భీమా కోరేగావ్ కేసులో ఎప్పుడు ఏం జరిగింది?

భీమా కోరేగావ్ కేసులో రెండు వేరు వేరు సమయాల్లో అరెస్టులు జరగడం వలన పోలీసులు ఈ కేసులో రెండు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్, పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్, మొబైల్ ఫోన్ లాంటి సాధనాల ద్వారా లభ్యమైన సమాచారం ఆధారంగా ఛార్జ్‌షీట్లు తయారు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇందులో ఎవరి పాత్ర ఎంత? పోలీసుల ఛార్జ్‌షీట్ ఏం చెప్తోంది?

సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్, మహేష్ రౌత్ అరెస్ట్‌ల విషయంలో దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం...

కబీర్ కళా వేదిక క్రియాశీల సభ్యుడు సుధీర్ ధావలేను నిషిద్ధ కమ్యూనిస్టు పార్టీకి చెందిన తమ సభ్యులు రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్ ద్వారా సంప్రదించారు. కబీర్ కళా వేదిక పేరు మీద ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని వాళ్లు అడిగారు. భీమా కోరేగావ్ 200 వార్షికోత్సవ సందర్భంగా దళిత సంస్థలన్నిటినీ ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోనా విల్సన్, సుధీర్ ధావలే, పరారీలో ఉన్న కామ్రేడ్ ఎమ్ ఉరఫ్ మిలింద్ తేల్‌తుంబ్డే, ప్రకాష్ ఉరఫ్ రితుపర్ణ్ గోస్వామిలతో కలిసి ఒక కుట్ర పన్నారు. దాని ప్రకారం 2018 జనవరి 1 న భీమా కోరేగావ్‌లో సుధీర్ దావలే, హర్షాలీ పోత్దార్‌తో సహా కబీర్ కళా వేదిక సభ్యులు అంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారు. డిసెంబర్ 31 న వారంతా ఎల్గర్ పరిషత్ ద్వారా పాటలు పాడుతూ నినాదాలు చేసారు. వీధి నాటకాలు ప్రదర్శించారు. ఈ కారణంగా శాంతిభద్రతలకు భంగం కలిగిందని, హింసలు చెలరేగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.

దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల బ్రాహ్మణవాద భావజాలంతో దళితులు అసంతృప్తిగా ఉన్నారని, ఆ అభద్రతా భావాన్ని ఆసరాగా చేసుకుని దళితులందరినీ సంఘటితం చేయ్యాలని పథకం పన్నారని పోలీసులు చెబుతున్నారు. దీనికోసం నిషిద్ధ మావోయిస్టు పార్టీ, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్ సహాయంతో డబ్బులు సమకూర్చింది. ఒక ప్రముఖ సీపీఐ మావోయిస్టు కమిటీ సభ్యుడు 2017 జూలై, ఆగస్టులలో ధావలేకు డబ్బులు సమకూర్చారు.

ఈస్ట్రన్ రీజనల్ బ్యూరో (ఈఆర్‌బీ) సమావేశంలో నిర్ణయించినట్లుగా సీపీఐ మావోయిస్టు పథకాన్ని అమలుపరచడమే ఎల్గర్ పరిషత్ ముఖ్య ఉద్దేశ్యమని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగా పరారీలో ఉన్న కామ్రేడ్ మంగ్లూ, కామేడ్ దీపూ 2017 నవంబర్-డిసెంబర్‌ల్లో ధావలేతో కలిసి పనిచేసారు. మహారాష్ట్రలోని పలు దళిత సంఘాల మద్దతు సేకరించారు.

గాడ్లింగ్, సేన్, ధావలేలకు మహేష్ రౌత్ ద్వారా ఐదు లక్షల రూపాయలు అందినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, ఈ డబ్బును నిషిద్ధ సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిందని పోలీసులు చెబుతున్నారు.మహేష్ రౌత్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను గెరిల్లా పోరాటంలో శిక్షణ కోసం అడవులకు పంపించారని చెబుతున్నారు. రితుపర్ణ గోస్వామి, షోమా సేన్‌కు రాసిన లేఖలో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. నిషిద్ధ మావోయిస్టు పార్టీలో రౌత్ క్రియాశీల సభ్యుడని, పార్టీలో కొత్తవారిని చేర్పించడం అతని పని అని చెబుతున్నారు.

రోనా విల్సన్, గాడ్లింగ్ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ల ద్వారా తూర్పు ప్రాంతీయ బ్యూరో సీపీఐ మావోయిస్టు సమావేశం వివరాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశం 2015 డిసంబర్‌లో జరిగిందని, ఆ సమావేశంలో దళితులను, మహిళలను, మైనారిటీలను ఏకం చెయ్యాలని నిర్ణయించినట్టు పోలీసులు చెబుతున్నారు.

రోనా విల్సన్ కంప్యూటర్ నుంచీ 'ప్రస్తుత సవాళ్లు-మన పని ' అనే శీర్షికతో ఒక కరపత్రం పోలీసులకు లభించింది. దీన్ని సీపీఐ మావోయిస్టు సభ్యులందరికీ పంచారు. ఈ కరపత్రం 16 వ పేజీలో మన కార్యకలాపాలన్నీ భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని రాసి ఉంది. వీరి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఎల్గార్ పరిషత్ సహాయం తీసుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

నిషేధిత పార్టీ సభ్యుడు, ఈఆర్‌బీ సెక్రటరీ కిషన్‌దా అలియాస్ ప్రశాంత్ బోస్‌తో కలిసి ప్రధానమంత్రి హత్యకు, దేశంలో యుద్ధానికి కుట్ర పన్నారని పోలీసులు రోనా విల్సన్‌పై ఆరోపణలు నమోదు చేశారు.

నిందితులు భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థనే తారుమారుచేసే లక్ష్యంతో సీపీఐ మావోయిస్టులు పన్నిన భారీ కుట్రను అమలు చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తేల్చారు.

అనుబంధ చార్జిషీట్


వరవరరావు, సుధా భరద్వాజ్, వెర్నన్ గోంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా అరెస్ట్ తర్వాత ఈ చార్జిషీట్‌ను దాఖలు చేశారు,.
రోనా విల్సన్, పరారీలో ఉన్న నిందితుడు కిషన్‌దా అలియాస్ ప్రశాంత్ బోస్‌తో కలిసి వరవరరావు ఆయుధాలు, మందుగుండు కొనుగోళ్లకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

సీపీఐ మావోయిస్టు సీనియర్ నేత అయిన వరవరరావు నిషేధిత సంస్థ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దానితోపాటు నేపాల్ మావోయిస్టు నేత వసంత్‌తో వరవరరావు ఆయుధాల ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. నిధులు సేకరించి, వాటిని మిగతా నిందితుల దగ్గరకు చేర్చారని కూడా ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.

పరారై, అజ్ఞాతంలో ఉన్న తమ సహచరులకు వరవరరావు, గాడ్లింగ్ పోలీసులు, భద్రతా బలగాల కదలికల గురించి సమాచారం ఇచ్చేవారని, దానివల్ల ఎన్నో హింసాత్మక దాడులు జరిగాయని, ఎంతో ప్రాణనష్టం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్ కూడా సీపీఐ మావోయిస్టు సభ్యులే. వారు యువకులను తమలో చేర్చుకునేవారు. నిషేధిత సంస్థ భావజాలాన్ని ప్రచారం చేసేవారు.

గొంజాల్వెజ్‌ను ఇంతకు ముందు కూడా ఆర్మ్స్ యాక్ట్, ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. ముంబయి కాలా చౌకీ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఒక కేసు నమోదైంది. ఒక కేసులో ఆయన శిక్ష కూడా అనుభవించారు. గొంజాల్వెజ్ కూడా యాక్టివ్ మావోయిస్టు కార్యకర్తేనని పోలీసులు చెబుతున్నారు.

అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్(ఐఏపీఎల్) సీపీఐ మావోయిస్టులకు చెందిన సంఘమే అని పోలీసులు ఆరోపిస్తున్నారు. సుధా భరద్వాజ్, గాడ్లింగ్ ఆ సంఘంలో సభ్యులని, సీపీఐ మావోయిస్టు సభ్యులు వారికి ఆర్థిక సాయం అందిస్తారని అంటున్నారు.

వరవరరావు రివల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్(ఆర్డీఎఫ్) అధ్యక్షుడని, అది నిషేధిత మావోయిస్టు సంస్థ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని చార్జిషీటులో చెప్పారు. సీపీఐ మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఆయన ఎన్నో సమావేశాలు, సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేశారని తెలిపారు. వరవరరావు, సోమా సేన్, మహేష్ రౌత్, పరారీలో ఉన్న రితూపర్ణ గోస్వామి హైదరాబాద్ ఆర్డీఎఫ్ వార్షిక సదస్సులో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం పర్సిక్యూటెడ్ ప్రిజనర్స్ సాలిడేటరీ కమిటీ(పీపీఎస్‌సీ) కూడా సీపీఐ మావోయిస్టు సంస్థలో భాగమే. పీపీఎస్‌సీకి వరవరరావు ద్వారా సీపీఐ మావోయిస్టు సభ్యులు నిధులు అందించేవారని, సుధా భరద్వాజ్ పీపీఎస్‌సీలో కీలక సభ్యులని పోలీసులు చెబుతున్నారు.

భీమా కోరెగావ్ హింసాకాండలో పోలీసులు దేశవ్యాప్తంగా చాలామందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొంతమంది స్కాలర్లు, కొంతమంది లాయర్లు, రచయతలు-కవులు, కొందరు మానవ హక్కులు లేదా దళిత హక్కుల కార్యకర్తలు ఉన్నారు. వీరంతా తమ తమ రంగాల్లో ప్రముఖులు. వీరిలో కొందరు ప్రజల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ప్రసిద్ధి చెందారు.

సుధీర్ ధావలే


వరవరరావు ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తెలుగు కవిగా సుపరిచితులు. ఆయన దాదాపు 15 కవితా సంకలనాలు ప్రచురితం అయ్యాయి. వాటిని చాలా భాషల్లో అనువదించారు కూడా. ఆయన రచనలు, కవితల వల్ల వరవరరావును కొందరు మావోయిస్టు సానుభూతిపరుడుగా కూడా చెబుతారు. ఆయనను దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలున్న వామపక్ష కార్యకర్తగా భావిస్తారు . వరవరరావును ఇంతకు ముందు కూడా చాలాసార్లు అరెస్టు చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య జరిగిన చర్చల్లో కూడా మధ్యవర్తిత్వం చేశారు.

సురేంద్ర గాడ్లింగ్


సురేంద్ర గాడ్లింగ్ నాగపూర్‌లో ఉంటారు. వృత్తిపరంగా లాయరైన ఆయన మానవ హక్కులకు సంబంధించిన కేసులు వాదించేవారు. ఆయన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి కూడా. ఆయన దళిత కార్యకర్త కూడా. చాలా ఉద్యమాలలో ఉన్నారు. ఒక లాయర్‌గా ఆయన యూఏపీఏ, అంతకు ముందు పాత ఉగ్రవాద నిరోధక చట్టాలు టాడా, పోటా నిందితుల కేసులు వాదించేవారు. ఈయన మావోయిస్టులతో సంబంధాలున్నాయని అరెస్టు చేసిన దిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు కూడా లాయర్‌గా ఉన్నారు. సాయిబాబాను గడ్చిరోలీ కోర్టు దోషిగా తేల్చింది. వీల్‌ చెయిర్‌లో ఉండే వికలాంగ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు.

రోనా విల్సన్


జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్న విల్సన్ దిల్లీలో ఉంటారు. రాజకీయ బంధీల విడుదల కోసం ఉద్యమం చేస్తున్నారు. ఈ రంగంలో చాలా ఏళ్లుగా చురుగ్గా ఉన్న కార్యకర్తల్లో ఆయన ఒకరు. కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్(సీఆర్పీపీ)లో ఆయన సభ్యుడు కూడా. జీఎన్ సాయిబాబాను విడుదల చేయించాలని కూడా ఆయన ఉద్యమం నడుపుతున్నారు. రాజకీయంగా, సైద్ధాంతికపరంగా చురుగ్గా ఉన్న కార్యకర్తల అరెస్టులను విల్సన్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

షోమా సేన్


షోమా సేన్ ఇంగ్లిష్ ప్రొఫెసర్. ఆమె నాగపూర్ ఆర్‌టీఎం యూనివర్సిటీలో ఇంగ్లిష్ డిపార్టుమెంట్ హెడ్‌గా ఉన్నారు. భీమా కోరెగావ్ హింసలో ఆమె కూడా ఉన్నారనే ఆరోపణలతో పోలీసులు ఆమెను నాగపూర్‌లో అరెస్ట్ చేశారు. ఆమె మహిళలు, ఆదివాసీలు, దళితుల హక్కులపై వ్యాసాలు రాస్తున్నారు. ఆమె ఆర్టికల్స్ ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి. ఆమె కమిటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ సభ్యురాలు కూడా. మానవహక్కుల రంగంలో పనిచేస్తున్న చాలా సంస్థలతో షోమాకు సంబంధాలు ఉన్నాయి. ఈశాన్యం నుంచి బస్తర్ వరకూ, అత్యాచార బాధిత మహిళలు, రాజకీయ బందీల సమస్యలను ఆమె లేవనెత్తుతున్నారు. వారికి చట్టపరమైన సాయం కూడా అందించారు..

మహేష్ రౌత్


భీమా కోరెగావ్ కేసులో అరెస్ట్ అయిన వారిలో మహేష్ రౌత్ అత్యంత పిన్న వయస్కుడు. ఆయన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు చెందినవారు. మహేష్ ముంబయిలోని ప్రముఖ సంస్థ-టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చదివారు. ఆయన గ్రామీణాభివృద్ధి నిపుణులు. ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద ఫెలోషిప్ కూడా పొందారు. ఆయన గడ్చిరోలి గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామసభలతో కలిసి పనిచేసేవారు. గడ్చిరోలి మహారాష్ట్రలో ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఒక ప్రాంతం. అది మావోయిస్టు హింసకు ప్రభావితం అవుతోంది. ఆయన జల్, జంగల్, జమీన్(నీరు, నేల, భూమి) హక్కులకు సంబంధించిన ఉద్యమాల్లో కూడా చురుగ్గా ఉన్నారు.

వరవరరావు


వరవరరావు ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తెలుగు కవిగా సుపరిచితులు. ఆయన దాదాపు 15 కవితా సంకలనాలు ప్రచురితం అయ్యాయి. వాటిని చాలా భాషల్లో అనువదించారు కూడా. ఆయన రచనలు, కవితల వల్ల వరవరరావును కొందరు మావోయిస్టు సానుభూతిపరుడుగా కూడా చెబుతారు. ఆయనను దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలున్న వామపక్ష కార్యకర్తగా భావిస్తారు . వరవరరావును ఇంతకు ముందు కూడా చాలాసార్లు అరెస్టు చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య జరిగిన చర్చల్లో కూడా మధ్యవర్తిత్వం చేశారు.

వెర్నన్ గొంజాల్వెజ్


ముంబయిలో నివసించే గొంజాల్వెజ్ మెట్రో సిటీలోని చాలా కాలేజీల్లో బోధించారు. ఆయన గత కొన్నేళ్లుగా ప్రముఖ పత్రికలు-మ్యాగజైన్లకు రాస్తున్నారు. ఆయన్ను 2007లో మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని, పేలుడు పదార్థాలు ఉంచుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన అన్‌లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అంటే యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు. ముంబయిలోని ఒక కోర్టు ఆయనకు యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ కింద దోషిగా ఖరారు చేసింది. ఆరేళ్ల జైలు శిక్ష తర్వాత ఆయనను చాలా ఆరోపణల్లో నిర్దోషిగా తేల్చారు.

అరుణ్ ఫెరీరా


ఫెరీరా ముంబయిలో నివసిస్తున్న మానవ హక్కుల లాయర్. ఆయన మానవ హక్కులకు సంబంధించిన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అరుణ్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ అంటే సీపీఆర్ సభ్యులుగా కూడా ఉన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ లో కూడా ఆయన ఉన్నారు. ముంబయిలోని మురికివాడల్లో నివసించే ప్రజల పునరావాసం కోసం ఫెరీరా ఉద్యమాలు నడిపారు. 2007లో ఆయన్ను పోలీసులు యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు. ఆయనపై మావోయిస్టు అనే ఆరోపణలు మోపారు. 2014లో అరుణ్ అన్ని ఆరోపణల నుంచి విముక్తి పొందారు. తర్వాత జైల్లో తను గడిపిన రోజులపై అరుణ్ ఫెరీరా ఒక పుస్తకం రాశారు. జైలుశిక్ష అనుభవిస్తూనే లా చేశారు.

సుధా భరద్వాజ్


సుధా భరద్వాజ్ ప్రముఖ మానవహక్కుల కార్యకర్త. కార్మిక నేత, లాయర్. చాలా ఏళ్ల వరకూ విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన సుధా భరద్వాజ్ గత మూడు దశాబ్దాలుగా ఆదివాసీ ఆధిపత్య ప్రాంతాల్లో సామాజిక సేవ చేస్తున్నారు. లాయరుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, ఆదివాసీల కేసులు వాదిస్తుంటారు. అందుకే ఆమెను ప్రభుత్వ విరోధిగా, మావోయిస్టు సానుభూతిపరురాలుగా చెబుతున్నారు. సుధా భరద్వాజ్ ప్రముఖ పౌర హక్కుల సంస్థ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సెక్రటరీ కూడా.

పుణె పోలీసులు రచయిత-జర్నలిస్ట్ గౌతమ్ నవ్‌లఖా, సామాజిక అంశాల్లో స్కాలర్ ఆనంద్ తెల్తుంబ్డే పేరును 2018 ఆగస్టు 22న మిగతా నిందితులతోపాటూ ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. దానిని వారు కోర్టులో సవాలు చేయడంతో తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటం నడిచింది. పుణె పోలీసులు తర్వాత ఎన్ఐఏ వారి ముందస్తు బెయిల్ దరఖాస్తును సవాలు చేసింది. కానీ ఇద్దరినీ కస్టడీలోకి తీసుకోలేకపోయింది. సుప్రీంకోర్టు ఈ ఇద్దరి అరెస్టుపై స్టే విధించింది. 2019 ఏప్రిల్ 8న కోర్టు నవ్‌లఖా, తెల్తుంబ్డే బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. దీంతో ఇద్దరూ ఎన్ఐఏకు లొంగిపోయారు. నవ్‌లఖా, తెల్తుంబ్డే ఎన్ఐఏ సమక్షంలో 2019 ఏప్రిల్ 14న లొంగిపోయారు.

వీరిద్దరూ నిషేధిత సీపీఐ మావోయిస్టుల భారీ కుట్రలో భాగం అయ్యారని పోలీసులు ఆరోపణలు చేశారు. వారికి బెయిల్ ఇవ్వకూడదంటూ కోర్టులో ఇదే వాదనలు వినిపించారు. పోలీసుల వివరాల ప్రకారం నవ్‌లఖా నిషేధిత సంస్థలో కీలక పాత్ర పోషించేవారు. ప్రజలను చేర్చడం, వారికి డబ్బులు ఇవ్వడం, పథకాలు రచించడంలో ఆయన చురుగ్గా ఉన్నారని, దేశవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లి దేశవ్యతిరేక కార్యకలాపాలు చేసేలా కార్యకర్తలను రెచ్చగొట్టాడని నవ్‌లఖా దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువుల ద్వారా తెలిసిందని పోలీసులు అంటున్నారు.

ఆనంద్ తెల్తుంబ్డేపై నిషేధిత సంస్థకు ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సభలు-సెమినార్లలో ఆయన పాల్గొనేవారని, అక్కడ నిషేధిత సంస్థల సిద్ధాంతాలను ప్రచార చేసేవారని పోలీసులు చెబుతున్నారు. మిగతా నిందితుల దగ్గర నుంచి కామ్రేడ్ ఆనంద్ ప్రస్తావన ఉన్న వస్తువులు చాలా దొరికాయని అంటున్నారు. ఆనంద్ తెల్తుంబ్డే పాత్ర చాలా స్పష్యంగా తెలుస్తోందని, ఆయన స్టడీ సర్కిల్ ద్వారా ద్వేషాలు రెచ్చగొట్టేవారని, నిషేధిత సంస్థల నుంచి నిధులు పొందేవారని కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ఆనంద్ తెల్తుంబ్డేను 2019 ఫిబ్రవరి 1న అరెస్ట్ చేశారు. ఎందుకంటే పుణె సెషన్స్ కోర్ట్ ఆయన బెయిల్ దరఖాస్తు తోసిపుచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఆయన అరెస్టుపై స్టే విధించడంతో ఆ తర్వాత రోజే ఆయన్ను వదిలేయాల్సి వచ్చంది.

గౌతమ్ నవ్‌లఖా


గౌతమ్ నవ్‌లఖా ఒక ప్రముఖ ఉద్యమకారుడు. ఆయన రచయిత కూడా. దిల్లీలో నివసిస్తున్న గౌతమ్ నవ్‌లఖా వామపక్ష, అతివాద ఉద్యమాలపై చాలా రాశారు. ఆయన ప్రభుత్వ అభ్యర్థనపై కిడ్నాపైన పోలీసులను మావోయిస్టుల నుంచి విడిపించడానికి జరిగిన చర్చల్లో మధ్యవర్తి పాత్ర పోషించారు. ఆయన పౌర హక్కుల కార్యకర్తగా కూడా చాలా ఉద్యమాలలో పాలు పంచుకున్నారు.

ఆనంద్ తెల్తుంబ్డే


ఆనంద్ తెల్తుంబ్డే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మేధావి, స్కాలర్, రచయిత కూడా. ఆయన చాలా పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. ఆయన ఇంజనీర్. ఐఐఎం, అహ్మదాబాద్‌లో కూడా చదివారు. ఆయన భారత పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. కానీ ఆయన తర్వాత టీచింగ్ ఎంచుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన చాలా పత్రికలకు పరిమితంగా రాసేవారు. కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్(సీపీడీఆర్) సభ్యులుగా తెల్తుంబ్డే చాలా ఉద్యమాలలో పాల్గొన్నారు.

హనీ బాబు ఎం.టీ


భీమా కోరెగావ్ కేసులో అరెస్టైన వారిలో 12వ వ్యక్తి హనీబాబు. ఆయన దిల్లీ విశ్వవిద్లాయంలో ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్. ఆయన లింగ్విస్టిక్స్ అంటే భాషా విజ్ఞానంలో కూడా చాలా ఆసక్తి ఉండేది. దిల్లీ యూనివర్సిటీ వెబ్‌సైట్ వివరాల ప్రకారం భాషా రాజకీయాల్లో సమాజ శాస్త్రంలో కూడా చాలా ఆసక్తి చూపించేవారు. ఆయనను జులై 28న దిల్లీలో అరెస్ట్ చేశారు. ఆయనపై నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. భీమా కోరెగావ్ హింసలో నిషేధిత సంస్థ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ హనీ బాబు ఎల్గార్ పరిషత్ నిర్వహించివారితో సంబంధాలు ఉన్నాయని, తమ దగ్గర గానిని నిరూపించే ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకున్న కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను విడుదల కోసం చేస్తున్న ప్రచారంలో హనీబాబు కూడా ఉన్నారు. హనీబాబు భార్య కూడా దిల్లీ విశ్వవిద్యాలయం మిరండా హౌస్ కాలేజ్‌లో బోధిస్తున్నారు. హనీ బాబు గురించి తెలిసిన సహచర ప్రొఫెసర్లు ఆయన చాలా పాపులర్ అని, ఆయన లెక్చర్ వినడానికి విద్యార్థులు భారీగా హాజరవుతారని చెప్పారు. హనీ బాబు కులతత్వం, దళితుల సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్నారు.

ప్రభుత్వం మారేకొద్దీ మారుతున్న దర్యాప్తు సంస్థలు

పుణె విశ్రామ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైన కొన్ని నెలల్లోనే పుణె పోలీసులు 23 మందిలో 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పుణె పోలీసులు ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేశారు. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 21న ఒక అనుబంధ చార్జిషీటు కూడా ఫైల్ చేశారు.

2018 జనవరి 8న ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2018 మే 17న పుణె పోలీసులు అందులో యూఏపీఏ సెక్షన్ 13, 16, 18, 18బి, 20, 38, 39, 40 జోడించారు.

ఎన్ఐఏ కూడా 2020 జనవరి 24న ఎఫ్ఐఆర్ నమోదు చేసంది. అందులో ఐపీసీ సెక్షన్ 153A, 505(1)(B), 117, 34 పెట్టింది. దానితోపాటూ యూఏపీఏ 13,16,18,18B, 20, 39 సెక్షన్లు కూడా జోడించింది.

ఆ సమయంలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఉమ్మడి ప్రభుత్వం ఉండేది. 2019 అక్టోబర్‌లో నాటకీయ ఘటనల తర్వాత అతిపెద్ద పార్టీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చింది. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

2019 డిసెంబర్ 22న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఒక మీడియా సమావేశంలో ఎల్గార్ పరిషత్ కేసులో పుణె పోలీసుల దర్యాప్తు అనుమానాస్పదంగా ఉంది, దేశద్రోహం ఆరోపణలతో కార్యకర్తలను జైల్లో పెట్టడం సరికాదు. ప్రజాస్వామ్యంలో అన్ని రకాల భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది. పుణె పోలీసుల చర్యలు తప్పుడు, ప్రతీకార భావనలకు ప్రేరితం. కొంతమంది అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేశారు” అన్నారు. ఈ ప్రకటన lవివాదాస్పదమైంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పోలీసుల చర్యలు సరైనవేనని అన్నారు.

ఆ తర్వాత కొన్ని రోజులకే 2020 జనవరిలో కేంద్ర హోం శాఖ ఈ కేసును పుణె పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఏఎన్ఐ)కి అప్పగించాలని ఆదేశించింది. శరద్ పవార్ పార్టీ ఎన్సీపీకి సంబంధించిన మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంచారు, ఇది రాజ్యాంగవిరుద్ధం అన్నారు.

కేసు చేతిలోకి రావడంతో ఎన్ఐఏ ముంబయిలో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో 11 నిందితులు, మరికొందరి పేర్లు ఉన్నాయి. ఎన్ఐఏ ఈ కేసులో భారత చట్టాల్లోని మిగతా సెక్షన్లతోపాటూ యూఏపీఏ కూడా పెట్టింది. ఈ కేసులో ఎన్ఐఏ 124(ఎ) అంటే దేశద్రోహం సెక్షన్లు పెట్టలేదు.

భీమా కోరెగావ్ న్యాయ విచారణ కమిషన్

జనవరి 1న భీమా కోరెగావ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెలరేగిన హింస తర్వాత దేశవ్యాప్తంగా దానిపై వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. విషయం వేడెక్కడంతో హింస ఎలా మొదలైంది అనేది దర్యాప్తు కోసం ఒక న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎన్నో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వేరు వేరు వ్యక్తులను బాధ్యులుగా చెప్పాయి. ఈలోపు రూరల్ పోలీస్, పుణె సిటీ పోలీసులు రెండు వేరు వేరు దిశల్లో దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర అప్పటి దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 9న హింసపై దర్యాప్తునకు ఇద్దరు సభ్యుల జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. కోల్‌కతా హైకోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ జేఎన్ పటేల్ ఈ కమిటీకి అధ్యక్షుడుగా ఉన్నారు.

ఈ కమిటీ నాలుగు నెలల్లో తన రిపోర్ట్ అందించాలి. కానీ ఇప్పటివరకూ నాలుగు సార్లు ఈ కమిటీ పదవీకాలాన్ని పెంచారు. ఫైనల్ రిపోర్టు ఇంకా రాలేదు. నాలుగోసారి దీని పదవీకాలాన్ని 2020 ఏప్రిల్ 4 వరకూ పెంచారు. కానీ, కరోనా వల్ల లాక్‌డౌన్ మొదలయ్యింది. రెండున్నరేళ్ల క్రితం నాలుగు నెలల్లోనే తన రిపోర్ట్ సమర్పించాల్సిన ఆ కమిటీ ఇప్పుడు దానికి ఆరు నెలల సమయం పొడిగించాలని కోరింది.

ఇప్పటివరకూ 29 మంది సాక్ష్యులు కమిటీకి తమ వాంగ్మూలం ఇచ్చారు. కమిటీ ఎదుట హాజరవ్వాలని మరో 50 మంది సాక్ష్యులు సమన్లు పంపిస్తారని భావిస్తున్నారు. కమిటీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌ను కూడా సాక్షిగా పిలిపించింది. ఇంతకు ముందు పవార్ కమిటీకి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. దీనితోపాటూ కమిటీకి దాదాపు 500 అఫిడవిట్లు అందాయి. వాటిని చాలామంది, ప్రభుత్వ అధికారులు, సంస్థలు దాఖలు చేశాయి.

హిందుత్వ కార్యకర్తలు

పుణె సిటీ పోలీసులు ఒకవైపు భీమా కోరెగావ్ హింస వెనుక వామపక్ష కార్యకర్తల హస్తం ఉందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తుంటే, మరోవైపు రూరల్ పోలీసులు మాత్రం 2018 జనవరి 1న జరిగిన హింస వెనుక చాలా మంది హిందుత్వ నేతల పాత్ర ఉందనే ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నారు.

హిందుత్వ నేతలు భీమా కోరెగావ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాలను హింసకు రెచ్చగొట్టారని జనవరి 2న పింప్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మిలింద్ ఏక్బోటే, శంభాజీ భిడే అనే హిందుత్వ నేతలు జనాలకు నాయకత్వం వహించారని, జనవరి 1న దళిత సంస్థల కార్యక్రమంలో వారు హింసను సృష్టించారని అనితా సాల్వే ఫిర్యాదు చేశారు.

మిలింద్ ఏక్బోటే

మిలింద్ ఏక్బోటే

ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన మహిళ ఘటనాస్థలంలో తాను ఉన్నానని చెప్పారు. ఇద్దరు నిందితులను తను కళ్లారా చూశానని ఆమె చెప్పారు. శౌర్య దినోత్సవంలో పాల్గొనేందుకు తన స్నేహితురాలు అంజనతో కలిసి తను అక్కడికి వెళ్లానని ఆమె చెప్పారు. అప్పుడు తన ఫ్రెండ్ షికర్‌పూర్ టోల్ ప్లాజా దాటి సనాసవాడీ చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న జనం రాళ్లు రువ్వడం, నిప్పు పెట్టడం ప్రారంభించారని తెలిపారు.

శంభాజీ భిడే

శంభాజీ భిడే

ఎఫ్ఐఆర్‌లో వారిలో చాలా మంది దగ్గర ఆయుధాలు ఉన్నాయని, వారు జనాలను కొడుతున్నారని చెప్పారు. శంభాజీ భిడేను శివాజీనగర్‌ ఫౌండేషన్ అధ్యక్షుడుగా, మిలింద్ ఏక్బోటేను హిందూ జనజాగరణ్ సమితి చీఫ్ అని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు. వారితోపాటూ ఉన్నత వర్గాల వారు ఉన్నట్లు చెబుతున్నారు. సెషన్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్ మిలింద్ ఏక్బోటే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, పుణె పోలీసులు ఆయన్ను 2018 మార్చి 14న అరెస్ట్ చేశారు. ఏక్బోటేపై అల్లర్లు, హింసకు పాల్పడడంతో పాటూ చాలా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పుణె కోర్ట్ 2018 ఏప్రిల్ 4న అనితా సాల్వే ఫిర్యాదుతో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది. కానీ షికార్‌పూర్ పోలీసుల ఒక ఫిర్యాదుతో ఆయన్ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. హింస జరగడానికి ముందు ఏక్బోటే తన మద్దతుదారులకు కొన్ని పాంప్లెట్లు పంచారని షికార్‌పూర్ పోలీసులు చెబుతున్నారు.

ఏప్రిల్ 19న పుణె సెషన్స్ కోర్ట్ ఆయనకు బెయిల్ ఇచ్చింది. మరో నిందితుడు శంభాజీ భిడే 2018 జనవరి 1న భీమా కోరెగావ్‌లో ఉండి, ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చినా ఆయన్ను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదు. చాలా సంస్థలు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. న్యాయస్థానం తలుపు కూడా తట్టాయి. ఆ కేసులో పోలీసులు ఇప్పటివరకూ చార్జిషీటు కూడా ఫైల్ చేయలేదు. పైన ప్రస్తావించిన రెండు ఎఫ్ఐఆర్‌లతో పాటూ భీమా కోరెగావ్ హింసపై పుణె పోలీసుల అధికార పరిధిలో మొత్తం 30 కేసులు నమోదై ఉన్నాయి.  

ఏక్బోటే, భిడే ఎవరు


 పుణె హిందుత్వవాద కార్యకర్త మిలింద్ ఏక్బోటే తన భావజాలం వల్ల చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన సమస్త హిందూ అగాఢీ పేరుతో ఒక సంస్థను నడుపుతున్నారు. ఆయన చాలాకాలం నుంచీ గోరక్షా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రతాప్‌గఢ్ కోటలో ఉన్న మొఘల్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ సమాధిని తొలగించాలని తీవ్ర ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత నుంచి సతారా జిల్లాలోక రాకుండా ఆయనపై నిషేధం విధించారు.

ఆయన వేలైంటైన్స్ డే జరుపుకోవడంపై వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఆయన రాజకీయంగా కూడా చురుగ్గా ఉంటారు. హిందూ మహాసభ, శివసేన, బీజేపీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. 85 ఏళ్ల ఈ హిందుత్వ కార్యకర్త పశ్చిమ మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతానికి చెందినవారు.

ఆయన శివప్రతిష్ఠాన్ హిందుస్థాన్ పేరుతో ఒక సంస్థ నడుపుతున్నారు. ఆయన హిందుత్వ గురించి మాట్లాడ్డానికి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆయన మొదట్లో రాష్ట్రీయ స్వయం సేవక్‌లో ఉండేవారు. కానీ తర్వాత శివప్రతిష్ఠాన్ స్థాపించడానికి ఆర్ఎస్ఎస్‌తో విడిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మిగతా నేతలతో ఆయన సాన్నిహిత్యం అందరికీ తెలిసిన విషయమే.

భిడే తన ప్రకటనలతో, తన కార్యకలాపాలతో వివాదాల్లో ఉంటూ వచ్చారు. 2008వో 2009లో ఆయనపై ఎన్నో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వాటిలో సాంగ్లీలో అల్లర్లు రెచ్చగొట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ భీమా కోరెగావ్ ఘటనకు ఆరు నెలల ముందే ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలూ తొలగించినట్లు ఒకసారి ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.

Reporter: Mayuresh Konnur
Illustrations: Puneet Barnala, Gopal Shoonya
Images: Getty
Executive Producer: Rajesh Priyadarshi
Production: Shadab Nazmi