అమరావతి vs మావిగన్‌: 2029 ఎన్నికలకు మూడేళ్లు ముందుగానే టీడీపీ, వైసీపీ అజెండా సిద్ధం చేసుకున్నాయా?

అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చారు వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. తాము 'మావిగన్‌' రాజధానికే కట్టుబడి ఉన్నామని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.

2029లో జరిగే ఎన్నికలకు అమరావతి వర్సెస్‌ మావిగన్‌ నినాదంతోనే ముందుకు వెళ్తామని ఆయన ప్రకటించారు. జగన్‌ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నెల్లూరులో జరిగిన ఓ సభలో మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన రాజధాని అమరావతి వైసీపీకి అవసరం లేదని, ఇప్పుడు పనులు వేగంగా జరుగుతుంటే సహించలేకపోతోందని విమర్శించారు.

గతంలో మూడు రాజధానులన్నారని, పార్లమెంటులో శాశ్వత రాజధాని చట్టం చేస్తే మావిగన్‌ అంటూ కొత్త ఆట మొదలుపెట్టారని చంద్రబాబు విమర్శించారు.

మొత్తంగా రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం దాటినా... ఏపీ రాజధానిపై ఇంకా ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం రాలేదు. 2029లో ఏపీలో మూడోసారి జరిగే ఎన్నికలకు కూడా రాజధాని విషయమే ప్రధాన అజెండా కావడం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

మొదటి నుంచి టీడీపీ... అమరావతికే

మొదటి నుంచి అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్న టీడీపీ... 2024లో రెండోసారి కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు చేపట్టింది.

దీనిపై తొలుత ఏపీ అసెంబ్లీలో తీర్మానం, ఆపై లోక్‌సభ, రాజ్యసభల్లో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్ఖీకరణ–సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించగా, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్‌లో దాన్ని ఆమోదించారు.

2025 మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించింది ఏపీ ప్రభుత్వం.

అమరావతి రాజధాని కోర్‌ కాపిటల్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.

అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

మూడు సార్లు మారిన వైసీపీ స్టాండ్‌

మొదట 2014లో అమరావతి.. ఆ తర్వాత 2019లో మూడు రాజధానులు.. ఇప్పుడు 2026లో మావిగన్‌... ఇలా ఇప్పటికి మూడుసార్లు రాజధాని విషయంలో వైసీపీ తన విధానం మార్చుకుంది.

రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించింది.

నాటి అమరావతి రాజధాని ప్రకటనకు అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి తాము అమరావతి రాజధానికి అనుకూలమని ప్రకటించారు.

అయితే రాజధాని భూ సమీకరణపై మాత్రం విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణానికి ఏడాదికి మూడు పంటలు పండే 33 వేల ఎకరాల పచ్చటి పొలాలు అవసరం లేదని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

మరోవైపు నాటి టీడీపీ ప్రభుత్వం 2015లో భూములను నోటిఫై చేసి, రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోదీతో శంకుస్థాపన చేయించింది. భూ సమీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్రమోదీ హాజరైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సైతం వైసీపీ గైర్హాజరైంది.

ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని ఆరోపించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వం అమరావతిలోనే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలను పూర్తి చేసింది.

అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు (ఫైల్ ఫోటో)

2019లో వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే పాలనా వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

2019 నవంబర్‌ నెలాఖరులో అప్పటి పురపాలకశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ.. 'రాజధాని అమరావతిలో ఏముంది.. శ్మశానం' అని వ్యాఖ్యానించారు.

బొత్స వ్యాఖ్యల తర్వాత అదే ఏడాది డిసెంబర్‌ 17న ముఖ్యమంత్రి హోదాలో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో నాటి శాసనసభ సమావేశాల చివరి రోజున ఏపీకి మూడు రాజధానులు అవసరమని వ్యాఖ్యానించారు.

"దక్షిణాఫ్రికాను చూస్తే అక్కడ మూడు రాజధానులు ఉన్నాయి. అదే మాదిరిగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తే మేలు. శాసన రాజధానిగా అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం" అని జగన్‌ ప్రకటించారు.

"అమరావతిపై మాకు వ్యతిరేకత లేదు. కానీ అభివృద్ధి అంతా ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదు. హైదరాబాద్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే రాజధాని వికేంద్రీకరణ జరగాలి" అని అన్నారు.

ఆ ప్రకటనకు అనుగుణంగా 2020 జనవరిలో శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించారు. అప్పటి గవర్నర్‌ ఆమోదంతో 2020 సెప్టెంబర్‌లో మూడు రాజధానుల చట్టం రూపొందించారు.

అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

రైతులు కోర్టుకి వెళ్లడంతో..

మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని భూములిచ్చిన రైతులు డిమాండ్‌ చేశారు. దీనికి టీడీపీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా రాష్ట్రంలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీలూ మద్దతుగా నిలిచాయి.

రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయపరమైన చిక్కులు నాటి వైసీపీ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. హైకోర్టు తుది తీర్పునకు ముందుగానే 2022 మార్చిలో ఆ రెండు చట్టాలను నాటి వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఏపీ సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ పేరుతో చేసిన మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఈ సందర్భంగా వై.ఎస్‌. జగన్‌ మాట్లాడుతూ, మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతూ, భవిష్యత్‌లో మరింత బలంగా చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

2024 వైసీపీ మేనిఫెస్టోలో రాజధానిపై ఏమంది?

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ తేల్చిచెప్పింది.

"2024లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే పరిపాలనా రాజధానిగా, రాష్ట్రాభివృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌గా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం" అని మేనిఫెస్టోలో పేర్కొంది.

అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై పార్టీ స్టాండ్‌ పై మరోసారి ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు.

‘‘మూడు రాజధానులనేది ఆ రోజు మా విధానం. ఇప్పుడు మా విధానం ఏమిటనేది చర్చించి చెబుతాం’’ అని ఆయన వ్యాఖ్యానించడంతో పార్టీ స్టాండ్‌ మారుతుందన్న వాదనలు మొదలయ్యాయి.

అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

తెరపైకి మావిగన్‌

మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్ప అన్ని పార్టీలూ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. వైఎస్సార్సీపీ వాకౌట్‌ చేయడంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

అదే రోజు ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి తొలిసారిగా మావిగన్‌ ప్రకటన చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే, మచిలీ పట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని, దానికి 'మావిగన్‌' అనే పేరు పెట్టాలని సూచించారు.

"మచిలీపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు.. ఈ మొత్తం 110 కి.మీ. ఇప్పటికే హైవే ఉంది. ఈ 110 కి.మీ. హైవేకి అటు, ఇటు క్యాపిటల్‌ కారిడార్‌ కింద ప్రకటిస్తే గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుంది. ఆంగ్ల భాషలో వచ్చే లెటర్స్‌ క్రమంలో మచిలీపట్నంలో ''మా'' విజయవాడలో ''వి'' గుంటూరు నుంచి ''గన్‌'' తీసుకోండి. మావిగన్‌ అని పేరుపెట్టి క్యాపిటల్‌ ఏరియాగా డిక్లేర్‌ చేయండి" అని జగన్‌ ఆరోజు సూచించారు.

"విజయవాడ, దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3–4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదుగుతుంది కదా" అని అన్నారు.

అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే సరిపోతుందని అన్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆ నిధుల్లో కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

వాస్తవానికి గత ఏప్రిల్‌లో వై.ఎస్‌.జగన్‌ మావిగన్‌ ప్రకటన చేసిన తర్వాత సహజంగానే అధికార టీడీపీ, జనసేన పార్టీల నుంచి విపరీతంగా విమర్శలొచ్చాయి. వైసీపీ నేతలు, శ్రేణులను మినహాయిస్తే మిగిలిన అన్ని వర్గాల నుంచి కూడా భిన్నాభిప్రాయాలే వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ మావిగన్‌ ప్రతిపాదనను భవిష్యత్‌లో అంత బలంగా ముందుకు తీసుకురాదనే వాదనలు వినిపించాయి.

అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమరావతి రైతుల ఆందోళన (ఫైల్ ఫోటో)

మావిగన్ – మా విధానం: వై.ఎస్. జగన్

రాజధాని నిర్మాణానికి మరోసారి భూసమీకరణ చేపట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. భూములివ్వని రైతులను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తూ.. జూన్‌ 27న వైసీపీ నేతలు సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో పర్యటన చేపట్టారు.

అయితే వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్‌ తదితరుల పర్యటనను రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నారు. తమ పర్యటనపై టీడీపీ శ్రేణులు గుడ్లు, రాళ్లతో దాడులు చేశారని వైసీపీ వర్గీయులు ఆరోపించగా వైసీపీ నేతలే బయటివారిని తీసుకువచ్చి గొడవలు సృష్టించాలని చూశారని స్థానిక రైతులు, టీడీపీ నేతలు విమర్శించారు.

మొత్తంగా వైసీపీ నేతల పర్యటన ముందుకు సాగకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సరిగ్గా ఈ నేపథ్యంలోనే జూలై 1న మీడియా సమావేశం నిర్వహించిన వై.ఎస్‌. జగన్‌ ఈ సారి మావిగన్‌ ప్రతిపాదనను బలంగా తీసుకువచ్చారు.

ఏకంగా 'మావిగన్‌ వర్సెస్‌ అమరావతి' అంశంపైనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలని ఆయన ప్రకటించారు.

అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే అమరావతి నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

"వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 'మావిగన్‌ వర్సెస్‌ అమరావతి' గా జరుగుతాయి. మేము మావిగన్‌కే కట్టుబడి ఉన్నాం. ఎవరైతే మావిగన్‌ను సమర్థిస్తారో వారు వైఎస్సార్‌సీపీకి ఓటేస్తారు, ఎవరు అమరావతిని కోరతారో వారు వారికి ఓటేస్తారు. మేము ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పదల్చాం. అంతేకాదు, ఈ అంశాన్ని మా మానిఫెస్టోలో కూడా చేరుస్తాం. 'మావిగన్‌.. వైయస్సార్‌సీపీ' దానికే కట్టుబడి ఉన్నాం. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూద్దాం" అని జగన్‌ వ్యాఖ్యానించారు.

అమరావతి
ఫొటో క్యాప్షన్, అమరావతిలోని సీఆర్‌డీఏ భవనం

మరి విశాఖ సంగతేంటి?

అయితే మీడియా సమావేశంలో ఓ విలేఖరి మరి విశాఖపట్నం విషయం ఏమిటని ప్రశ్నిస్తే జగన్‌ సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. అయితే ఇదే విషయమై గతంలో మీడియాతో మాట్లాడుతూ.. '' హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్‌ ఇంజిన్‌ ఉండాలని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు'' అని వ్యాఖ్యానించారు.

తాజాగా వై.ఎస్‌. జగన్‌ స్పష్టంచేసిన మావిగన్‌ ప్రతిపాదనపై వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు బీబీసీతో మాట్లాడారు.

"మావిగన్‌ అంటే అటు అమరావతికి వ్యతిరేకం కాదు.. ఇటు విశాఖకు వ్యతిరేకం కాదు.. తక్కువ పెట్టుబడితో తక్కువ భూసమీకరణతో వేగంగా రాజధాని అభివృద్ధి చెందేందుకే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారు. విశాఖను మొదటి నుంచి వై.ఎస్‌. జగన్‌ రాష్ట్రానికే గ్రోత్‌ ఇంజన్‌లా చూశారు. ఈ ప్రాంతంపై ఆయనకి స్పష్టమైన విధానం ఉంది" ని కన్నబాబు వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పటికీ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా విమానాల్లో షటిల్‌ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకం కాదు" అని కన్నబాబు స్పష్టం చేశారు.

అమరావతి, మావిగన్, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు

జగన్‌ కుట్రలను జనం గమనిస్తున్నారు: టీడీపీ

"అమరావతి రాజధాని విషయంలో ప్రజలను గందరగోళానికి గురి చేయాలన్న కుట్రలో భాగంగానే వై.ఎస్‌. జగన్‌ మావిగన్‌ అంటున్నారు. వాస్తవానికి ఆయన చెబుతున్న విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుల్లోని చాలా ప్రాంతాలు సీఆర్‌డీఏ పరిధిలోనే ఉండగా, మరికొన్ని సమీపంలో ఉన్నాయి. కేవలం జగన్‌ ఉద్దేశం అమరావతిపై విషం చిమ్మడమే. అది జనాలకు ఇప్పుడు మరింతగా అర్ధమైంది. అతను మళ్లీ వస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదని ప్రజలకు తెలిసిపోయింది" అని టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బీబీసీతో అన్నారు.

"అమరావతి రాజధాని నిర్ణయాన్ని ఏపీనే కాదు.. పార్లమెంటు సాక్షిగా వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలూ స్వాగతించాయి. ఓ పక్క అమరావతిలో పదుల సంఖ్యలో జాతీయ బ్యాంకులు తమ నిర్మాణాలను మొదలుపెట్టాయి. ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో వస్తున్నాయి. ఈ టైంలో కేవలం గందరగోళం సృష్టించడానికే జగన్‌ చేస్తున్న మావిగన్‌.. కచ్చితంగా అతన్ని నవ్వుల పాలు చేస్తుంది" అని సోమిరెడ్డి విమర్శించారు.

కేవలం ఒక్క అజెండాతో ఎన్నికలకు వై.ఎస్‌. జగన్‌ వెళ్తామనడం సరికాదు, అయితే వై.ఎస్‌. జగన్‌ తీసుకున్న మావిగన్‌పై ప్రజలే నిర్ణయం తీసుకుంటారని సీనియర్ జర్నలిస్ట్ గాలి నాగరాజు అభిప్రాయపడ్డారు.

ఓ రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అన్నది ఎన్నికల ఫలితాలతోనే తేలిపోతుందని, మరోపక్క అధికార పార్టీ కూడా విపక్షాలకు విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వకుండా అమరావతి నిర్మాణాలను పక్కాగా వేగంగా చేపట్టాలని ఆయన సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)