లిల్లీ పాడింగ్ : ఉన్న ఉద్యోగంలో ఉండనివ్వని ఈ ధోరణి ఏమిటి? ఇందులో జెన్ జెడ్ ముందంజలో ఉందా?

లిల్లీ పాడింగ్

ఫొటో సోర్స్, Brittany Harris-Nelson

ఫొటో క్యాప్షన్, హారిస్-నెల్సన్ గత పదేళ్లలో ఆరు వేర్వేరు యూనివర్సిటీల్లో పది వేర్వేరు ఉద్యోగాలు చేశారు.
    • రచయిత, అలైస్ కాంటర్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

తన ఉద్యోగ ప్రస్థానాన్ని ‘లిల్లీ పాడింగ్ (తామరాకులపై కప్పలా గెంతుతూ ముందుకు వెళ్లడం)గా అభివర్ణించారు బ్రిట్నీ హారిస్-నెల్సన్.

''ప్రతిసారీ దారి నేరుగా లేకున్నా, నేను చివరకు చేరాలనుకున్న లక్ష్యానికి ప్రతి అడుగూ నన్ను మరింత దగ్గర చేసింది'' అని 32 ఏళ్ల నెల్సన్ చెప్పారు.

హారిస్-నెల్సన్ ప్రస్తుతం ఉత్తర కరోలినాలోని విన్‌స్టన్-సలేంలోని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని ఆమె ఎప్పటి నుంచో కోరుకున్నారు.

కోరుకున్న ఉద్యోగానికి చేరుకోవడానికి దాదాపు దశాబ్దం పాటు ఆమె ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి ఉద్యోగాలు మారుతూ వచ్చారు. ప్రతి కొత్త ఉద్యోగాన్ని ప్రత్యేక నైపుణ్యాలు సంపాదించుకునే అవకాశంగా మలుచుకున్నారు. కెరీర్‌లో ముందుకు సాగడానికి అవే ఆమెకు దోహదపడ్డాయి.

హారిస్-నెల్సన్ మొత్తంగా గత పదేళ్లలో ఆరు వేర్వేరు యూనివర్సిటీల్లో పది వేర్వేరు ఉద్యోగాల్లో పనిచేశారు. వాటిలో కొన్ని ఉద్యోగాలు ఆమె విద్యార్థినిగా ఉన్నప్పుడే చేశారు. ఆ తర్వాత మూడు పూర్తికాల ఉద్యోగాలు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హారిస్-నెల్సన్ ఇప్పుడున్నహోదాకు చేరుకోవడానికి ముందు ఆఫీస్ మేనేజర్‌గా, అడ్మిషన్స్ కౌన్సిలర్‌గా, విద్యార్థుల సలహాదారుగా పనిచేశారు.

ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నారో చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. అయితే ఉద్యోగం మారిన ప్రతిసారీ జీతం పెద్దగా పెరగలేదని చెప్పారు. కానీ జీతంతో కూడిన అదనపు సెలవులు, యజమాని తరఫున పింఛన్ నిధికి ఎక్కువ మొత్తంలో చెల్లింపులు వంటి మరిన్ని ప్రయోజనాలు లభించాయని వివరించారు.

''ప్రతి ఉద్యోగం కొత్త నైపుణ్యాలను నేర్పడంతో పాటు, అప్పటివరకు లేని కొత్త దృక్పథాన్ని అలవర్చుకునే అవకాశం కల్పించింది. ఆ అనుభవాలన్నీ కలిసి ప్రస్తుతం చేస్తున్న పనికి నన్ను సిద్ధం చేశాయి'' అని ఆమె చెప్పారు.

ఇలా ఆమె ఒక్కరే కాదు.

లిల్లీ పాడింగ్‌లో జెన్ జెడ్ ముందంజ

జెన్ జెడ్‌‌ (1997–2012 మధ్య జన్మించిన వారు) లో 'లిల్లీ పాడింగ్' అనే కొత్త ఉద్యోగ ధోరణి పుట్టుకొచ్చిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

ఒకే కంపెనీలో, ఒకే ఉద్యోగంలో కొనసాగడం కంటే తరచూ ఉద్యోగాలు మారుతూ కొత్త నైపుణ్యాలు సంపాదించుకోవడం, మరింత ఉన్నతస్థాయి ఉద్యోగాలు, మెరుగైన వేతనం పొందే అవకాశాలను పెంచుకోవడాన్ని ఈ ధోరణి సూచిస్తుంది.

దీని ద్వారా ఉద్యోగ విపణిలో తమ విలువను మరింత పెంచుకోవచ్చన్నది దీని వెనుక ఉన్న ఆలోచన.

ఈ ధోరణికి గణాంకాలు కూడా బలం చేకూరుస్తున్నాయి. ఉద్యోగ నియామక సంస్థ రాండ్‌స్టాడ్ 2024లో ప్రపంచవ్యాప్తంగా 11,250 మంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వేలో ఉద్యోగ జీవితంలోని తొలి ఐదేళ్లలో జెన్ జెడ్ ఉద్యోగులు ఒక్కో ఉద్యోగంలో సగటున 1.1 సంవత్సరాలు మాత్రమే కొనసాగుతున్నారు.

మిలీనియల్స్ (1981–1996 మధ్య జన్మించినవారు)లో ఇది 1.8 సంవత్సరాలు కాగా, అంతకంటే పెద్ద వయసు తరాల్లో దాదాపు మూడు సంవత్సరాలుగా ఉంది.

ఉద్యోగాలు తరచూ మారడం కనీసం యూకేలోనైనా ఎక్కువ వేతనాలకు దారితీస్తోందని 2025లో వెలువడిన మరో నివేదిక పేర్కొంది.

వెల్తిఫై అనే ఆర్థిక సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, గత పదేళ్లలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఉద్యోగాలు మారిన వారి సగటు వార్షిక ఆదాయం 39,276 పౌండ్లు. ఇతర ఉద్యోగుల సగటు వార్షిక ఆదాయం 30,088 పౌండ్లతో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ.

తమ కెరీర్ వ్యూహాన్ని 'లిల్లీ పాడింగ్' గా అభివర్ణించుకునే వారు తదుపరి అవకాశం కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు.

పని ప్రదేశ సంస్కృతిని మెరుగుపరచడం గురించి రచనలు, ప్రసంగాలు చేసే 42 ఏళ్ల ఆడమ్ స్మైలీ పోస్‌వోల్స్కీ కూడా అలాంటి వారిలో ఒకరు.

ఆడమ్ స్మైలీ పోస్‌వోల్స్కీ

ఫొటో సోర్స్, Adam Smiley Poswolsky

నిచ్చెనమెట్ల ప్రమోషన్ వద్దు

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఆడమ్ పోస్‌వోల్స్కీ మాట్లాడుతూ, ఒకే కంపెనీలో కొనసాగుతూ అంచెలంచెలుగా పైకి ఎదగాలనే సంప్రదాయ నిచ్చెనమెట్ల కెరీర్ ఆలోచన తనకు ఎప్పుడూ సరిపోలలేదన్నారు.

అందుకు బదులుగా, తన ఉద్యోగంలోనూ జీవితంలోనూ అర్థవంతమైన లక్ష్యం, సంతృప్తి కోసం వెతుకుతూ వచ్చానని చెప్పారు.

అందుకోసం గత 15 ఏళ్లలో ప్రభుత్వ, లాభాపేక్షలేని, సృజనాత్మక, కార్పొరేట్ రంగాల మధ్య మారుతూ అనేక ఉద్యోగాలు చేశానని తెలిపారు.

వాటిల్లో విదేశాల్లో యువ అమెరికన్లు స్వచ్ఛంద సేవలు అందించేలా అవకాశాలు కల్పించే అమెరికా ప్రభుత్వ సంస్థ పీస్ కార్ప్స్‌లో ప్రాజెక్ట్ లీడర్‌గా, హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ బోధకుడిగా పనిచేయడం కూడా ఉన్నాయి.

అంతేకాదు, న్యూయార్క్‌కు చెందిన వార్నర్ బ్రదర్స్ చిత్ర నిర్మాణ సంస్థకు లోకేషన్ స్కౌట్‌గా పనిచేశారు.

2008లో బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికల విజయవంతమైన ప్రచార బృందంలో భాగమయ్యారు.

యువ నాయకత్వ కార్యక్రమాల్లో వక్తగా, ఒక థింక్ ట్యాంక్‌లో ఫెలోగా కూడా పనిచేశారు.

తన ఉద్యోగ ప్రస్థానమంతా ఆసక్తికరమైన పనులనే వెతుకుతూ, ప్రతి ఉద్యోగంలో కొత్త నైపుణ్యాలు సంపాదించుకుంటూ వచ్చానని ఆయన చెప్పారు.

అవే ఇప్పుడు తనను పుస్తక రచయితగా, మంచి పారితోషికం అందుకునే ప్రొఫెషనల్ వక్తగా నిలబెట్టాయని వివరించారు.

"ప్రతి ఉద్యోగ మార్పులోనూ నేను కొత్తదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవాడిని. అదే సమయంలో, ఒక అనుభవం నుంచి మరో అనుభవానికి నేను ఏయే నైపుణ్యాలను తీసుకెళ్తున్నానో కూడా నాకు స్పష్టంగా తెలుసు" అని ఆయన చెప్పారు.

కార్పొరేట్ సంస్థల్లో సంప్రదాయ నిచ్చెనమెట్లు ఎక్కుతూ ఎదగడం కంటే, తన కెరీర్‌లో వచ్చిన ఈ మార్పుల ద్వారా స్వేచ్ఛ, సంతోషం లభించినందుకు ఆనందంగా ఉందని పోస్‌వోల్స్కీ అన్నారు.

అలాగే, 28 ఏళ్ల వయసులో పీస్ కార్ప్స్‌లో పనిచేసేటప్పుడు పొందిన 70 వేల డాలర్ల వార్షిక ఆదాయానికి సమానమైన స్థాయిని చివరకు మళ్లీ చేరుకోగలిగానని చెప్పారు.

"ఆ ప్రభుత్వ ఉద్యోగంలో నేర్చుకున్న నైపుణ్యాలు నన్ను రచయితగా తీర్చిదిద్దాయి. వాటి వల్లే నేను పుస్తకం రాయగలిగాను. అదే చివరకు నన్ను నేటి వృత్తిపరమైన కీలక వక్త గా నిలబెట్టింది" అని ఆయన చెప్పారు.

యువతకు వైవిధ్యమూ, వేగమూ కావాలి

తమ కెరీర్ గురించి ప్రజలు ఆలోచించే విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని యూకే బీమా సంస్థ హిస్కాక్స్‌లో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నికోలా గ్రాంట్ చెప్పారు.

ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారు ఒకే మార్గంలో నెమ్మదిగా ఎదగడం కంటే, తక్కువ సమయంలో విస్తృత అనుభవాన్ని సంపాదించాలని కోరుకుంటున్నారని ఆమె తెలిపారు.

ఇందుకోసం వారు వివిధ రకాల నైపుణ్యాల సమాహారాన్ని రూపొందించుకుంటున్నారని చెప్పారు.

అలాగే తమ ఉద్యోగపరమైన ఎదుగుదల మందగించిందని లేదా అవకాశాలు పరిమితంగా ఉన్నాయని భావిస్తే యువ ఉద్యోగులు మరో ఉద్యోగానికి మారేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదని ఆమె పేర్కొన్నారు.

"అంచనాలు మారిపోయాయి. ప్రజలు వైవిధ్యాన్ని వేగాన్ని కోరుకుంటున్నారు. భవిష్యత్తులోనూ ఉపయోగపడే నైపుణ్యాలను సంపాదించుకోవాలనుకుంటున్నారు. అదంతా ఎదగాలనే తపనలో భాగమే" అని ఆమె చెప్పారు.

"చివరికి ఇది ఉద్యోగికీ సంస్థకూ ప్రయోజనం చేకూరుస్తుంది" అని ఆమె అన్నారు.

ఐటీ సంస్థ లా ఫోస్‌లో వ్యూహాత్మక బ్రాండ్, కమ్యూనికేషన్స్ విభాగ నాయకురాలిగా, ఉద్యోగుల అనుభవాల నిపుణురాలిగా పనిచేస్తున్న లూసీ కెంప్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆమె దృష్టిలో 'లిల్లీ పాడింగ్' అనేది తాత్కాలిక ధోరణి కాదు.భవిష్యత్ ఉద్యోగ సంస్కృతికి నిదర్శనం.

ఈ విధానాన్ని అనుసరించే వారు ఉన్నత హోదాలు, మెరుగైన వేతనం లక్ష్యంగా ముందుకు సాగుతారని ఆమె చెప్పారు.

"విధేయతకు ఇప్పుడు పెద్దగా ప్రతిఫలం ఉండదని యువత గుర్తించింది. తమ విలువైన నైపుణ్యాల ఆధారంగానే వారు తమ కెరీర్‌ను మలచుకోవాలని కోరుకుంటున్నారు" అని కెంప్ చెప్పారు.

"పాత తరాలతో పోలిస్తే యువత గెలుపును కొలిచే విధానం భిన్నంగా ఉంది. పని పట్ల వారి అనుభవం కూడా పూర్తిగా మారిపోయింది" అని ఆమె అన్నారు.

కొవిడ్ మహమ్మారి తర్వాత ఇంటి నుంచే పనిచేసే విధానం పెరగడం, ప్రాథమిక పనులను కృత్రిమ మేథ (ఏఐ) చేయడం వల్ల సహోద్యోగుల నుంచి కార్యాలయంలో నేర్చుకునే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని కెంప్ చెప్పారు.

దానికి బదులుగా, మరో ఐదేళ్ల తర్వాత కూడా ఉపయోగపడే నైపుణ్యాలపైనే ఇప్పుడు ప్రజలు దృష్టి పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. వాటిని సంపాదించడానికి మరో బృందంలోని ప్రాజెక్టుకు మారడం, వేరే రంగంలోకి అడుగుపెట్టడం లేదా మరో కంపెనీలో ఉద్యోగంలో చేరడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారని చెప్పారు.

"కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే తపన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలనే కోరిక ప్రజల్లో కనిపిస్తోంది" అని ఆమె అన్నారు.

హారిస్-నెల్సన్ కూడా ఇదే భావన వ్యక్తం చేస్తారు.

"నా కెరీర్‌ను నేను ఒక గమ్యస్థానంగా కాదు, నిరంతరం సాగే ప్రయాణంగా చూస్తాను. నేర్చుకోవడం, ఎదగడం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి" అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)