You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేసీఆర్, జగన్: ‘మాకు భేషజాలు.. ఇగోలు లేవు.. వివాదాలకు ఇక చరమగీతం’ - ప్రెస్ రివ్యూ
అందుబాటులో ఉన్న నీటివనరులను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టంచేశారని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటికొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నామని ఇరువురు నాయకులూ చెప్పారు. నదీజలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రీతిలో మర్చిపోయి, మంచి మనసుతో రెండు రాష్ట్రాలకు ఎంత వీలయితే అంత మేలుచేసే విషయంలో రెండు ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రకటించారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించునే దిశగా అడుగువేయాలన్న నిర్ణయంమేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతిభవన్‌లో జరిగింది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది.
ఈ సమావేశంలో కేసీఆర్, జగన్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ర్టాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం రెండు ప్రభుత్వాలు పనిచేస్తాయని ప్రతినబూనారు.
కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ఎదుర్కొంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసంచేస్తూ ఏపీ సీఎం జగన్‌కు, ఏపీ అధికారుల బృందానికి స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యమని చెప్పారు.
గోదావరి, కృష్ణానదుల్లో కలిపి నాలుగువేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని, ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చునని కేసీఆర్ అన్నారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున గోదావరి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలని ప్రతిపాదించారు.
ఈ మేరకు వ్యూహం ఖరారుచేయాలని అధికారులను ఉభయ సీఎంలు ఆదేశించారు. జూలై 15లోగా ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు, నీటిపారుదల నిపుణులు ఒక కమిటీగా ఏర్పడి, అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని సూచించారు.
ప్లాన్ లేకుండా అసెంబ్లీ నిర్మాణానికి శంఖుస్థాపన ఎలా చేశారు? - హైకోర్టు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి ఎటువంటి ప్రణాళిక (ప్లాన్) లేకుండానే శంకుస్థాపన చేయడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ విస్మయం వ్యక్తం చేసిందని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ప్లాన్ సిద్ధం చేయకుండా ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌ను కూల్చివేసి దాని స్థానంలో నూతన అసెంబ్లీని ఎందుకు నిర్మించ తలపెట్టారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న అసెంబ్లీ భవనాన్ని ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నారు? అవసరాలకు సరిపోవడంలేదా? రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా తగ్గింది.. అయినా సరిపోదా? ఏడు ఎకరాల్లో ఉన్న భవనాన్ని కాదని 17 ఎకరాల్లో నూతన భవనం ఎందుకు తలపెట్టారు? తదితర వివరాలు కౌంటర్‌లో పొందుపర్చాలని స్పష్టం చేసింది.
కౌంటర్‌లో వివరాలు వాస్తవికంగా ఉండాలని, అసంబద్ధమైనవి చెప్పవద్దని అదనపు ఏజీకి సూచించింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ఎర్రమంజిల్‌ను కూల్చివేసి ఆ స్థానంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి జె.శంకర్, డాక్టర్ లుబ్న సర్వత్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ శంకర్ తరఫున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదిస్తూ.. ఎర్రమంజిల్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. విశిష్టమైన నిర్మాణ శైలి ఉన్న ఈ భవనాన్ని కూల్చివేస్తే మళ్లీ ఇటువంటి భవనం నిర్మిచడం సాధ్యం కాదన్నారు. పునర్నిర్మాణం చేయలేని ప్రభుత్వానికి దాన్ని కూల్చివేసే అర్హత లేదని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే శాసనసభ, మండలి సమావేశాలకు సరిపోయిన భవనం, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇరుకుగా మారే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎర్రమంజిల్ ప్యాలెస్ వినియోగంలో ఉందని, ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం ఇందులో విధులు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ భవనాన్ని ఒకసారి సందర్శించాలని, సాధ్యం కాకపోతే నిపుణుల కమిటీ వేసి నివేదిక ఇవ్వమని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవని అన్నారు. ఎర్రమంజిల్‌ను కూల్చివేయడానికి చట్టపరమైన అడ్డంకులు లేవని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం 7 ఎకరాల్లో ఉందని, దాన్ని 17 ఎకరాల్లో విశాలంగా నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందని చెప్పారు. తన వాదనలకు బలం చేకూర్చేలా సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించారు.
ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం... న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉందని స్పష్టం చేసింది. గ్రేటర్ నోయిడాలోని పురాతన జైలును కూల్చివేసి దాని స్థానంలో మరో నిర్మాణం చేపట్టాలని అప్పటి మాయావతి ప్రభుత్వం తలపెట్టినపుడు ప్రజాధనాన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేసింది.
భవనాల ప్లాన్‌ను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని ధర్మాసనం కోరింది. ఏఏజీ బదులిస్తూ సోమవారం ఇస్తామని, గడువు ఇవ్వాలని కోరారు. 'అంతవరకు ఎందుకు? సాయంత్రం 3 గంటల వరకు వాయిదా వేస్తాం. ఆలోగా మ్యాప్‌లు చూపాల'ని సూచించింది.
తిరిగి 3 గంటలకు విచారణ మొదలుపెట్టగా ఏఏజీ వివరణ ఇస్తూ కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారని, నూతన అసెంబ్లీ, మండలి భవనాలకు సంబంధించిన ప్లాన్లు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. దీంతో ఎటువంటి ప్లాన్ లేకుండా కూల్చివేయాలని ఎలా నిర్ణయిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
వేధింపులు నాకు కొత్త కాదు.. రాజధాని ప్రజలకు అండగా ఉంటా: చంద్రబాబు
వేధింపులు తనకు కొత్తకాదని, గతంలో 26 విచారణ సంఘాలు వేసినా ఒక్కదాన్నీ రుజువు చేయలేకపోయారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. వైకాపా ప్రభుత్వం తనపై కమిటీలు వేసి విచారణ చేస్తామనడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏదేమైనా రాజధాని ప్రజలకు అండగా ఉంటానని, సమస్యలపై పోరాడతానని స్పష్టం చేశారు. ఇంకో ఐదేళ్లు అమరావతి వేగంగా అభివృద్ధి చెందితే రాష్ట్రానికే ఒక సంపదగా మారి ఉండేదన్నారు.
చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు రాజధాని గ్రామాలకు చెందిన ప్రజలు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివచ్చారు. చంద్రబాబు వారితో మాట్లాడుతూ ''మీ ఆవేదన, బాధ అర్థం చేసుకోగలను. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం. ఏటా 10 శాతం పెరిగేలా పదేళ్లపాటు కౌలు చెల్లిస్తున్నాం.
భూమిలేని రైతులకు ప్రతి నెలా పింఛన్లు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక కౌలు అందలేదని రైతులు, పింఛను ఇవ్వలేదని రైతు కూలీలు చెబుతుంటే ఎంతో ఆవేదన కలుగుతోంది. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడతా. వాటిని పరిష్కరించేదాకా వదిలిపెట్టను’’ అని చెప్పారు.
‘‘ఒక్క పైసా ప్రజాధనం ఖర్చుపెట్టకుండా ప్రజలే భూమి ఇచ్చి, ప్రభుత్వ మద్దతుతో రాజధాని నగరం అభివృద్ధి కావడం ప్రపంచానికే ఒక నమూనా. అందుకే హార్వర్డ్ విశ్వవిద్యాలయం దీన్ని అధ్యయనాంశంగా చేపట్టింది. రైతుల వద్దే భూమి ఉన్నా రాజధాని కోసం భూసమీకరణ మొదలుకాకున్నా రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని వైకాపా బురదజల్లింది. సింగపూర్ కంపెనీలు రాకుండా చేసింది’’ అని చంద్రబాబు విమర్శించారు.
రాజధాని అమరావతిలో ఎంత స్థలం కావాలన్నా తామిస్తామని రాజధాని రైతులు చంద్రబాబుతో పేర్కొన్నారు. ‘‘మీకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఎంత అవసరమైనా మేమే ఇస్తాం. ఏ గ్రామంలో స్థలం కావాలో మీరే కోరుకోండి. ఖర్చంతా మేమే భరిస్తాం. ఇక్కడి నుంచి మిమ్మల్ని వెళ్లనివ్వం. అవసరమైతే మేమే కవచంలా మారతాం.
రాజధాని కోసం 34 వేల ఎకరాలిచ్చాం. మీకు 3,400 గజాల స్థలం ఇవ్వలేమా? రాజధాని బ్రాండ్ ఇమేజీ మీరే. మీరే వెళ్లిపోతే.. అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది. మీరు రాజధానిలోనే ఉండి మా తరఫున పోరాడాలి'' అని పలువురు రైతులు చంద్రబాబుతో పేర్కొన్నారు.
జూలై 1 నుంచి సీఎం జగన్ ప్రజాదర్బార్... రోజూ ఒక గంట సామాన్య ప్రజలను కలుసుకోనున్న ముఖ్యమంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 1వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించబోతున్నారని.. ఇందుకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలను ప్రతి రోజూ ఒక గంట పాటు కలుసుకోవాలని నిర్ణయించారు.
ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జగన్ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఓ వైపున ఆయన కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటానికి ఒక షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు.
అక్కడ వేచి ఉండే వారికి మంచినీటి సదుపాయం, పెద్ద ఫ్యాన్లు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు, నివేదనలను ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- జీ-20 శిఖరాగ్ర సదస్సు: ఏమిటీ భేటీ? ఇక్కడ ప్రపంచ నాయకులు ఏం చర్చిస్తారు...
- ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్ కేసులున్న మంత్రులెందరు.. వారిలో అత్యంత సంపన్నులెవరు
- అయిదు హత్యలు, ఆరుగురు నిర్దోషులు, చేయని తప్పుకు చేజారిన 16 ఏళ్ళ జీవితం
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- గడ్డి వంతెన ఇది... దీన్ని ఎలా కడతారో చూడండి
- ఆరెంజ్ జెర్సీల్లో కనువిందు చేయనున్న 'మెన్ ఇన్ బ్లూ'
- దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)