ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గుల్లచేస్తున్నారా? - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, TDP
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని గుల్లచేసే పాత్రని బీజేపీ పోషించబోతోందని, రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ బలహీనపడటంతో అక్కడ ప్రతిపక్ష పీఠం సొంతం చేసుకోవాలని కమలనాథులు కలలు కంటున్నారని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం, టీడీపీ శాసనసభా పక్షాన్ని మూడింట రెండు వంతులు చీల్చి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనీ, పార్టీ మారిన ఎమ్మెల్యేలకి కాషాయ కండువాలు కప్పి శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టాలనీ బీజేపీ పెద్దల ఆలోచన.
ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలుపొందారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న టీడీపీకి ప్రస్తుతం ఆ హోదా లేకుండా చేయాలని తెరవెనుక గట్టి ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం మాజీ నేతలపై బీజేపీ దృష్టిసారించింది. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు.
రాజ్యసభలో ఉన్న నలుగురు టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్ బీజేపీకి జైకొట్టారు. తాజాగా రాష్ట్రంలో టీడీపీ నేతలతో కొంతమంది బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు.
ఇటీవల హైదరాబాద్‌లో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన టీడీపీ నేత తోట త్రిమూర్తులు, తెలుగుదేశం మాజీమంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలుసుకున్నారు. కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశం సారాంశాన్ని గంటాకు ఆయన వివరించారు.
దీనిపై.. గంటా శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిలను కలుసుకున్నారంటూ బీజేపీ నాయకులు ఊహాగానాలకు తెరతీశారు.
ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల కదలికలపై బీజేపీ పూర్తిగా కన్నేసింది. కమలదళానికి చెందిన సీనియర్ నేతలతో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు.
ఇదే సమయంలో మాజీలపై కూడా బీజేపీ కన్నేసింది. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ బాగా దెబ్బతిన్నది. పార్టీలో అనేకమంది మాజీలయ్యారు. వీరిలో ఎక్కువమందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రత్యేకంగా కొంతమందికి బాధ్యతలు అప్పగించింది.
ఈ కార్యక్రమాన్ని నేరుగా ఢిల్లీనుంచే పర్యవేక్షిస్తున్నారు. బీజేపీకి చెందిన వ్యూహకర్తలు దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలోనే బీజేపీలోకి భారీ చేరికలుంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఏపీలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫొటో సోర్స్, BJP Telangana
తెలంగాణ: కాంగ్రెస్ ముఖ్య నేతలకు బీజేపీ గాలం... రోజుకో నేత పేరు తెరపైకి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో నైరాశ్యం అలముకుందని, పార్టీ మారుతున్నారంటూ రోజుకో నేత పేరు తెరపైకి వస్తుండటం, ఆ వార్తలను కొందరు ఖండిస్తున్నా మరికొందరు మౌనంగా ఉండటంతో పార్టీలో ఎవరుంటారో, ఎవరు వీడతారో అర్థంకాక కార్యకర్తలు తలపట్టుకుంటున్నారని 'సాక్షి' దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం, ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు తోడు కొందరు నాయకులు రహస్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కలిశారన్న ప్రచారం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆయన సతీమణి పద్మినిల పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే శశిధర్‌రెడ్డితోపాటు రాజనర్సింహ తాము బీజేపీలో చేరడం లేదని, అలాంటి ప్రస్తావనే రాదని కొట్టిపారేశారు. కానీ సుదర్శన్‌రెడ్డి మాత్రం ఎక్కడా ఈ విషయంపై మాట్లాడలేదు. దీనికితోడు గత ఎన్నికలకు ముందే రాజనర్సింహ సతీమణి పద్మిని బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆమెపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.
అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మరో నేత, మెదక్ జిల్లా నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన ఓ అభ్యర్థి, టీపీసీసీలో కీలక పదవిలో ఉన్న మహిళా నాయకురాలు ఒకరు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది.
వీరంతా తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నా ఆ నాయకులు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తాము బీజేపీలోకి వెళుతున్నామని తమ కేడర్‌తో కూడా చర్చించకుండానే రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన కూడా కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తుండటంతో కమలదళంలోకి భారీగా చేరికల కార్యక్రమం కూడా ఉంటుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది.
బీజేపీ వర్గాలు మాత్రం చేరికలుంటాయని చెబుతున్నాయే కానీ ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీలోకి వెళతానని చెప్పిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ అసంతృప్త నేత వివేక్ తదితరులు కాషాయ కండువాలు కప్పుకోవచ్చని, వారికి మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా తోడవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ రాజగోపాల్‌రెడ్డి చేరిక సాంకేతికంగా ఇబ్బందికరమైందని బీజేపీ అధిష్టానమే చెబుతోందని, ఈ కారణంతో ఆయన చేరిక కొంత ఆలస్యం కావచ్చని సమాచారం.

ఫొటో సోర్స్, Andhra Pradesh CMO
ఆంధ్రప్రదేశ్: మిగిలిన 9 నెలలకు జీతాలు కాకుండా రూ. 2.50 లక్షల కోట్లు కావాలి... ఆర్థికశాఖలో విస్మయం
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖల నుండి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కోసం భారీగా డిమాండ్లు ఆర్థికశాఖకు అందాయని 'ప్రజాశక్తి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రెండు రోజుల పాటు బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ శాఖల మంత్రులతో భేటీ అయ్యారు. దీనిలో భాగంగా అందిన ప్రతిపాదనలపై ఆర్థికశాఖ అధికారుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం జీతభత్యాలు కాకుండా మిగిలిన 9 నెలల కాలానికి రెండు లక్షల కోట్ల రూపాయలను శాఖలు కోరాయి. కొంచెం అటు ఇటుగా 2.50 లక్షల కోట్ల రూపాయలకు ఈ ప్రతిపాదనలు చేరాయి.
ప్రధానంగా జగన్ ఇచ్చిన హామీలకు ఏడాదికి రూ. 75,305 కోట్లుగా ఉంటుందని గతంలోనే ఆర్ధికశాఖ అంచనా వేయగా.. ఈ ఆర్ధిక సంవత్సరంలోని చివరి తొమ్మిది నెలలకు రూ. 49,943 కావాల్సి ఉంటుందని గుర్తించారు.
అయితే తాజాగా వివిధ శాఖల నుంచి వచ్చిన హామీల ప్రతిపాదనలు ఆర్ధిక శాఖ గుర్తించిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. దాదాపుగా 15 వేల కోట్ల రూపాయల వరకు అదనంగా శాఖలు కోరినట్లు తెలిసింది.
దీంతో మొత్తం ప్రతిపాదనలు రెండున్నర లక్షల కోట్ల వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆర్ధికశాఖ మాత్రం దీనిని 2.15 లక్షల కోట్ల వరకు కుదించాలని యోచిస్తోంది. ఇదే అంశాన్ని వివిధ శాఖల మంత్రులకు కూడా రెండు రోజులుగా ఆర్ధిక మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది.
ముసాయిదా ప్రతిపాదనలపై జగన్ అభిప్రాయాలను స్వీకరించి, తుది బడ్జెట్ ప్రతిపాదనను పదో తేదీ నాటికి సిద్ధం చేయాలని ఆర్థికశాఖ భావిస్తోంది.

ఫొటో సోర్స్, Sciepro/Science Photo Library
టెలీపతి: మౌనంగానే మనసులతో మాట్లాడుకునే 'బ్రెయిన్‌నెట్' - సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు
బయటకు ఏమీ చెప్పకుండానే మన మనసులోని అభిప్రాయాలను ఇతరుల మెదళ్లలోకి నేరుగా పంపగలిగే 'టెలీపతి' కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారని 'ఈనాడు' దినపత్రిక ఒక కథనంలో వెల్లడించింది.
ఆ కథనం ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ఏం మాట్లాడుకోకుండా.. కేవలం మనసుల ద్వారా సమాచారాన్ని పరస్పరం చేరువేసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించే 'బ్రెయిన్‌నెట్' వ్యవస్థను తాజాగా సృష్టించారు.
దానిద్వారా 'టెట్రిస్' వంటి ఓ ఆటను ముగ్గురు వ్యక్తులతో విజయవంతంగా ఆడించారు.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత సంతతి పరిశోధకుడు రాజేశ్ రావ్ ఈ ఆవిష్కరణలో పాలుపంచుకున్నారు.
తాజా పరిశోధనలో భాగంగా ముగ్గురు వ్యక్తులను (ఇద్దరు సెండర్లు, ఒక రిసీవర్) శాస్త్రవేత్తలు మూడు వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టారు. 'బ్రెయిన్‌నెట్' వ్యవస్థతో వారిని అనుసంధానించారు.
టెట్రిస్ వంటి ఆటలో బ్లాక్ కిందకు వెళ్లేటప్పుడు అది వెళ్లే వరుస సరైనదేనా లేదా అనే సంగతిని సెండర్లు పరిశీలిస్తారు.
బ్లాక్‌ను నియంత్రించగల సామర్థ్యమున్న రిసీవర్ మనసుకు బ్రెయిన్‌నెట్ వ్యవస్థ ద్వారా సంబంధిత సమాచారాన్ని నేరుగా చేరవేస్తారు. వారి సమాచారం ప్రకారం బ్లాక్‌ను తిప్పడం లేదా యథాతథంగా కిందకు దించడం వంటి ప్రక్రియలను రిసీవర్ పూర్తిచేస్తారు.
ఇవి కూడా చదవండి:
- వీనస్ విలియమ్స్‌ను ఓడించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి ఎవరు...
- "సినీ రంగం నాకు మనశ్శాంతి లేకుండా చేసింది"
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడలేదు.. కానీ, వరల్డ్‌కప్ జట్టులో చోటు.. ఎవరీ మయాంక్ అగర్వాల్
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- ఆ పొలం నిండా కుళ్లిపోతున్న మృతదేహాలు.. వాటి మీద శాస్త్రవేత్తల పరిశోధనలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






















