ఇండోనేషియా ఫెర్రీ ప్రమాదంలో ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య, 107మంది సురక్షితం, 130 మంది ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు

ఇండోనేషియా, నౌక, ప్రమాదం, జావా

ఫొటో సోర్స్, Donny Muslim / BBC

    • రచయిత, టాబి విల్సన్, టిన్‌షుయ్ యంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇండోనేషియా ఫెర్రీ ప్రమాదంలో మృతులసంఖ్య ఆరుకు పెరిగింది.

ప్రయాణికుల ఫెర్రీ ఒకటి జావా సముద్రంలో బోల్తా పడడంతో ఆరుగురు మరణించారని, 107మందిని రక్షించామని అధికారులు తెలిపారు. మరో 130 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు.

ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోవడంతో విర్గో ట్రాన్స్‌పోర్ట్8 నౌకతో సంబంధాలు తెగిపోయాయి.

నౌక సురబయా నుంచి దక్షిణ కాలిమంతన్‌లోని బంజర్‌మసిన్ నగరానికి ఫెర్రీ ప్రయాణిస్తోంది.

ఆదివారం(సెప్టెంబర్ 13) అర్ధరాత్రి దాదాపు రెండుగంటల సమయంలో దక్షిణ బంజర్‌మిసన్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నౌకతో సంబంధాలు తెగిపోయాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సురబయా నుంచి బంజర్‌మసిన్‌కు వెళ్తున్న నౌక

నౌకలను, హెలికాప్టర్‌ను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 280మంది సిబ్బంది సహాయకచర్యల్లో భాగమయ్యారు. జావా సముద్రంప్రాంతంలోని అన్ని నౌకలను అప్రమత్తం చేశారు. ప్రయాణికుల ఆచూకీ లభిస్తే సమాచారమందించాలని కోరారు.

ఫెర్రీలో 213మంది ప్రయాణికులు, 30మంది సిబ్బంది ఉన్నారు.

శనివారం(సెప్టెంబర్ 12)10.33 గం.లకు నిమిషాలకు నౌక బయలుదేరిందని, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అది బంజర్‌మసిన్‌కు చేరాల్సి ఉందని రెండు సముద్ర రవాణా పర్యవేక్షక సైట్‌లు తెలిపాయి.

ఇండోనేషియా, నౌక, ప్రమాదం, జావా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమవారికోసం కుటుంబసభ్యుల ఎదురుచూపులు

కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం బంధువుల పడిగాపులు

ప్రమాదానికి సంబంధించి మొదటి సమాచారం అధికారులకు ఆదివారం తెల్లవారుజామున 4.10 గం.లకు అందింది.

సహాయక చర్యల కోసం ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, నేవీ, సముద్ర పోలీసు విభాగాలతోపాటు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు.

బంజర్‌మసిన్‌కు చెందిన రుస్మిలావతి తన బంధువులు ఎనిమిది మంది ఆ నౌకలో ప్రయాణిస్తుండడంతో వాళ్ల సమాచారం తెలుసుకోవడానికి పోర్టుకు వెళ్లారు. జావాలోని పలువురు ఇస్లామిక్ పండితుల సమాధులను సందర్శించి వారు తిరిగి బంజర్‌మసిన్‌కు వెళ్తున్నారు.

''వెళ్లేటప్పుడు విమానంలో వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు నౌకలో ప్రయాణించాలనుకున్నారు'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

వారిని రక్షించారా లేదా అనేదానిపై అధికారుల నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి సమాచారం అందలేదని రుస్మిలావతి చెప్పారు.

ఆ కుటుంబానికి తమ బంధువుల్లో ఒకరి నుంచి వాట్సాస్ స్టేటస్ ద్వారా చివరి సమాచారం అందింది. ''ఈ రాత్రి అలలు చాలా భయంకరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. లేదా నౌక ప్రయాణం సాధారణంగా ఎప్పుడూ ఇలాగే ఉంటుందా..? అలల మధ్య ఊగుతూ వాటిని ఢీకొన్నట్టుగా ప్రయాణిస్తుందా'' అని బంధువు ఒకరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు.

''వాళ్లు క్షేమంగా ఉన్నారనుకుంటాను'' అని రుస్మిలావతి చెప్పారు.

ఇండోనేషియా, నౌక, ప్రమాదం, జావా

ఫొటో సోర్స్, Donny Muslim / BBC

ఫొటో క్యాప్షన్, ప్రమాదంలో గల్లంతయినవారి కుటుంబ సభ్యులు తమవారి కోసం త్రిశక్తి పోర్టులో ఎదురుచూస్తున్నారు.

2020-2026మధ్య 111 నౌకలకు ప్రమాదం

మిస్తా అనే మహిళ తన భర్త అహ్మద్ సుపాండీ ప్రాణాలతో బయటపడ్డారని తెలుసుకుని ఆనందంతో ఏడ్చేశారు.

అహ్మద్ సరుకు రవాణా డ్రైవర్. విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8లో ప్రయాణిస్తున్నారు. తర్వాత ఎంవీ హైదా అనే నౌక ఆయన్ను రక్షించింది.

సురబయాలోని తంజుంగ్ పెరాక్ పోర్టులో నౌక సిబ్బంది కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారి సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

సోదరుడు స్టీవీ మనుహువా ఆ నౌకలో ప్రయాణికులకు వినోదం అందించేందుకు కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తున్నారని ఫ్రెడీ అనే వ్యక్తి చెప్పారు.

రెండురోజుల కిందటే నౌక సురబయా పోర్టులో ఉన్నప్పుడు మాట్లాడుకున్నామని, ఆ తర్వాత ఆయన గురించి ఎలాంటి సమాచారం అందలేదని ఆయన చెప్పారు

ఇండోనేషియాలో 17 వేలకుపైగా ద్వీపాలున్నాయి. అక్కడ ప్రయాణికుల రాకపోకలకు ఫెర్రీలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020 నుంచి 2026 మధ్య 111నౌకలు ప్రమాదానికి గురయ్యాయి.

దక్షిణ సులవేసిలోని సెలయార్ దీవుల ప్రాంతంలో జూలైలో ఓ ప్రమాదంజరిగింది. పోలస్సీ దీవికి పశ్చిమాన ఉన్న సముద్ర జలాల్లో కేఎం నూరులు సల్సా నౌక మునిగిపోయింది. మొత్తం 58మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 14మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.

గత నెలలో మదుర ద్వీపం సమీపంలోని ఓ ఫెర్రీలో మంటలు చెలరేగి ఐదుగురు చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)