జగన్ నా ప్రాణం.. కేసీఆర్ కూడా ప్రాణ సమానుడే..: స్వరూపానందేంద్ర సరస్వతి - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను సంపూర్ణంగా వాడుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఈనాడు దినపత్రిక వార్తా కథనం రాసింది.

ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల్లో ఉన్న అన్ని కేసులను సత్వరమే ఉపసంహరించుకొని, రెండు రాష్ట్రాలు పరస్పరం చర్చించుకొని, అన్ని వివాదాలను పరిష్కరించుకోవాలన్న అంగీకారానికి కేసీఆర్, జగన్ వచ్చారు.

''నదీ జలాల వాటాలను నూటికి నూరు శాతం వాడుకుంటే రెండు రాష్ట్రాల అవసరాలు కచ్చితంగా తీరుతాయి. సాగునీరు, తాగునీటితో పాటు విద్యుదుత్పాదన పెరుగుతుంది. ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల అవసరం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం'' అని జగన్‌తో కేసీఆర్ అన్నారు.

ఏపీలోని ఓడరేవుల ద్వారా తెలంగాణ సరకులను ఎగుమతి చేయాలన్న కేసీఆర్ ప్రతిపాదనకు జగన్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాల కోసం విమానాల సంఖ్య పెంచాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య మరిన్ని రైళ్లు, జాతీయ రహదారుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు.

సోమవారం అమరావతిలో కేసీఆర్, వైఎస్‌ జగన్‌ మధ్య దాదాపు రెండు గంటల సేపు ఈ చర్చలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించగా, జగన్‌ అంగీకారం తెలిపారు.

విశాఖ శ్రీశారదా పీఠాధిపతి ఉత్తరాధికారి నియామక కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు సీఎంలు పాల్గొన్నారు.

జగన్ తనకు ప్రాణమని, కేసీఆర్ కూడా ప్రాణ సమానుడేనని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

''కేసీఆర్‌ మహా మేధావి. మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి. మహాభారతం చదివిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. నా హృదయంలో ఒక ఆత్మగా నేను ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌ మోహన్‌రెడ్డి. విశాఖ శ్రీ శారదాపీఠం ఆయన కోసం ఐదేళ్లు అహర్నిశలూ కష్టపడింది’’ అని అన్నారు.

ఏపీలో ఇంజనీరింగ్‌ ఫీజు రూ.40 వేల నుంచి మొదలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులకు ట్యూషన్‌ ఫీజులు ఖరారైనట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త రాసింది.

ఆ కథనం ప్రకారం.. కనిష్ఠంగా రూ.40 వేలు.. గరిష్ఠంగా రూ.1.17 లక్షల వరకు ఫీజు ఉండాలని నిర్ణయించారు.

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతించిన ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2019-2022 విద్యా సంవత్సరాలకు వర్తించేలా వీటిని ఖరారు చేశారు.

సోమవారం తాడేపల్లిలో ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ టి. రంగారావు నేతృత్వంలో జరిగిన 'అడ్మిషన్లు, ఫీజుల రెగ్యులేటరీ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)' సమావేశంలో ఆయా ఫీజులపై నిర్ణయానికి వచ్చారు.

2018-19 విద్యా సంవత్సరం వరకు ట్యూషన్‌ ఫీజు కనిష్ఠంగా రూ.35 వేలుండగా.. గరిష్ఠంగా రూ.1.08లక్షలు ఉంది.

ద్రవ్యోల్బణం, కాలేజీల ఆదాయ, వ్యయాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీజులు ఖరారు చేశారు.

ప్రతిష్ఠ, పనితీరు, మౌలిక సదుపాయాలు, ప్లేస్‌మెంట్స్‌, ఫ్యాకల్టీ, జీతభత్యాలు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని కళాశాలలకు ఫీజులను నిర్ణయిస్తున్నారు.

మొత్తం ఇంజనీరింగ్‌ కాలేజీల్లో దాదాపు మూడోవంతు కాలేజీలకు కనిష్ఠ ఫీజునే నిర్ధారించినట్లు సమాచారం. 20 కాలేజీల ట్యూషన్‌ ఫీజు రూ.లక్షకు పైగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కొత్త ట్యూషన్‌ ఫీజుల వివరాలను ఏఎఫ్‌ఆర్‌సీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది.

శాసనమండలిలో కోడిగుడ్డు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓ కోడిగుడ్డును తీసుకువచ్చినట్లు సాక్షి దినపత్రిక కథనం రాసింది.

సాధారణంగా ఉండే కోడిగుడ్డు కన్నా పరిమాణంలో సగం కన్నా తక్కువగా ఉన్న గుడ్డును శాసనమండలికి సోము వీర్రాజు తెచ్చారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

గత ప్రభుత్వ హయాంలో వాటిని సరఫరా చేసిన కాంట్రాక్టర్ ఎవరో తేల్చాలని పట్టుబట్టారు.

అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పిల్లలకు కనీసం 60 గ్రాముల బరువుండే గుడ్లను పంపిణీ చేయాల్సి ఉండగా, 30 గ్రాములు కూడా లేనివి సరఫరా అవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వం నుంచి తనకు అందాల్సిన భూపరిహారాన్ని అధికారులు కాజేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త ప్రచురించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం, కార్యాలయం ప్రగతి భవన్ ఎదుట ఆత్మాహత్యా యత్నం జరిగింది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మాశమోని ఐలేశ్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి సోమవారం ప్రగతి భవన్ వద్దకు వచ్చారు.

వెంట తెచ్చుకొన్న కిరోసిన్‌ మీద పోసుకొని వారు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు.

అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని వారిని పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు.

అనంతరం ఐలేష్ మీడియాతో మాట్లాడారు.

తన తండ్రి వెంకయ్యకు 1979లో ఇబ్రహీంపట్నం సమీపంలోని సర్వేనంబర్ 58లో భూదాన్‌బోర్డు ఐదెకరాల భూమి కేటాయించిందన్నారు.

2010లో ఆ సర్వేనంబర్‌లోని భూమిని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ)కు కేటాయించగా, అందులో తన భూమి కూడా ఉందని చెప్పారు.

పరిహారంగా ప్రభుత్వం ఎకరాకు రూ.5.40 లక్షలు చెల్లించిందని. అయితే అప్పటి వీఆర్వో, తాసిల్దార్ ,ఆర్డీవో, మరో ముగ్గురు ఉద్యోగులు, భూదాన్ బోర్డు చైర్మన్ కలిసి తమ భూమికి దొంగ పత్రాలు సృష్టించి పరిహారాన్ని కాజేశారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)