పుట్టిన రోజు నాడే గోల్డ్ మెడల్ సాధించిన భారత బాక్సర్ లవ్లీనా

లవ్లీనా బోర్గోహైన్, ఆసియా క్రీడలు, స్వర్ణ పతకం, జపాన్
ఫొటో క్యాప్షన్, బాక్సింగ్ 75 కిలోల విభాగంలో చైనాకు చెందిన బావో జియీని 5-0 తేడాతో ఓడించారు.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు.

ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన లవ్లీనా, తన పుట్టినరోజున 75 కిలోల విభాగం ఫైనల్‌లో చైనాకు చెందిన బావో జియీని 5-0 తేడాతో ఓడించారు.

2024లో పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోవడంతో లవ్లీనా బాక్సింగ్ నుంచి తప్పుకోవాలనుకున్నారు కానీ, తన నిర్ణయాన్ని మార్చుకుని బరిలోకి దిగారు.

"ఇది నాకు కష్టకాలం. నేను అంతకుముందు బాక్సింగ్ వదిలేయాలనుకున్నా. కానీ, ఆడటం కొనసాగించాను. నా పతకం రంగును మార్చుకోవాలనుకున్నాను. ఇది నాకు చాలా ముఖ్యం. దీనికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఆడటం కొనసాగించడం" అని లవ్లీనా వార్తా సంస్థ పీటీఐతో చెప్పారు.

గత ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలిచిన లవ్లీనా, ఈసారి స్వర్ణం సాధించారు.

'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్' 2021 నామినీల్లో లవ్లీనా ఒకరు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చిన్న గ్రామం నుంచి వచ్చి..

భారత్‌లో క్రీడల్లో రాణిస్తున్న చాలా మంది అథ్లెట్లలానే లవ్లీనా కూడా ఒక చిన్న గ్రామం నుంచి వచ్చారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నడుమ ఆమె ఒలింపిక్స్ కలను సాకారం చేసుకున్నారు.

అసోం గోలఘాట్ జిల్లాలో బోరో ముఖియా గ్రామం లవ్లీనా స్వస్థలం. తండ్రి ఓ చిరు వ్యాపారి. తల్లి గృహిణి. తండ్రి నెల వారీ సంపాదన చాలా తక్కువ.

లవ్లీనా 1997 అక్టోబర్ 2న పుట్టారు. బాక్సర్ కావాలనే కూతురి కలను నెరవేర్చేందుకు ఆమె తండ్రి చాలా కష్టపడ్డారు.

లవ్లీనా బోర్గోహైన్ అసోం నుంచి అర్జున అవార్డు అందుకున్న ఆరో క్రీడాకారిణి.

లవ్లీనాకు కవలలైన లీచా, లీమా అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. వారు కూడా కిక్ బాక్సింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. కానీ అంతకు మించి వెళ్లలేకపోయారు.

లవ్లీనా బోర్గోహైన్, ఆసియా క్రీడలు, స్వర్ణ పతకం, జపాన్

మహమ్మద్ అలీ కథ విని..

అక్కల్లాగే మొదట కిక్ బాక్సర్ కావాలనుకున్న లవ్లీనా తర్వాత బాక్సింగ్‌ వైపు మళ్లారు.

''ఒక రోజు ఓ వార్తా పత్రికలో స్వీట్లు పట్టుకొని లవ్లీనా దగ్గరకు ఆమె తండ్రి వచ్చారు. అప్పుడే ఆ పత్రికలోని మహమ్మద్ అలీ చిత్రాన్ని లవ్లీనా చూశారు. అలీ కథను లవ్లీనాకు తండ్రి వివరించారు. అలా లవ్లీనా బాక్సింగ్ ప్రస్థానం మొదలైంది''అని లవ్లీనా ప్రస్థానం గురించి మీడియా చాలా కథలు ఉన్నాయి.

హైస్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ట్రయల్స్‌లో పాల్గొన్న ఆమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ కోచ్ పదుమ్ బోరో ఆమెకు 2012లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అలా, ఐదేళ్లలోనే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించే స్థాయికి ఆమె వెళ్లారు.

ఆ తర్వాత ఆమెకు చీఫ్ మహిళా కోచ్ శివ సింగ్ శిక్షణ ఇచ్చారు.

లవ్లీనా బోర్గోహైన్, ఆసియా క్రీడలు, స్వర్ణ పతకం, జపాన్

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం

2018 కామన్‌వెల్త్ గేమ్స్ లవ్లీనా కెరియర్‌ను పూర్తిగా మార్చేశాయి. ఆ గేమ్స్‌లో పాల్గొనేందుకు లవ్లీనా ఎంపికయ్యారు. అయితే, ఆ విషయాన్ని ఆమెకు అధికారికంగా తెలియజేయలేదని వార్తలు వచ్చాయి.

పత్రికల ద్వారా ఆ విషయం తెలుసుకున్నానని ఆమె చెప్పారు. ఆ పోటీల్లో ఆమె పతకాన్ని సాధించలేకపోయారు. ఆ తర్వాత తను చేస్తున్న తప్పులపై ఆమె దృష్టిసారించారు. టెక్నికల్ విషయాలతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టారు.

ఆ ఫలితాలు కొన్ని నెలల్లోనే కనిపించాయి. 2018, 2019ల్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె కాంస్య పతకం సాధించే స్థాయికి వెళ్లారు.

టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఆమె దేశానికి కాంస్య పతకాన్ని అందించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)