భారత్-చైనా ఉద్రిక్తతలు: 40 ఏళ్ళుగా లేని వివాదం ఇప్పుడు ఎందుకు?

ప్రచురణ

ప్ర‌పంచంలోనే అత్యధిక‌ జ‌నాభాగ‌ల రెండు దేశాల సేన‌లు హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. త‌మ వ్యూహాత్మ‌క ల‌క్ష్యాలే ప‌ర‌మావ‌ధిగా రెండు దేశాలూ ముందుకెళ్తున్న త‌రుణంలో ఈ ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

క‌శ్మీర్‌లోని ల‌ద్దాఖ్‌‌లో వివాదాస్ప‌ద ప్రాంత‌మైన గాల్వాన్ లోయ‌లోకి వేల మంది చైనా సైనికులు అక్ర‌మంగా ప్ర‌వేశించారని అధికారులు చెబుతున్న‌ట్లు భారత్‌ మీడియా వెల్లడిస్తోంది. ఈ ప‌రిణామాలు భార‌త్ నాయ‌కుల‌తోపాటు సైనిక నిపుణుల‌నూ నిర్ఘాంత‌పోయేలా చేస్తున్నాయి.

భార‌త్ తమ భూభాగంగా భావిస్తున్న ప్రాంతంలో మే మొద‌టి వారంలో చైనా బలగాలు టెంట్లు వేశాయ‌ని, గొయ్యిలు త‌వ్వాయ‌ని, కొన్ని కిలోమీట‌ర్ల వ‌ర‌కూ భారీ సామ‌గ్రిని త‌ర‌లించాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. 2008లో మ‌ళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చిన ఇక్క‌డున్న ఓ వైమానిక స్థావ‌రాన్ని అనుసంధానిస్తూ భార‌త్ వందల‌ కి.మీ. పొడ‌వైన ఓ రోడ్డును నిర్మిస్తోంద‌న్న వార్త‌ల వ‌చ్చిన నేప‌థ్య‌ంలో తాజా ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.

ఇది సాధార‌ణ చొర‌బాటుకాద‌ని, ఈ చ‌ర్య ద్వారా చైనా స్ప‌ష్టమైన సందేశం ఇస్తున్న‌ట్లు భార‌త్‌లోని నిపుణులు భావిస్తున్నారు."ఇది చాలా తీవ్ర‌మైన ప‌రిణామం. భార‌త్‌లో భాగ‌మేన‌ని ఇదివ‌ర‌కు అంగీక‌రించిన ప్రాంతంలోకి చైనా సేన‌లు అడుగు పెడుతున్నాయి. ప్రస్తుత‌ ప‌రిస్థితుల‌ను ఈ చ‌ర్య‌లు పూర్తిగా తారుమారు చేస్తున్నాయని భార‌త సైనిక వ్య‌వ‌హారాల నిపుణులు, మాజీ క‌ల్న‌ల్‌ అజ‌య్ శుక్లా అన్నారు.

కానీ భార‌త్ వ‌ల్లే క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితులు మారుతున్నాయ‌ని చైనా వ్యాఖ్యానిస్తోంది. ల‌ద్దాఖ్‌‌లో ఇప్ప‌టికే రెండు సార్లు ఇరు సైన్యాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగాయ‌ని భార‌త్ మీడియా చెబుతోంది. గాల్వాన్ లోయ‌, హాట్ స్ప్రింగ్స్‌, ప్యాంగాంగ్ లేక్‌ల‌లో సైన్యాలు ఢీ అంటే ఢీ అని ఎదురుప‌డిన‌ట్లు వివ‌రిస్తోంది. ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య క‌నిపిస్తున్న ఉద్రిక్త ప‌రిస్థితులు కేవ‌లం ల‌ద్దాఖ్‌కు మాత్ర‌మే ప‌రిమితం కావు. భార‌త్‌లోని ఈశాన్య రాష్ట్రం సిక్కింతో చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన నాకూ లా పాస్‌లోనూ రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఈ నెల మొద‌ట్లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం క‌నిపించింది.

దీనికితోడు నేపాల్ కొత్తగా విడుద‌ల‌చేసిన ఓ మ్యాప్ కూడా స‌రిహ‌ద్దుల్లో వివాదానికి కార‌ణ‌మైంది. త‌మ భూభాగంలో అక్ర‌మంగా రోడ్డు నిర్మిస్తున్నార‌ని భార‌త్‌పై నేపాల్ ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)