జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత రాంమాధవ్‌ల భేటీ... ఏం జరగబోతోంది? -ప్రెస్ రివ్యూ

పవన్, రాంమాధవ్

ఫొటో సోర్స్, facebook/janasenaparty/Rammadhav

ప్రచురణ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ మధ్య అమెరికాలో కీలక చర్చలు జరిగాయని 'ఈనాడు' పత్రిక కథనం వెల్లడించింది.

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జరుగుతున్న తానా మహాసభలకు హాజరైన పవన్‌, రామ్‌మాధవ్‌ తాజా రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోందని ఈ కథనంలో రాశారు.

రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలతో పాటు రాష్ట్ర విభజన హామీల అమలు, విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేయాల్సిన సాయం వంటి అంశాలపై ఈ ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసిందని ఈ వార్తలో పేర్కొన్నారు.

శనివారం నాడు జరిగిన తానా సభల్లో ప్రసంగించిన పవన్ కల్యాణ్, కొంతమంది రాజకీయ నాయకులు కులాలను, మనుషులను విడదీయాలని చూస్తారని, తాను రాజకీయాల్లోకి వచ్చింది మనుషులను కలపడానికేనని అన్నారు.

డబ్బు ఖర్చు చేయకపోతే తాను కూడా ఓడిపోతానని తెలుసునని, అయినా నమ్మిన సిద్ధాంతాల కోసం ఎన్ని బాధలైనా పడాలని నిర్ణయించుకున్నానని, ఓటమిని తట్టుకుని ఎలా నిలబడాలనే విషయాన్ని నెల్సన్ మండేలా రాసిన 'లాంగ్ వాక్ టు ఫ్రీడం' పుస్తకం చదివి నేర్చుకున్నానని పవన్ చెప్పినట్లు ఈ వార్తలో వివరించారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, facebook/Amitsha

కేసీఆర్ సర్కారుపై కేసులు పెట్టండి: అమిత్ షా

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై సీరియస్‌గా పోరాటం చేయాలని పార్టీ నాయకులకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్దేశించారంటూ 'ఆంధ్రజ్యోతి' తన కథనంలో పేర్కొంది.

''కేంద్రంలో అవినీతి లేదని ప్రజలు గుర్తించారని, ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో శనివారం రాత్రి పలువురు పార్టీ ముఖ్య నేతలతో జరిగిన విందు సమావేశానికి అమిత్‌ షా హాజరయ్యారు. సుమారు గంటన్నరపాటు కొనసాగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌పై పార్టీ నాయకత్వ వైఖరిని అమిత్‌ షా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట రాష్ట్రాన్ని దోచుకుంటోందని, భారీగా అవినీతికి పాల్పడుతోందని కొంతమంది ముఖ్య నేతలు అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, ''మీరు మొదట న్యాయపరంగా, క్షేత్రస్థాయిలో పోరాటం చేయండి. అప్పటికీ కాకపోతే కేంద్రం దృష్టికి తీసుకు రండి. అవినీతి, అక్రమార్కులపై మోదీ ప్రభుత్వం సీరియ్‌సగా ఉంది. పార్టీలకతీతంగా అక్రమార్కులపై చర్యలు తీసుకుంటోంది'' అని స్పష్టం చేశారని ఆ కథనంలో తెలిపారు.

పోలవరం

పోలవరం అక్రమాలపై నివేదిక తుది దశకు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన టెండర్లు, పనులలతో అవకతవకలపై నిపుణుల కమిటీ నివేదిక తుది దశకు చేరిందని 'సాక్షి' కథనం వెల్లడించింది.

''ఈ ప్రాజెక్టులో సాగిన అక్రమాలు, అవకతవకలు, అవినీతిపై పక్షం రోజుల్లోగా తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ తొలి నుంచీ వేగంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా 2013లో పోలవరం హెడ్‌ వర్క్స్‌ టెండర్ల నుంచి ఎన్నికల ముందు వరకు వివిధ దశల టెండర్లకు సంబంధించిన రికార్డులను కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. అంతేకాక.. రికార్డుల ఆధారంగా సంబంధిత అధికారుల నుంచి వివరణలూ తీసుకుంది. వీటి ఆధారంగా 'పోలవరం'లో అక్రమాలపై ప్రాథమిక నివేదికను సోమవారం రూపొందించనుంది. ఆ తర్వాత మరోసారి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాక మంగళవారం ఆ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేయనుంది. ముఖ్యమంత్రికి సమర్పించిన అనంతరం నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించనుంది. అలాగే, పోలవరం కుడి, ఎడమ కాలువలను కూడా కమిటీ పరిశీలించనుంద''ని ఆ కథనంలో వివరించారు.

వీఆర్వోపై దాడి చేసిన మహిళ

ఫొటో సోర్స్, UGC/ntnews.com

వీఆర్వోపై మహిళ కన్నెర్ర

లంచం తీసుకుని కూడా పనిచేయని వీఆర్వోపై ఓ మహిళ తీవ్రస్థాయిలో ఆగ్రహించి, ఆయన బైకును ధ్వంసం చేసినట్లు 'నమస్తే తెలంగాణ' కథనం వెల్లడించింది.

''విరాసత్‌కోసం అర్జీ పెట్టుకొన్న ఓ మహిళా రైతు నాలుగేండ్లయినా పని కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఆర్వో తన వద్ద లంచం తీసుకొని పట్టా చేయలేదని కన్నెర్రచేశారు. వీఆర్వో బైక్ ధ్వం సంచేశారు. ములు గు జిల్లా చింతలపల్లికి చెందిన కాసిరాల రమ తండ్రి మెరుపూరి బక్కులు 998/బీ సర్వే నంబర్‌లో 1998లో కుక్కల సమ్ములు వద్ద తాను కొన్న ఎకరం భూమిని కూతురుకు పసుపుకుంకుమ కింద రాసిచ్చారు. ఆ భూమిని తనకు పట్టా చేయాలని కోరుతూ అధికారులకు రమ అర్జీ పెట్టుకొన్నారు. సరైన పత్రాలు లేవంటూ తిప్పించుకొన్నారు. ఆ భూమిని తన తండ్రికి అమ్మిన వ్యక్తి చేత కాగితం రాయించుకొని సమర్పించినా, రేపు మాపు అంటూ తిప్పించుకొన్నారు. కొన్నాళ్లకు ఈ ఎకరం భూమిని వేములపల్లి చంద్రమ్మ పేరిట మార్చేశారు. దీంతో వీఆర్వో తిరుపతిని కలిసిన రమ.. తన దగ్గరున్న దస్తావేజులన్నీ చూపించి న్యాయం కోసం వేడుకొన్నా రు. వీఆర్వో, చంద్రమ్మ, రమను గ్రామపంచాయతీ వద్దకు పలిపించి విచారణచేశారు. తర్వాత రమకు పట్టా చేయిస్తానని రూ.20 వేలు తీసుకొన్నారు. అయినా పని చేయకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యా దు చేయగా కలెక్టర్ వీఆర్వోపై విచారణకు ఆదేశించారు. శనివారం ములుగు తాసిల్‌కు వచ్చిన రమ తాసిల్దార్‌ను సమస్యపై ప్రశ్నించగా సరైన సమాధా నం చెప్పలేదు. వీఆర్వో తిరుపతి కూడా మాట జారాడని.. దీంతో ఆగ్రహానికి గురై కార్యాలయంలో ఆందోళన చేశానని బాధితురాలు రమ తెలిపార''ని ఆ కథనంలో వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)