You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గాజాపై ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికను తిరస్కరించిన ఇజ్రాయెల్
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గాజా కోసం ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. హమాస్ ఆయుధాలను "పూర్తిగా"త్యజించే వరకు సైన్యం ఉపసంహరణ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
గాజాలోని హమాస్, ఇతర సాయుధ గ్రూపులను "పూర్తిగా ఆయుధరహితం చేయడానికి" ఒక ఒప్పందానికి వచ్చినట్లు గత నెలలో ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్' తెలిపింది.
అయితే ఇజ్రాయెల్ "అన్ని రకాల దాడులను" నిలిపివేసి, గాజా నుంచి తన దళాలను ఉపసంహరించుకుంటేనే తమ వద్ద ఉన్న భారీ ఆయుధాలను అప్పగిస్తామని హమాస్ పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో గాజాలో తొలి కాల్పుల విరమణకు అంగీకరించినప్పటి నుంచి ఇజ్రాయెల్ అక్కడ దాడులను కొనసాగిస్తూనే ఉంది.
ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ, "15 పాయింట్ల డాక్యుమెంట్‌ను ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది" అని చెప్పారు.
హమాస్ పూర్తిగా ఆయుధాలను వీడే వరకు ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి ఉపసంహరణ చేపట్టదని, తమ బలగాలకు, పౌరులకు ఎదురయ్యే ముప్పులను తిప్పికొడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
గాజా నిరాయుధీకరణ ప్రణాళికను అంగీకరించినట్లు హమాస్ ప్రకటించిన తర్వాత, "శాశ్వత శాంతి, భద్రతల దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది" అని గతేడాది ట్రంప్ ప్రకటించారు.
అయితే, ఇజ్రాయెల్ తన దళాలను గాజా నుంచి ఉపసంహరించుకోవడానికి ముందే హమాస్ ఆయుధాలను త్యజించాలని నెతన్యాహు స్పష్టం చేశారు. అది ఏదో "కంటితుడుపు నిరాయుధీకరణ"గా ఉండకూడదని వ్యాఖ్యానించారు.
ముందుకు ఎలా వెళ్లాలనే అంశంపై ప్రస్తుతం అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
"వారి వద్ద కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాకు సమ్మతమే, కొన్ని కావు. ఇలాంటి విషయాల్లో మా వైఖరికి కట్టుబడి ఉండటం మాకు తెలుసు" అని నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నందున, ఆ దేశ ప్రధాని ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి ఇష్టపడే అవకాశం లేదు.
ఈ ముసాయిదా అంగీకారయోగ్యం కాదని కొట్టిపారేసిన జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్వీర్‌తో పాటు, నెతన్యాహు రైట్ వింగ్ భాగస్వాముల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. కొత్తగా క్యాబినెట్ ఓటింగ్ పెట్టి ఈ గాజా ప్రణాళికను పూర్తిగా పక్కన పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఇది మరొక పెద్ద ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. ఒప్పంద అమలును పర్యవేక్షించడానికి 'బోర్డ్ ఆఫ్ పీస్' ఏర్పాటుతో పాటు హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, గాజా పునర్నిర్మాణం వంటి అంశాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)