గుజరాత్‌: ఇప్పటికీ కరెంటు లేని గ్రామం ఇది.. ఊర్లో సోలార్ ప్లాంట్ ఉన్నా చీకట్లోనే మగ్గుతున్న ఇళ్లు

గుజరాత్‌: ఇప్పటికీ కరెంటు లేని గ్రామం ఇది.. ఊర్లో సోలార్ ప్లాంట్ ఉన్నా చీకట్లోనే మగ్గుతున్న ఇళ్లు
ప్రచురణ

గుజరాత్‌లోని బనస్కాంఠా జిల్లా వావ్ తాలూకాలో ఉంది రాఘనేస్డా గ్రామం.

ఈ ఊరి జనాభా 1700. ఇది భారత్- పాకిస్తాన్ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుజరాత్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ గ్రామంలోనే 700 మెగావాట్ల భారీ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేసింది.

కానీ కరెంటు లేక ఈ ఊరి ప్రజలు చిమ్మచీకట్లలో బతకాల్సి వస్తోంది.

సోలార్ పవర్ ప్లాంట్ వల్ల ఉపాధి దొరకడంతో ఇక్కడ నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరింది. కానీ గ్రామానికి విద్యుత్ సమస్య మాత్రం తీరలేదు.

‘‘మా ఊరిలో కరెంటు లేదని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పండి. ఊరిలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. కానీ మాకు కరెంటు రావట్లేదు. మా ఊరికి కరెంటు, తాగునీరు ఇవ్వమని మోదీకి చెప్పండి. కరెంటు, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం’’ అని స్థానికుడు ఘెంఘా రబరి బీబీసీ దగ్గర వాపోయారు.

‘‘మా ఊరిలో కరెంటు, తాగు నీరు లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. 45 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మా ఊరికి కరెంటు ఎప్పుడొస్తుందోనని ఎదురు చూస్తున్నా. మాలాంటి వాళ్లే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలు ఇస్తుంది. కానీ, ఇప్పటి వరకు ఏమీ చేయలేదు’’ అని మరో స్థానికుడు మవాభాయి రబరి చెప్పారు.

శివభాయి రబరి.. సోలార్ పవర్ ప్లాంటు దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. కానీ, ఆయన ఇంట్లో కరెంటు లేదు.

‘‘రాత్రి డ్యూటీ కోసం పవర్ ప్లాంటు దగ్గరికి వెళ్లినప్పుడు ఇదొక పెద్ద మార్కెట్‌లా అనిపిస్తుంది. మా ఇంటికి వెళ్తే అక్కడ కరెంటు ఉండదు. ఇంటి దగ్గర మా తాత చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి చీకట్లో ఉండటంతో ఆయన చూపు కోల్పోయారు’’ అని శివభాయి వివరించారు.

కరెంటు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ గ్రామంలోని అగర్‌బెన్ అంటున్నారు.

‘‘ఇంట్లో దీపాలు పెట్టుకుంటాం. నూనె అయిపోతే ఆ దీపం ఆరిపోతుంది. ఆ తర్వాత మేం చీకట్లోనే ఉంటాం. ఇంకేం చేయగలం? దీపం ఎంతసేపు వెలుగుతుంది? దీపం ఉన్నంతసేపు గదిలో వెలుగు ఉంటుంది. తర్వాత అంతా చీకటే’’ అని చెప్పారామె.

ఎండాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అగర్‌బెన్ చెప్పారు. ‘‘ఎండాకాలం విసనకర్రలు వాడుతాం. కరెంటు ఫ్యాన్లు వాడలేం కదా. కరెంటు లేకుంటే ఫ్యాన్ ఎలా నడుస్తుంది?’’ అని ప్రశ్నించారు.

తమ ఊరిలో స్కూలు కూడా సరిగా లేదని, పిల్లలు, యువతీ, యువకులు చదువుకోలేక, కూలీలుగా మారిపోవాల్సి వస్తోందని ఆమె అంటున్నారు.

‘‘మా ఊరిలో నీళ్లు దొరకడమే కష్టం. మాకు నీళ్లు ఉంటే, పొలాల్లో పనులకు వెళ్లేవాళ్లం. కరెంటు లేదు. నీళ్లు లేవు. పిల్లలకు చదువు లేదు. యువత ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు’’ అని తెలిపారు.

ఈ ఊరిలోని చాలా ఇళ్లల్లో టాయిలెట్లు లేవు. నీటి సదుపాయం లేదు.

‘‘ఇళ్ల దగ్గర టాయిలెట్లు లేక మహిళలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయాల్సి వస్తోంది. రాత్రి చీకట్లో బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది’’ అని ధనిబెన్ చెప్పారు.

ఈ ఊరిలో చాలా ఇళ్లు దూరం దూరంగా ఉన్నాయి. చాలామంది ఎవరి పొలాల్లో వాళ్లు ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ కరెంటు సదుపాయం లేకపోవడానికి కారణం అదేనని గ్రామస్థుడు విహాభాయి అంటున్నారు.

‘‘పదేపదే అడిగితే, రాష్ట్ర ప్రభుత్వం 2014లో మాకు సోలార్ ప్యానెళ్లు ఇచ్చింది. రెండు, మూడేళ్ల తర్వాత అవి పాడయ్యాయి. చీకట్లో ఉంటున్నామని, మాకు కరెంటు సౌకర్యం కల్పించాలని అధికారులను కోరాం. ఇళ్లన్నీ ఒక్క దగ్గర లేవు, అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయని కరెంటు ఇవ్వలేమన్నారు’’ అని విహాభాయి వివరించారు.

రైతులు, వ్యవసాయ కూలీలే ఈ ఊరిలో ఎక్కువ మంది ఉన్నారు. కొందరు ఉపాధి హామీ పథకం పనులకూ వెళ్తున్నారు. ఈ ఊరివాసులకు ప్రభుత్వం సోలార్ ప్యానెళ్లు పంపిణీ చేసింది. అయితే, అవి కూడా అందరికీ అందలేదని, సోలార్ ప్యానల్లు ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదని గ్రామ సర్పంచి రత్నాభాయి అంటున్నారు.

‘‘సాయంత్రం బ్యాటరీ వాడుతాం. కానీ సోలార్ బ్యాటరీ ఎక్కువసేపు పనిచేయదు. బ్యాటరీతో కొన్ని గంటల పాటు మాత్రమే బల్బు వెలుగుతుంది. బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోగానే, దీపం పెట్టుకుంటాం’’ అని మావాభాయి రబరి తెలిపారు.

రాఘనేస్డా గ్రామంలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ స్కూలుకు ప్రభుత్వం కరెంటు సదుపాయం కల్పించింది. స్కూలుతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాత్రమే విద్యుత్ కనెక్షన్ ఉంది. ఈ పాఠశాలలో 150 మంది విద్యార్థులు చేరగా, 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే క్రమం తప్పకుండా వస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఇక్కడి సమస్యల గురించి తాను ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండాపోయిందని మాజీ సర్పంచి కార్సన్ రాజ్‌పుత్ అన్నారు.

‘‘50-55 ఏళ్ల కిందట, బీఎస్ఎఫ్ స్టేషన్‌ను కుండరియ గ్రామం నుంచి మా ఊరికి మార్చారు. సైనికుల మధ్య ఉండటం ఇబ్బందిదని అప్పుడు చాలామంది గ్రామస్తులు తమ పొలాళ్లోనే ఇళ్లు కట్టుకున్నారు’’ అని తెలిపారు.

గ్రామస్తులందరూ ఒక్క చోట ఇళ్లు కట్టుకునేందుకు 2017లో స్థలాన్ని చూపించామని, కానీ వాళ్లు తాము పొలాల దగ్గరే ఉంటామంటున్నారని జిల్లా అధికారులు చెప్పారు. ఈ గ్రామ సమస్యల గురించి బనాస్కాంటా జిల్లా కలెక్టర్‌‌ను సంప్రదించేందుకు బీబీసీ గుజరాతీ ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.

ఈ ఊరికి కరెంటు సదుపాయం లేకపోవడంపై ఉత్తర గుజరాత్ విద్యుత్ కంపెనీ ఎం.డీ వరుణ్ బరన్వాల్ వివరణ ఇచ్చారు. దాదాపు 200 కుటుంబాలు పొలాల దగ్గరే నివాసం ఉంటున్నాయని, వారందరికీ సోలార్ బల్బులు పంపిణీ చేశామని, కానీ వారికి విద్యుత్ గ్రిడ్ కనెక్షన్లు లేవని ఆయన చెప్పారు.

ఆ ఇళ్లన్నీ దూరం దూరంగా ఉన్నాయని, వారు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని, ఛార్జీలు చెల్లిస్తే విద్యుత్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు తమ దగ్గర పెండింగ్ దరఖాస్తులేమీ లేవన్నారు.

‘‘ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, జ్యోతిగ్రామ్ యోజన కింద విద్యుత్ సదుపాయం కల్పించాలంటే, స్థానిక అధికారులు ఆ ఇళ్లన్నింటినీ పన్నుల రికార్డుల్లో చేర్చాలి. వాళ్లంతా వ్యవసాయ భూముల్లో నివాసం ఉంటున్నారు కాబట్టి, వారి ఇళ్లను ప్రభుత్వ రికార్డుల్లో చేర్చడం కష్టం’’ అని ఎమ్మెల్యే గెనిబెన్ ఠాకూర్ పేర్కొన్నారు.

ఈ గ్రామంలోని సోలార్ పవర్ ప్లాంటులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. స్థానికులు మాత్రం తమ పూర్వీకుల మాదిరిగానే చీకట్లలోనే గడపాల్సి వస్తోంది.

‘‘కరెంటు వస్తే మా జీవితాలు బాగుపడతాయి. చీకటిలో మేం ఎంతకాలం బతకాలి? మాకు కరెంటు కావాలి. పిల్లలు రోజుకు రెండు, మూడు గంటలే చదువుకుంటున్నారు. చీకటి పడిందంటే ఎవరూ పుస్తకం పట్టుకోవడంలేదు.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)