You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రబాబు ఆవేదన: ''నేనేం తప్పు చేశానని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా!'' - ప్రెస్ రివ్యూ
''ప్రాంతాల వారీగా, రంగాల వారీగా నేను చేసిన అభివృద్ధి కళ్లకు కనిపిస్తోంది.. కానీ ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మరీ 23 సీట్లకు పరిమితమయ్యేలా నేనేం తప్పు చేశానని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా'' అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. ఓటమిని జీర్ణించుకోలేక కన్నీటిపర్యంతమైన కార్యకర్తలను చంద్రబాబు ఓదార్చారు.
ఆయా సమావేశాల్లో మాట్లాడుతూ ''రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డా. ఒకటికి పదిసార్లు ఆయా కంపెనీల చుట్టూ తిరిగా. దక్షిణ కొరియా వెళ్లి కియా పరిశ్రమను అనంతపురానికి తెచ్చా. అయినా.. ఆ సీటును కూడా గెలవలేకపోయాం. ఏం తప్పు చేశామో అర్థం కావడంలా'' అని వ్యాఖ్యానించారు.
''సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా.. ప్రజలే ఓట్లు వేస్తారని కొద్ది మంది నేతలు ఇంట్లో నిద్రపోయారు. నేను ముఖ్యమంత్రిగా జాగ్రత్తపడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కమ్మ ఓట్ల శాతం లేకపోయినా కుప్పం నన్ను గెలిపించింది. మన పార్టీపై కొందరు కుల పార్టీ ముద్ర వేసి అసత్య ప్రచారం చేశారు'' అని చెప్పారు.
''బంధువులు ఎవరైనా చనిపోతే.. కొద్దిరోజులు బాధపడి.. కాలక్రమంలో మరచిపోతాం. టీడీపీ ఓటమిని కూడా అలాగే మరచిపొండి. ఎన్నికల్లో ఓడిపోయినందుకు అధైర్యపడడం నాయకత్వ లక్షణం కాదు. కష్టాల్లో ఉన్న నిజమైన కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలి. నా ఊపిరి ఆగిపోయేంతవరకు ప్రజల కోసమే పనిచేస్తా'' అన్నారు.
''గెలుపోటములు టీడీపీకి కొత్తేమీ కాదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు మరింత సమయం దొరికింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా'' అని చంద్రబాబు తెలిపారు.
''వైసీపీ ఇచ్చిన హామీలన్నీ అలవికానివే. వాటిని ఎవరూ తీర్చలేరు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సీపీఎస్ రద్దు వంటివి జరిగే అవకాశమే లేదు. ఇంత అనుభవం ఉండీ నేనెందుకు చేయ లేకపోయానో ఆలోచించండి. అనుభవం లేని నాయకుడి పాలన సాగుతోంది'' అని ప్రభుత్వాన్ని విమర్శించారు.
''ఇప్పటికే ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. విత్తనాల కొరత, ఎరువుల కొరత, విద్యుత్ కోతలు చుట్టుముడుతున్నా యి. వీటిని తీర్చలేకపోతున్న ప్రభుత్వంపై అప్పుడే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో మరింత వ్యతిరేకత తప్పదు. ఎన్నికల ముందు నోటికేది వస్తే అది చెప్పేశారు. అవి తీర్చలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ విజయం టీడీపీదే. ఇది తథ్యం'' అంటూ ధీమా వ్యక్తంచేశారు.
శాసనసభలో ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుంది: జగన్
శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే గత ప్రభుత్వం మైక్‌లు కట్ చేసేదని.. ఆ ప్రభుత్వంలో ఉన్న విధంగా ఈ అసెంబ్లీ నిర్వహణ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నట్లు ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. శాసనసభలో ప్రతిపక్షం అనేది ఉంటేనే బాగుంటుందని జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో అయిదుగురిని లాగేస్తే ప్రతిపక్షం ఉండదని తనకు చాలామంది చెప్పారన్నారు.
కానీ తాను అలా చేయనని చెప్పానని, పార్టీ మారితే రాజీనామా అయినా చేయాలి, లేకుంటే అనర్హత వేటు అయినా వేయాలని అన్నారు. ఇక్కడ గతంలో ఎక్కడా అనర్హత వేటు వేయలేదని, రాజీనామాలు చేయించలేదని, వీటిని భిన్నంగా ఉండాలంటే మనం మార్గదర్శకంగా ఉండాలన‍్నారు.
‘‘మనకు వాళ్లకు తేడా ఉండాలి కదా’’ అన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షం అనేది ఉండాలన్నారు. ‘‘మనం ఎవరైనా ఎమ్మెల్యేలను తీసుకోవాలంటే రాజీనామా చేయించాలి.. ప్రజల్లోకి వెళ్లి మనం గెలిపించుకున్న తరువాత మన ఎమ్మెల్యే అవుతారు’’ అని జగన్ పేర్కొన్నారు.
ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇస్తామని, వారు చెప్పేది కూడా పూర్తి వింటామని తెలిపారు. ఆ తర్వాత ప‍్రభుత్వం చెప్పే సమాధానంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు.
శాసనసభలో అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామని తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభలో అవకాశాలు దక్కాలంటే చేయి పైకి ఎత్తితే చాలు అని అనుకోకూడదని, నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే ఆ అవకాశం దక్కుతుందని అన్నారు.
రెండువైపులా గోదారి... శ్రీశైలం, సాగర్‌కు చెరో టీఎంసీ చొప్పున తరలింపు
కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపుపై తెలంగాణ ఇంజినీర్ల మథనం కొనసాగుతున్నదని.. మొదటిరోజు శ్రీశైలానికి గోదావరిజలాల తరలింపుపై దృష్టిసారించిన ఇంజినీర్లు.. నాగర్జునసాగర్‌కు తరలించేందుకున్న అవకాశాలపై రెండో రోజు కసరత్తుచేశారని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ప్రాథమికంగా అలైన్‌మెంట్‌ను నిర్ధారించుకున్న కమిటీ.. అంచనావ్యయాన్ని రూపొందించేందుకు రెండ్రోజుల సమయం తీసుకుని, ఆరో తేదీన మళ్లీ సమావేశంకావాలని నిర్ణయించింది.
పోలవరం నుంచి నాగార్జునసాగర్‌కు, తద్వారా శ్రీశైలం జలాశయానికి గోదావరిజలాల తరలింపుపై ఇప్పటికే ఏపీ ఇంజినీర్ల ప్రతిపాదన ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. పోలవరం నుంచి ప్రకాశం బరాజ్‌కు, అక్కడి నుంచి వైకుంఠాపురం బరాజ్‌కు తరలించి, పులిచింతలలో మరో చిన్న లిఫ్టుద్వారా నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌లోకి జలాలను ఎత్తిపోయాలనే అలైన్‌మెంట్ ఇప్పటికే రూపొందించారు.
సాగర్‌లోకి గోదావరిజలాలు వచ్చిన తర్వాత అవసరమైనపుడు శ్రీశైలం టెయిల్‌పాండ్ ద్వారా గోదావరిజలాల్ని శ్రీశైలంలోకి తరలించుకునే ప్రతిపాదన మెరుగ్గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఇంజనీర్లు కూడా కసరత్తును ముమ్మరంచేశారు. అయితే.. శ్రీశైలానికి గోదావరిజలాల్ని తరలించే క్రమంలో నాగార్జునసాగర్‌కు కూడా మళ్లించే అలైన్‌మెంట్‌ను తాజాగా జోడించారు.
ములుగు జిల్లా పరిధిలోని ఒక పాయింట్ వద్ద గోదావరిజలాల్ని మళ్లించాలని ఇప్పటికే ఇంజినీర్లు నిర్థారించారు. అక్కడినుంచి లక్నవరం, ఆపై డీబీఎం-38 ద్వారా కాకతీయ కాల్వలోకి జలాల్ని తరలిస్తారు. ప్రస్తుతం కాకతీయ కాల్వ 8500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఉన్నది. దీనిని రెండు టీఎంసీల తరలింపునకు అనుగుణంగా వెడల్పు చేయాల్సి ఉంటుందని కమిటీలో చర్చించారు.
కాకతీయ కాల్వ నుంచి జలాలు మూసీలోకి, ఆపై నల్లగొండ సమీపంలోని ఉదయసముద్రంలోకి చేరతాయి. ఇక్కడ గోదావరిజలాలు ఒక మార్గంలో నాగార్జునసాగర్‌కు చేరుతాయి. ఉదయసముద్రం అలుగుపోయడంతో అడవిదేవులపల్లి చెరువుద్వారా జలాలు నాగార్జునసాగర్‌లోకి వెళుతాయి. ఇలా ఒక్క టీఎంసీ నీటిని తరలించాలని ఇంజనీర్లు భావిస్తున్నారు.
ఉదయసముద్రం దగ్గరే మరోమార్గం ద్వారా శ్రీశైలంకు తరలించే అలైన్‌మెంట్‌పైనా కమిటీ చర్చించింది. నల్లగొండ సమీపంలోని చర్లపల్లి వద్ద జలాల్ని మళ్లించి.. కనగల్, డిండి మీదుగా ఎల్లూరు దగ్గర శ్రీశైలం జలాశయంలో పోయాలని భావిస్తున్నారు.
అయితే ఇందుకు దాదాపు 90 కిలోమీటర్ల మేర సొరంగమార్గాన్ని నిర్మించాల్సివస్తుందని ఇంజనీర్లు గుర్తించారు. ఈ అలైన్‌మెంట్‌కు అనుగుణంగా ప్రాజెక్టును చేపడితే దాదాపు రూ. 70-80 వేల కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై రెండ్రోజులు కసరత్తుచేసి లైన్ ఎస్టిమేట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
తెలుగులోనూ సుప్రీంకోర్టు తీర్పులు
సుప్రీంకోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనూ చదువుకోవచ్చునని ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. అత్యున్నత న్యాయస్థానం తీర్పు కాపీలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన సూచన ఈ నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది.
ప్రాంతీయ భాషల్లోనూ తీర్పులు అనువాదం చేయడానికి వీలుగా సాఫ్ట్‌వేర్‌ను సుప్రీంకోర్టు అభివృద్ధి చేస్తోందని ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి కూడా తెలిపారు.
ఆంగ్లంలో తీర్పులు అదే రోజున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రాంతీయ భాషల్లో అనువదించినవి వెబ్‌సైట్‌లో ఉంచడానికి వారం రోజులు పట్టనుంది. తెలుగుతోపాటు అస్సామీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా భాషల్లోకి తీర్పులు అనువదిస్తారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)