వీడియో: నా బిడ్డ కళ్లు తెరవట్లేదు. మాట్లాడట్లేదు.
''ఎన్నాళ్లు భయపడతాం? చంపేస్తే చంపేయండి. ఇంతమందిని చంపారు, మమ్మల్నీ చంపుతారు. అయినా ఏమవుతుంది?''
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి నోటి వెంట వచ్చిన ఈ మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది.
ఆమెను లఖ్‌నవూలోని ఆస్పత్రిలో బీబీసీ కలిసింది. ఆ ఆస్పత్రిలోని ఐసీయూలోనే వెంటిలేటర్ మీద ఆమె కుమార్తెకు వైద్యులు చికిత్స అందుస్తున్నారు.
బాధితురాలి పరిస్థితి ఇప్పుడెలా ఉందని మేము అడిగినప్పుడు.. రెండ్రోజుల తాను తన బిడ్డను చూడలేదని, తమను దూరంగా ఉండాలని ఆస్పత్రిలో అంటున్నారని ఆమె చెప్పారు.
"నా బిడ్డ కళ్లు తెరవట్లేదు. మాట్లాడట్లేదు. ఇప్పుడు బాగుందో, లేదో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పోరాటమంతా ఎందుకు అని మీకెప్పుడైనా అనిపించిందా? అని అడిగినప్పుడు... "కుల్దీప్ (నిందితుడు) జైళ్లో కూర్చొనే ఇదంతా నడిపిస్తున్నాడు. మేము పోరాడకుండా ఉండిపోయినా వాళ్లు మమ్మల్ని వదలిపెట్టరు. మా పోరాటం ఇప్పుడు కీలకదశలో ఉంది. మా కుటుంబంలో చాలా మంది సభ్యులను ఆయన చంపించాడు. మాకు న్యాయం జరుగుతుందన్న ఆశే లేదు. మా ఇంట్లో ఇక మిగిలింది పిల్లలే. మమ్మల్ని పోషించేవాళ్లు ఎవరూ లేకుండా పోయారు. మేమెక్కడికి పోవాలి?" అని ఆమె దీనంగా ప్రశ్నించారు.
మీ అమ్మాయి ముఖ్యమంత్రి ఇంటి ముందు నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది కదా... అని అన్నప్పుడు..
"మా కుటుంబంలో అందరూ అలాగే అనుకున్నారు. మనకు న్యాయం జరగనప్పుడు మనందరం చచ్చిపోదామని నా కూతురు చెప్పింది. మమ్మల్ని పోషించేవాళ్లెవరూ ఇంట్లో మిగలనపుడు చావు తప్ప మరే దారి ఉంటుంది?" అని ఆమె అన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన మీ బిడ్డను ఆపేందుకు మీరు ప్రయత్నించారా? అని అడగ్గా.... "లేదు, ఆపలేదు. నువ్వు చనిపోవాలనుకుంటే, నీతో కలిసి మేమంతా చనిపోతామని చెప్పాం" అని ఆ తల్లి చెప్పారు.

ఈ కేసులో నిందితుడు కుల్‌దీప్ సెంగర్‌ను అరెస్టు చేశాక, మీకు ఊరట కలిగినట్టయ్యిందా? అని అడిగితే...
"ఏం ఊరట ఉంటుంది? అతను జైళ్లో ఉన్నా కూడా అతని వద్ద మొబైల్ ఫోన్ ఉంది. జైళ్లోంచే అతడు బయటివారితో మాట్లాడుతున్నాడు. నా భర్త చనిపోయారు. ఏదో ఒకరోజు కుల్‌దీప్ బయటకు వచ్చి తన భార్యాపిల్లలను, కుటుంబ సభ్యులను కలుసుకుంటాడు. కానీ, మా కుటుంబ సభ్యులు మాత్రం శాశ్వతంగా దూరమైపోయారు. వాళ్లిక మాకోసం తిరిగి రాలేరు. చనిపోయారు. ఇక వాళ్లను ఎన్నటికీ చూడలేం."
"నిరంతరం మమ్మల్ని భయం వెంటాడుతుంది. కానీ ఎలాగోలా బతకాలి కదా. వాళ్లు మమ్మల్ని చంపాలనుకుంటే చంపెయ్యనీ అన్నట్టుగా మా ఆలోచనలు తయారయ్యాయి. రోజూ చస్తూ బతకలేకపోతున్నాం. మాకింకా జరిగేదేముంది? ఇప్పటికే మాలో చాలా మందిని చంపేశారు. మమ్మల్ని కూడా చంపేస్తారు. అంతే కదా." అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కెఫే కాఫీ డే సిద్ధార్థ: సీసీడీ అంటే కాఫీ మాత్రమే కాదు...
- ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- ''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)