కరోనాతో పోరాడి గెలిచి తిరిగి డ్యూటీకి వస్తున్న పోలీసులకు ఘన స్వాగతం

ప్రచురణ

తమిళనాడు పోలీసు డిపార్ట్‌‌మెంట్‌‌లో కరోనా బారినపడిన మొదటి వ్యక్తి ఎస్ఏ అరుణాచలం. అంతేకాదు, కోవిడ్ నుంచి కోలుకుని మళ్ళీ విధులకు హాజరైన మొదటి వ్యక్తి కూడా ఆయనే. బీ2 ఎస్‌ప్లానాడ్ పోలీస్ స్టేషన్‌‌లో పెట్రోలింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అరుణాచలం, "మా ఇంట్లో వాళ్లకు కరోనా సోకలేదని తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డా. అలాగే నాతో పని చేసే వాళ్లకు నెగిటివ్ రావడంతో ఇంకా ఆనందించా. ఎందుకంటే నా నుంచి ఎవరికీ కరోనా సోకకూడదని అనుకున్నా" అని చెప్పారు.

ఆయన లాగా కోవిడ్‌ను జయించి తిరిగి విధులకు హాజరవుతున్న పోలీసులకు తమిళనాడులో ఘన స్వాగతం లభిస్తోంది.

ముత్తుసామీ ఐపీఎస్, డెప్యూటీ కమిషనర్, చెన్నైలోని అన్నా నగర్ డివిజన్‌లో డెప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ముత్తుసామి కూడా, "భద్రతా ఏర్పాట్లు పరిశీలించేందుకు తరచూ రాత్రుళ్లు నేను కోయంబేడు మార్కెట్‌కు వెళుతూ ఉండేవాడిని. 65 ఎకరాల్లో ఉన్న ఈ మార్కెట్‌లో సుమారు 4000 షాపులుంటాయి. ప్రతిరోజు సగటున 30 వేల నుంచి 40 వేల మంది ఈ మార్కెట్‌కు వస్తారు. భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి ఒకరికొకరు దూరంగా ఉండేలా చూడటం, భద్రతా ఏర్పాట్ల కోసం చాలా మంది పోలీసులను మేం విధుల్లో ఉంచాం. రోజుకు 200 మందికి డ్యూటీలు వేసే వాళ్లం. నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే మా ఇంట్లో వాళ్లు భయపడ్డారు. వాళ్లకు కూడా తల నొప్పి, జ్వరం రావడం మొదలైంది. ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగిందని వారు చాలా ఆందోళనపడ్డారు" అని చెప్పారు.

అయేత, ధైర్యంగా ఉండమని తన కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన ఆస్పత్రిలో చేరారు. వైరస్‌ను జయించారు. "కరోనా చికిత్సకు ముందుగా కావాల్సిన మందులు ధైర్యం, మనపై మనకు నమ్మకం. ఈ రెండూ లేకుండా మీరు ఎన్ని మందులు తీసుకున్నా వృథానే. కరోనాను జయించి తిరిగి కోలుకుంటామని పూర్తిగా మనం నమ్మాలి. అప్పుడు తప్పకుండా ఎవరైనా కోలుకుంటారు. మళ్లీ ఇంట్లో భార్యాబిడ్డలతో కలిసి మునుపటిలా సంతోషంగా జీవించగలరు. వందశాతం మనల్ని మనం నమ్మడం, ధైర్యంతో ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)