు అనిశ్చితి సృష్టించడమేంటని పవన్ విమర్శించారు.

రాజధాని తరలింపు వివాదంపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని పవన్ అన్నారు.

రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో రహదారులు, కాలువలు, రిజర్వాయర్ల పనులు జరిగాయని.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మలి దశలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వారికి తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

''ఇక్కడ రాజధానిని ఉంచుతారా? లేదా? ఒకవేళ ఉంచకూడదంటే ఏ ప్రాతిపదికన, ఎక్కడికి తరలిస్తారో జగన్‌ చెప్పాలి. దీన్నో పొలిటికల్ గేమ్‌లా చూస్తే ప్రజలు నష్టపోతారు. జనసేన దీన్ని అంగీకరించదు. చూస్తూ ఊరుకోం'' అని అన్నారు.

''అమరావతి రైతులు తమ భూములను రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారే తప్ప... టీడీపీకో, వైసీపీకో ఇవ్వలేదు. నేడు అధికారంలో ఉన్న పాలకులు ఈ విషయాన్ని గమనించాలి. రాజు మారితే, రాజధాని కూడా మారాలా?'' అని పవన్‌ ప్రశ్నించారు.

రైతు బంధు

10 ఎకరాలకే 'రైతుబంధు'!

ఒక్కో రైతుకు గరిష్ఠంగా పది ఎకరాలకే పెట్టుబడి సాయం అందించేలా రైతు బంధు పథకం నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం మార్చనున్నట్లు సమాచారం ఉందని సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఎన్ని ఎకరాలు ఉన్నా రైతుబంధు సొమ్ము అందజేయాలనే నిబంధనను మార్చాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదన పంపినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థికమాంద్యం నేపథ్యంలో దీన్ని వచ్చే రబీ నుంచి లేదా ఆ తర్వాత వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

పదెకరాలకు మించి భూమి ఉన్నా పదెకరాల వరకు మాత్రమే సొమ్ము ఇవ్వాలనేది తమ ఆలోచన అని అధికార వర్గాలు వివరించాయి.

సీఎం దీనికి అంతగా సుముఖంగా లేరని సమాచారం. ఎంత భూమి ఉన్నా పెట్టుబడి సాయం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చినందున, ఆ మాట తప్పకూడదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పదెకరాల సీలింగ్‌ అమలు చేస్తే ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల వరకు మిగులుతాయని ఆర్థికశాఖవర్గాలు చెబుతున్నాయి.

రైతుబంధు కింద గత ఖరీఫ్, రబీల్లో కలిపి ఎకరానికి రూ.8వేల చొప్పున రైతులకు ప్రభుత్వం అందజేసింది. 53 లక్షల మంది రైతులకు దాదాపు రూ.10వేల కోట్లు చెల్లించింది.

ఈ ఏడాది నుంచి ప్రతి ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించింది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, CHANDRABABU/FB

‘ఏపీలో మాంద్యం వైఎస్సార్సీపీ నేతల సృష్టే’

దేశం మొత్తం మీద మాంద్యం ఒక ఎత్తయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాంద్యం మరో ఎత్తని.. వైఎస్సార్సీపీ నేతలే దీన్ని సృష్టించారని టీడీపీ విమర్శలు చేసినట్లు ఈనాడు దినపత్రిక ఓ వార్త రాసింది.

రోజురోజుకూ వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, ప్రజల దాహార్తి తీర్చే చలివేంద్రం పెట్టినవారిపై అక్కసు తీర్చుకుంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

''సీఎం రివర్స్‌ టెండరింగ్‌ ఆలోచనల పుణ్యమా అని శ్రీశైలం నుంచి జూరాలకు కృష్ణా నీటిని తీసుకెళ్తామని కేసీఆర్‌ మాట్లాడుతున్నారు’’ అని చెప్పారు.

20 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకెళ్తానంటుంటే సీఎం ఏం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

నల్లమల

ఫొటో సోర్స్, PRAKASAM.NIC.IN/

యురేనియం తవ్వకాలకు సన్నాహాలు

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సన్నాహాలు మొదలవుతున్నాయని.. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం ప్రాంతంలో సర్వే, ఖనిజాన్వేషణ కోసం అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) తెలంగాణ అటవీశాఖకు ప్రతిపాదనలు పంపిందని ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యత తెలుసుకునేందుకు దాదాపు 21,000 ఎకరాల అటవీ ప్రాంతంలో సర్వేకు అనుమతివ్వాలని ఏఎండీ ప్రభుత్వాన్ని కోరింది. రెండు అటవీ ప్రాంతాల్లో 4,000 వరకు బోర్లు వేస్తామని పేర్కొంది.

నమూనాల సేకరణకు బోర్ల రూపంలో జరిపే తవ్వకాల కోసం భారీ యంత్రాలు, వాహనాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది.

ఏఎండీ భూగర్భం నుంచి యురేనియం నిక్షేపాల నమూనాల సేకరణ కోసం దాదాపు 75 సెం.మీ. చుట్టుకొలత ఉండే భారీ బోర్లు వేయనున్నట్లు సమాచారం.

ఏఎండీ నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని తెలంగాణ అటవీశాఖ శుక్రవారం అచ్చంపేట, నాగార్జునసాగర్‌ డివిజన్ల అధికారులకు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

యురేనియం సర్వే ద్వారా పడే ప్రభావాన్ని అంచనా వేయాలని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. ఏఎండీ బోర్లు వేయాలనుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు రహదారి ఉందా? లేదంటే వాహనాలు వెళ్లేలా రోడ్లు వేయడానికి ఎన్ని చెట్లను తొలగించాల్సి ఉంటుంది? వన్యప్రాణులపై ప్రభావం పడుతుందా?.. తదితర వివరాల్ని డివిజన్‌ అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)