కరోనావైరస్: మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్ల ఐసీయూ ఎలా ఉందో చూడండి...

వీడియో క్యాప్షన్, కోవిడ్ ఆస్ప‌త్రి ఐసీయూ ఇలా ఉంటుంది
ప్రచురణ

మహారాష్ట్రపై కరోనా చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. ముఖ్యంగా ముంబయి నగరమైతే కరోనా హాట్‌స్పాట్‌గా నిలిచింది. ఇప్పటి వరకు రెండు వేల మందికి పైగా చనిపోయారు. కరోనా పోరాటంలో ప్రభుత్వ ఆసుపత్రులదే కీలక పాత్ర. రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఆసుపత్రుల సామర్థ్యం సరిపోవడం లేదు. బీబీసీ ప్రతినిధి మయూరేశ్ కొన్నూర్ ముంబయిలోని కేఈఎం హాస్పిటల్ ఐసీయూ వార్డును సందర్శించి అందిస్తున్న కథనం.

"ఇక్కడున్న ఒక్కో పేషెంటుది ఒక్కో కథ. ఇక్కడి పేషెంట్ల పరిస్థితి ఏమిటో వాళ్ల బంధువులకు తెలియదు. ఎందుకంటే వాళ్లు ఇక్కడ ఉండరు కాబట్టి. భారతదేశంలో ఎవరికైనా బాగా లేకపోతే ఇంట్లో వాళ్లందరూ వారికి దగ్గరగా ఉంటారు. కానీ కరోనా వల్ల పరిస్థితి మారిపోయింది. కరోనా రోగులు ఒక చోట ఉంటే వారి ఇంట్లో వాళ్లు మరోచోట క్వారంటైన్‌‌లో ఉంటున్నారు. వారి వద్ద ఫోన్లు ఉన్నా మాట్లాడటం కాస్త కష్టమే. ఇలాంటి కారణాల వల్ల పేషెంట్లు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. పేషెంట్లు, డాక్టర్లు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజూ వారిని చూస్తుంటాం కాబట్టి రోగులకు, వారి బంధువులకు మధ్య మేమే సమాచార వారధులుగా మారాం. ఎంత వద్దనుకుంటున్నా పేషెంట్లతో ఒకరకమైనా ఉద్వేగపూరిత బంధాన్ని పెంచుకుంటున్నాం. మాకు ఇదొక సవాలు. కానీ వైద్యులుగా వీటన్నింటినీ మేము ఎదుర్కోక తప్పదు" అని డాక్టర్ స్మతి వాజపేయి అన్నారు.

ఇక్కడి 450కుపైగా ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీయూల్లో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాల కోసం పోరాడుతున్నారు.

ముంబయి నగరంలోని ఏదో ఒక ఆసుపత్రిలోనో లేక ఐసీయూ వార్డులోనో బెడ్లు దొరకడం లేదంటూ ఫిర్యాదులు రోజూ వినిపిస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రతి రోజూ కొత్త పేషెంట్లు చేరుతూనే ఉంటారు.

ముంబయిలోనే కాదు దేశమంతా ముందుండి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. డాక్టర్ స్మృతికి కూడా వైరస్ సోకింది. కరోనా నుంచి కోలుకున్నాక ఆమె తిరిగి విధులకు వస్తున్నారు.

కోవిడ్-19 ఆసుపత్రిగా ప్రకటించిన తరువాత కేజీఎం హాస్పిటల్‌లోని కొన్ని సాధారణ వార్డులను క్రిటికల్ కేర్ వార్డులుగా మార్చారు. ఇది అటువంటి వార్డే. ఆరుగంటల పాటు రక్షణ సూటు ధరించి ఇక్కడ పని చేయడమనేది అంత సులభం కాదు. మూడు ఐసీయూ వార్డులను చూసుకుంటున్నారు డాక్టర్ కవితా జోషి.

"ఒకసారి రక్షణ సూట్లు ధరించి మేం ఐసీయూలోకి ప్రవేశించాక విరామం లేకుండా ఆరుగంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. నీళ్లు కూడా తాగలేం. తల నుంచి కాళ్ల వరకు పూర్తిగా చెమటలు పడతాయి. అందువల్ల చర్మం మీద దద్దుర్లు లేస్తున్నాయి" అని డాక్టర్ కవిత చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)