దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: 43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

మోదీ, కేజ్రీవాల్, రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో ఆప్ పదేళ్లుగా అధికారంలో ఉంది.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 11 గంటల సమయంలో బీజేపీ 41 సీట్లలో ఆధిక్యంలో ఉండగా ఆప్ 29 నియోజకవర్గాలలో ఆధిక్యంలో ఉంది.

70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు.

ఈ ఎన్నికలలో దిల్లీలో ఓటింగ్ శాతం తగ్గింది. 2013లో 66 శాతం, 2015లో 67, 2020లో 63 శాతం ఓటింగ్ నమోదవగా ఈ సారి 60.4 శాతానికి పడిపోయింది.

మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని, పాలక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రెండో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశాయి.

దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 12 రిజర్వ్‌డ్ సీట్లు కాగా మిగిలిన 58 జనరల్ సీట్లు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినప్పటికీ.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలో దిగాయి.

ఎన్నికలకు ముందు దిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిషి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

ఆ పార్టీ నేత కేజ్రీవాల్ తనపై ఉన్న అవినీతి ఆరోపణలు తప్పు అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
దిల్లీలో ప్రధాన పోటీ ఎవరి మధ్య?

దిల్లీలో ఆప్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. దిల్లీలో ఆప్ దశాబ్దానికి పైగా అధికారంలో ఉంది.

2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ బలపడి ఒకప్పుడు పోటీలో కూడా కనిపించని ప్రాంతాల్లోనూ విస్తరించింది.

ఆప్ ప్రభుత్వం ఏర్పడకముందు దిల్లీలో షీలా దీక్షిత్ నాయకత్వంలో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత ఆమ్ ఆద్మీ అధికారం కొనసాగింది.

2013లో కాంగ్రెస్ ఆప్‌కు మద్దతు ఇచ్చింది. తరువాత, కాంగ్రెస్ ఓట్లు తగ్గడం ప్రారంభించాయి.

బీజేపీ ఓట్లు 30 శాతానికి పైగా ఉండగా కాంగ్రెస్ ఓట్లు ఆప్ ఖాతాలోకి వెళ్లాయి.

 మోదీ, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలూ బీజేపీ గెలుచుకుంది.
గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమిటి?

2011లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా దిల్లీలో ఒక ఉద్యమం జరిగింది. అన్నాహజారేతో పాటు, అరవింద్ కేజ్రీవాల్ కూడా అందులో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌ను బహిరంగంగా విమర్శించేవారు.

2013లో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, తొలి ఎన్నికల్లోనే 70 సీట్లకు 28 సీట్లు గెలుచుకుంది.

కాంగ్రెస్ ఆశ్చర్యకరంగా ఆప్‌కు మద్దతు ఇచ్చింది. దాంతో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు.

దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 30కి పైగా స్థానాలను బీజేపీ గెలుచుకున్న చివరి సంవత్సరం 2013. ఆ తర్వాత ఆ పార్టీ రెండంకెల మార్కును కూడా దాటలేకపోయింది.

2013 తర్వాత ఆప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ పార్టీ 2015, 2020లో దిల్లీలో సొంతంగా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2013లో ఆప్ 28 సీట్లు గెలుచుకుని 29 శాతానికి పైగా ఓట్లను పొందింది. కాంగ్రెస్ ఓట్ల వాటా అప్పుడు దాదాపు 25 శాతం. ఆ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 30 శాతానికి పైగా ఓట్లను సాధించి 31 సీట్లు గెలుచుకుంది.

అయితే, 2013 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 2015లో మూడు సీట్లకు పడిపోయింది . ఆ ఎన్నికలలోనూ బీజేపీ ఓట్ల శాతం 30 శాతం కంటే ఎక్కువే ఉంది. ఆప్ 50 శాతానికి పైగా ఓట్లను పొంది 67 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పది శాతం ఓట్లు కూడా సాధించలేకపోయింది.

2020లో ఆప్ 50 శాతానికి పైగా ఓట్లతో 60 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. బీజేపీకి ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి, కానీ దాని ఓట్ల వాటా 30 శాతానికి పైగా ఉంది.

2015, 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగింది?

2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి.

ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో భాగంగా ఉన్న కాంగ్రెస్, ఆప్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసినప్పటికీ బీజేపీ క్లీన్ స్వీప్‌ను ఆపలేకపోయాయి.

2013 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆప్‌కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ దాంతో చేతులు కలిపింది.

కానీ కొన్ని నెలల తర్వాత జరిగిన ప్రస్తుత దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దాంతో ఈసారి ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి.

ఏ సీట్లపై దృష్టి ఉంటుంది?

మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌ను న్యూదిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీకి దింపింది.

మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడి నుంచి ఆప్ తరఫున పోటీచేశారు.

2013 ఎన్నికల్లో కేజ్రీవాల్ ఈ స్థానంలో షీలా దీక్షిత్‌ను ఓడించారు. అప్పటి నుంచి ఆయన ఈ స్థానం నుంచే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

దిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై మాజీ ఎంపీ రమేష్ బిధూరిని కల్కాజీ నుంచి బీజేపీ పోటీకి దింపింది. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా ఇక్కడ బరిలో నిలిచారు.

ఈసారి, ఆప్ దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను జంగ్‌పురా స్థానం నుంచి పోటీలో నిలిపింది. ఆయన స్థానంలో పట్‌పడ్‌గంజ్ నుంచి అవధ్ ఓజా పోటీచేశారు.

ఈ సారి దిల్లీ ఎన్నికలు ఎందుకు ప్రత్యేకం?

ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్‌లో తన రాజీనామాను ప్రకటిస్తూ, ప్రజలు తనను ఈ పదవిలో కూర్చోమని అడిగే వరకు తాను మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనని అన్నారు.

కేజ్రీవాల్ రాజీనామా తరువాత ఆ పార్టీ దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషిని ఎన్నుకుంది.

అయితే ఈ ఎన్నికల్లో గెలిస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆ పార్టీ ఇంకా స్పష్టం చేయలేదు.

దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా జైలుకు వెళ్లొచ్చారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)