‘పవన్ కల్యాణ్ 2024లో విజయం సాధించడం ఖాయం’ - ప్రెస్‌రివ్యూ

నాగబాబు, పవన్

ఫొటో సోర్స్, facebook/Nagababu

ఫొటో క్యాప్షన్, నాగబాబు, పవన్ కల్యాణ్
ప్రచురణ

ఏపీలో 2024 శాసనసభ ఎన్నికల్లో జనసేనదే విజయమని సినీనటుడు, ఆ పార్టీ నేత నాగబాబు అన్నారని పేర్కొంటూ 'ఈనాడు' కథనం ప్రచురించింది.

తన యూ ట్యూబ్‌ ఛానల్‌లో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగబాబు సమాధానాలిచ్చారని అందులో తెలిపారు.

''రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అవి ఓ నాణేనికి ఇరువైపులా ఉన్న బొమ్మాబొరుసులాంటివని చెప్పారు. గెలిచినంత మాత్రాన గొప్పవారేమీ కాదని.. ఓడిన వారు చేతకాని వారూ కాదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా గెలవడానికి తెదేపాపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, జగన్‌పై ఉన్న సానుభూతే కారణమని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఈ సారి జగన్‌కు ఒక ఛాన్స్‌ ఇద్దామనే వాదన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఒకవేళ జనసేన పార్టీకి ఓటు వేసినా, ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయలేదని, 2024 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా జనసేన విజయభేరి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు'' అని ఆ కథనంలో వెల్లడించారు.

కేసీఆర్, హరీశ్

ఫొటో సోర్స్, facebook/harishraothanneru

'కాళేశ్వరం క్రెడిట్ మొత్తం కేసీఆర్‌దే: హరీశ్ రావు'

కాళేశ్వరం నిర్మాణాన్ని మూడేండ్లలోనే పూర్తిచేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారని.. ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాలై నా పూర్తికాని ప్రాజెక్టులను కేవలం మూడేండ్లలోనే పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని స్పష్టంచేశారని 'నమస్తే తెలంగాణ' కథనం పేర్కొంది.

''తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాకపోతే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవా?, ఈ నీళ్లు మనకు కనిపించేవా? అని హరీశ్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ వద్ద రంగనాయకస్వామి గుట్టపై శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు కేక్ కట్‌చేసి తన సంతోషాన్ని పం చుకున్నారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో మొదటి పదమే నీళ్లని, సీఎం కేసీఆర్ రేయింబవళ్లు ఓ ఇంజినీర్‌లా కష్టపడి ఈ ప్రాజెక్టును పూర్తిచేశారని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్ల గొండ జిల్లాలను సస్యశ్యామలంచేసే ఈ గొప్ప ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. రైతుల కన్నీళ్లు తుడిచే ప్రాజెక్టుకు పనిచేసే అవకాశం తనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పా రు. కాళేశ్వరం విషయంలో సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి మహారాష్ట్రతో ఒప్పించడంతోపాటు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు'' అని ఆ కథనంలో రాశారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, facebook/narachandrababunaudu

'విలీనం కాదది.. ఫిరాయింపు'

రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారడం ఫిరాయింపు చర్యేనని, దానికి విలీనం అని ముసుగు వేసి నాటకం ఆడుతున్నారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''యూరప్‌లో ఉన్న చంద్రబాబు శుక్రవారం సాయంత్రం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, మద్దాలి గిరి, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. 'టీడీపీ ఎంపీలు కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరారు. దానికి విలీనం అని పేరు పెట్టి నాటకం ఆడుతున్నారు. ఈ విలీనం చెల్లదు. వారి చర్య కచ్చితంగా పార్టీ ఫిరాయింపే. చట్ట ప్రకారం అనర్హత వేటు వేయాల్సిందే. దీని కోసం మన ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌ను కలిసి లేఖ ఇచ్చారు. వారిపై వేటు పడేవరకూ పోరాడదాం' అని చంద్రబాబు ఈ సందర్బంగా అన్నార'ని ఆ కథనంలో రాశారు.

నరేంద్ర మోదీతో సుజనా చౌదరి, సీఎం రమేశ్

ఫొటో సోర్స్, facebook/cmramesh

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీతో సుజనా చౌదరి, సీఎం రమేశ్

'కేసుల భయంతోనే టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి..'

టీడీపీ అధినేతకు కుడి, ఎడమలుగా చెప్పుకునే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ముందస్తు ప్రణాళికలో భాగంగానే బీజేపీలో చేరినట్లు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చర్చించుకుంటున్నారని 'సాక్షి' తన కథనంలో పేర్కొంది.

''ఈడీ, ఆదాయపన్ను కేసులతోపాటు రాజధానిలో కొనుగోలు చేసిన రూ.వందల కోట్ల విలువైన భూములను కాపాడుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారంటున్నారు. బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల మేర రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ పూర్తి ఆధారాలను సేకరించడంతో అరెస్ట్‌ల భయంతోనే ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి సుజనా చౌదరి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు.

దొంగ కంపెనీల పేరు మీద తీసుకున్న రూ.364 కోట్ల రుణాలు ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపకుండానే హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్‌కు చేరినట్లు ఈడీ దర్యాప్తులో తేలడంతో వైస్రాయ్‌ హోటల్‌కు చెందిన రూ.315 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఇప్పుడు ఈ మొత్తం వైస్రాయ్‌ హోటల్‌ నుంచి చివరకు ఎక్కడకు చేరిందన్న అంశం వెల్లడి కావాల్సి ఉంది. ఈ కేసులో ఇక అరెస్ట్‌ తప్పకపోవడంతో పాటు కుంభకోణం వెనుక ఉన్న పెద్ద వ్యక్తులు బయటకు వస్తారన్న భయంతోనే బీజేపీ పెద్దలు అమిత్‌ షా, రాంమాధవ్‌లతో సంప్రదింపులు జరిపారని, దీనికి ప్రధాని మోదీ ఆమోదముద్ర వేయడంతో సుజనా చౌదరి బీజేపీలో చేరారంటున్నారు. సీఎం రమేష్‌ కూడా రిత్విక్‌ ఇన్‌ఫ్రా పేరిట దొంగ ఇన్వాయిస్‌లు సృష్టించి రూ.800 కోట్ల నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ కేసులో సీఎం రమేష్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అరెస్ట్‌ చేయడమే మిగిలింది.

రాజధానిగా అమరావతిని ప్రకటించడం వెనుక పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లు, కేటాయింపులపై సమీక్ష చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో బాబు బినామీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజధాని ప్రాంతం వివరాలను చంద్రబాబు ముందుగానే తన అనుయాయులకు లీక్‌ చేసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. రాజధాని ప్రకటన వెలువడక ముందే సుజనా చౌదరి 700 ఎకరాలు, సీఎం రమేష్‌ 500 ఎకరాల వరకు బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చెబుతున్నారు. టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు కూడా రాజధానికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వీరి వ్యాపారాలు కూడా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాయి. ఇప్పుడు రాజధాని భూములపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయం వీరిని వెంటాడుతోంది'' అని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)